సీఎన్‌జీ.. నో స్టాక్
మహా నగరానికి సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరంలోని సుమారు 25 వేల సీఎన్‌జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం (గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
సాక్షి, హైదరాబాద్: మహా నగరానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) సరఫరా నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని శామీర్‌పేటలోగల మదర్‌స్టేషన్‌కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ఆగిపోయింది. ఫలితంగా మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 30 ఫ్లాట్‌లతో పాటు మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్(పీఎన్‌జీ), నగరంలోని 15 ఫిల్లింగ్ స్టేషన్లకు సీఎన్‌జీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన గెయిల్ పైప్‌లైన్ ఘటన ప్రభావం పైప్‌లైన్ గ్యాస్ సరఫరాపై పడినట్లయింది.
ఆగిన సీఎన్జీ వాహనాలు: నగరంలోని సుమారు 25వేల సీఎన్‌జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం(గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీఎన్‌జీ సరఫరా లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లోని స్టేషన్‌లను మూసివేసి నో స్టాక్ అని బోర్డులను ప్రదర్శించారు. దీంతో మంగళవారం రాత్రి పలు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. వాస్తవంగా నగరంలోని ఒక్కో స్టేషన్‌కు ప్రతి రోజూ 1000 ఆటోలు, 200 కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలుకాగా 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం పదికిలోలు కాగా ఎనిమిది కిలోల వరకు నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. అంటే సగటున ప్రతిరోజూ మొత్తం స్టేషన్లకు 90 వేల కిలోల గ్యాస్ సరఫరా అవసరం.
వారం వరకు సరఫరా బంద్: గెయిల్ దుర్ఘటన దృష్ట్యా పైప్‌లైన్ పనుల మరమ్మతులకు వారం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పలు సీఎన్‌జీ వాహనాలకు ప్రత్యాయ్నాయం లేకుండా పోయింది.
ఆటోడ్రైవర్ల ఆందోళన: సీఎన్‌జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆటో్రైడె వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఆటోలను నడిపితే రాయితీలతో పాటు ఐదేళ్ల పాటు రోడ్డు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో వేల రూపాయలు ఖర్చు చేసి సీఎన్జీ కిట్స్ అమర్చుకున్న ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం స్టేషన్ల ముందు పడిగాపులు గాస్తున్నారు.