చీరాల, న్యూస్‌లైన్: చేనేత కార్మిక సహకార సంఘాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కార్మికుల పేరు చెప్పుకొని సంఘ పెద్దలు నిధులన్నీ బొక్కేస్తున్నారు. సొసైటీలో సభ్యులుగా ఉండే కార్మికులకు మాత్రం చివరకు అప్పులు, పస్తులే మిగులుతున్నాయి. కార్మికులంతా కలిసి ఓ సంఘంగా ఏర్పడి, ఆ సంఘంలోనే వస్త్రాలు ఉత్పత్తి చేసి ఆప్కో ద్వారా వాటిని విక్రయించి వచ్చిన లాభాలతో జీవనం సాగించాల్సి ఉంటుంది. అలానే ఆ సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలతో పాటు తక్కువ ధరకే నూలు, ఆప్కో సబ్సిడీతో పాటు అనేక రాయితీలు కల్పిస్తుంది.
ఈ సంఘంలో పనిచేసే కార్మికులంతా ఐక్యంగా ఉండి వచ్చిన ఫలాలను సమానంగా పంచుకోవాలి. సహకార బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు పావలా వడ్డీ కింద రుణాలు తీసుకుంటున్నారు. అలానే ఎలాంటి వస్త్రాలు నేయకుండానే ఆప్కో ద్వారా అమ్మినట్లు రికార్డుల్లో చూపి అందులో వచ్చే 40 శాతం సబ్సిడీని కూడా మింగేస్తున్నారు. కానీ కనీసం పది మంది కార్మికులకు కూడా పని చూపుతున్న సంఘాలు లేవు. జిల్లాలో మొత్తం 74 చేనేత సొసైటీలుండగా వీటిలో 38 వేల మంది సభ్యులున్నారు. కోఆపరేటివ్ స్కీంలో 15 వేల మంది, బునకర్ బీమా యోజనలో 7 వేల మంది, ఇతర పథకాల్లో 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. చేనేత సొసైటీలు చీరాల నియోజకవర్గంలో 30, కనిగిరి నియోజకవర్గంలో 10, ఒంగోలు డివిజన్‌లో 10, బేస్తవారిపేటలో 10, ఉలవపాడులో 2, మార్టూరులో 3 సొసైటీలున్నాయి. ఈ 74 చేనేత సొసైటీల్లో క్యాష్ క్రెడిట్ కింద నాబార్డు నుంచి కేవలం 23 సొసైటీలకు * 2.8 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారు. మిగిలిన 51 సొసైటీలకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు.
పొందుతున్న రాయితీలివే..
సొసైటీల మాటున సహకార బ్యాంకుల ద్వారా ఒక్కో సొసైటీ లక్ష నుంచి * 40 లక్షల వరకు రుణాలు పొందాయి. అలానే సహకార సంఘాల్లో ఎలాంటి వస్త్రాలు ఉత్పత్తి చేయకుండానే ఆప్కోలోని అధికారులతో కుమ్మక్కై ఉత్పత్తులు ఆప్కోకు విక్రయించినట్లు సొసైటీ నిర్వాహకులు రికార్డుల్లో చూపుతారు. దీని ద్వారా ఆప్కో 30 నుంచి 40 శాతం సబ్సిడీ రూపంలో సహకార సంఘాలకు అందిస్తుంది. అంటే లక్ష రూపాయల విలువైన వస్త్రాలను అమ్మితే * 40 వేలు సబ్సిడీ కింద సహకార సంఘానికి అందుతుంది. అలానే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా నామమాత్రపు వడ్డీలకు ఈ సొసైటీలకు భారీగా రుణాలందుతున్నాయి. ఎన్‌హెచ్‌డీసీ ద్వారా సబ్సిడీ నిధులు అందుతున్నాయి. అలానే ట్రైనింగ్‌లు, ఎగ్జిబిషన్ల పేరుతో సహకార సంఘాలకు నిధులు మంజూరవుతున్నాయి. ఇవన్నీ కార్మికులందరికీ సమానంగా రావాల్సి ఉంటే సొసైటీ పెద్దలు గద్దలుగా మారి ఈ నిధులన్నీ నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఉపాధి కోల్పోతున్న నేతన్నలు..
సహకార సంఘాల్లో ఉన్న చేనేత కార్మికులకు పనులు కల్పించాల్సిన సొసైటీలు నామమాత్రంగా కూడా కార్మికులకు పనులు కల్పించడం లేదు. పనులు కల్పించే నాథుడే లేక కార్మికుడు వేరే పనులపై ఆధారపడుతున్నాడు. నేతన్నలు బడాబాబుల మోసానికి గురవుతూ అర్ధాకలితో, అప్పుల ఊబిలో అలమటిస్తున్నారు.
నిధులు మింగేందుకు పుట్టుకొచ్చిన కొత్త సొసైటీలు...
సొసైటీలు లాభసాటి వ్యాపారంగా మారడంతో కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు, రాయితీలను మింగేందుకు నూతనంగా మరికొన్ని సొసైటీలు ప్రవేశించాయి. కొత్తగా ఏడు సొసైటీలు జిల్లాలో ఏర్పడ్డాయి. చేనేత కార్మికుల బలహీనతను కొంత మంది సొసైటీ పెద్దలు అవకాశంగా తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. కార్మికుల పేరుతో రుణాలు తీసుకొని వారు సకల భోగాలు అనుభవిస్తుంటే కార్మికులు మాత్రం కష్టాల పాలవుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి వాటి వైపు కన్నెత్తి చూడటమే మరిచారు.
అధికారుల లాలూచీతోనే అక్రమాలు..
చేనేత సొసైటీల అక్రమాలు ప్రధానంగా అధికారుల కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయి. సొసైటీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే కాసులకు కక్కుర్తిపడి అటు వైపు చూడటం లేదు. రికార్డులపైనే నడుస్తున్న సొసైటీల గురించి పక్కా సమాచారం ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. చాలా సొసైటీల్లో పది మంది సభ్యులు కూడా లేకపోయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం దారుణం.
మామూళ్లతో లాలూచీ పడుతున్న అధికారులు
Published Sun, Dec 29 2013 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement