అధిక సబ్సిడీ కోసం వ్యవసాయ విద్యుత్ వాడకాన్ని పెంచి చూపే యత్నం
2015-16లో 13,431 మిలియన్ యూనిట్లు అవ సరమని అంచనా
ఈ అంచనాలను తప్పుబట్టిన తెలంగాణ ఈఆర్‌సీ
20 శాతం వ్యవసాయ విద్యుత్‌కు కత్తెర
10,650 మిలియన్ యూనిట్లు చాలంటూ సర్దుబాటు
హైదరాబాద్: ఉచిత విద్యుత్ విషయంలో డిస్కంలు సర్కారును తప్పుదోవ పట్టించాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులను ఎక్కువగా ఆశించి వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని పెంచి చూపేందుకు ప్రయత్నించాయి. అయితే కొత్త విద్యుత్ చార్జీలను ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని భారీగా నియంత్రించింది. డిస్కంలు కోరినంతగా అవసరం లేదని ఏకంగా 20 శాతం మేరకు కత్తిరించింది. డిస్కంల అంచనాలను తప్పుబట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 13,431 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయన్న అంచనాలతో తెలంగాణ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా కేవలం 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతాయని ఈఆర్‌సీ కత్తెర వేయటంతో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇబ్బడిముబ్బడిగా అంచనాలు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ సదరన్ డిస్కం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ను అధికంగా చూపిందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్నప్పుడు... 2013-14లో వ్యవసాయానికి 6,694.29 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు లెక్కలున్నాయి. ఆ రెండు జిల్లాలు మినహాయిస్తే ఈ వినియోగం కొంత మేరకైనా తగ్గుముఖం పట్టాల్సింది. కానీ 2014-15లో 7,238.26 మిలి యన్ యూనిట్లు, 2015-16లో 7,529.19 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి అవసరమని సదరన్ డిస్కం అంచనా వేసింది. రాజధాని చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అర్బన్ ప్రాంతమే ఎక్కువగా ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్ అవసరం అంత భారీగా పెరగదని ఈఆర్‌సీ గుర్తించింది. అందుకే ఎస్‌పీడీసీఎల్‌కు 6,350 మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ కేటగిరీకింద సరిపోతుం దని నియంత్రించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్‌పీడీసీఎల్ ప్రస్తుత సంవత్సరంలో 4,715.21 మిలియన్ యూనిట్ల విద్యుత్, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,903.82 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసింది. కానీ ఈఆర్‌సీ 4,300 మిలియన్ యూనిట్లకు సర్దుబాటు చేసింది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరిగిపోతున్నాయని.. అందుకే ఉచిత విద్యుత్ వాడకం పెరిగిపోతుందనేది డిస్కంల వాదన. గతంలో ఈఆర్‌సీ నిర్ధారించినదాని కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉచిత కేటగిరీకి సరఫరా చేసినట్లుగా డిస్కంలు తమ నివేదికల్లో స్పష్టం చేశాయి. వ్యవసాయానికి మీటర్లు లేకపోవటం, ఎంత విద్యుత్ సరఫరా అయిందో పక్కాగా లెక్కతేల్చే వ్యవస్థ లేకపోవటంతో ఈ వాదనకు బలం లేకుండా పోతోంది. పంపిణీ, సరఫరా నష్టాలు, భారీ విద్యుత్ చౌర్యంతో వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు.. డిస్కంలు ఉచిత విద్యుత్ కోటాలో ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని చూపిస్తున్నాయనే విమర్శలున్నాయి. అందుకు భిన్నంగా ఉచిత విద్యుత్... నష్టాలు తెచ్చిపెడుతోందని.. ప్రభుత్వం సరిపడేంత సబ్సిడీ ఇవ్వకపోవటంతో ఆర్థికంగా భారంగా మారుతోందనేది డిస్కంల వాదన. టీ సర్కార్ తొలి ఏడాది నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఉచిత విద్యుత్‌కు రూ.3,600 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌కు ఈఆర్‌సీ భారీ మొత్తంలోనే కత్తెర వేసినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్కారు రూ. 4,427 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించటం డిస్కంలకు ఊరటనిచ్చినట్లయింది.
కాగ్ చెప్పింది కూడా ఇదే..
ఉచిత విద్యుత్ సరఫరాకు మీటర్లను అమర్చటం అత్యంత అవసరమని.. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా వేలెత్తి చూపింది. విద్యుత్ వినియోగంలో తప్పుడు అంచనాలు డిస్కం లకు నష్టాలు తెచ్చి పెడుతున్నాయని అభిప్రాయపడింది. ‘2004-05లో వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు మీటర్లను అమర్చాలని ఏపీఈఆర్‌సీ సూచిం చింది. కానీ.. డిస్కంలు ఆ విధానాన్ని అమలు చేయలేదు. 2010 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ వినియోగం ఆమోదిం చినదాని కంటే 4,986.93 మిలియన్ యూనిట్లు మించిపోయి రూ.1,861.44 కోట్ల అధిక వ్యయమైంది. ఈఆర్‌సీ ఆమోదించిన పరిమితికి లోబడి ఉచిత విద్యుత్ నియంత్రణకు డిస్కంలు ఏ చర్యలూ తీసుకోలేదు. డిస్కంలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వటం ఆలస్యం కావటంతో రూ.76.83 కోట్ల వడ్డీ నష్టం వాటిల్లింది’ అని పేర్కొంది.
‘ఉచితం’పై డిస్కంల తప్పుడు లెక్కలు
Published Sun, Mar 29 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM
Advertisement