సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండేళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున.. ఆలోపు పెద్ద మున్సిపాలిటీలను కార్పొ రేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి.
కొత్త మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట–జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేటలను ఏర్పాటుచేశారు. ఇవన్నీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల ఉన్న పెద్ద మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయలేదు. ఈ క్రమంలో మున్సిపాలిటీలుగానే ఉన్న కొ న్ని జిల్లా కేంద్రాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాలుగా మారిన పలు పట్టణాల్లో పెరిగిన జన సాంద్రతకు అనుగుణంగా వాటిని కా ర్పొరేషన్లుగా మార్చాలనే డిమాండ్ వస్తోంది.
గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపాలిటీలలో..
కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. కనీసం మూడు లక్షల జనాభా గల పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చుకునే వీలుంది. రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల పట్టణాలు స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు, పట్టణాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్లుగా మార్చుకునే అవకాశముంది.
- గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్ చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టుదలతో ఉన్నారు. ఆయన సూచనల మేరకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్‌తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
- ఇదే తరహాలో జనాభా ప్రాతిపదికన నల్లగొండ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను కూడా విస్తరించి కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలన్న చాలా కాలం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లుగా మారితే ఈ రెండు పట్టణాలు సరికొత్తగా మారుతాయని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు.
- కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలలో సిద్ధిపేట, మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ గ్రేడ్ స్థాయికి ఎదిగిన ఈ మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను విలీనం చేస్తే కార్పొరేషన్లుగా రూపొందుతాయి. మంచిర్యాలకు నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేటకు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ హోదా పొందే అవకాశం ఉంది.
కరీంనగర్‌లో మరికొన్ని గ్రామాల విలీనం?
కరీంనగర్ పట్టణంలో కలసిపోయి/ ఆనుకుని ఉన్న బొమ్మకల్, చింతకుంట, నగునూరు, మల్కాపూర్, తిమ్మాపూర్ గ్రామాలు వివిధ కారణాల వల్ల కార్పొరేషన్‌లో విలీనం కాలేదు. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, ఖార్కాన గడ్డ, బైపాస్ రోడ్డు, చల్మెడ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతమంతా బొమ్మకల్ గ్రామం పరిధిలోనే ఉంది. ప్రతిమ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్న నగునూరు కూడా పంచాయతీగానే కొనసాగుతోంది. ఈ గ్రామాల కంటే దూరంగా ఉన్న వాటిని కార్పొరేషన్‌లో విలీనం చేసి.. వీటిని రాజకీయ కారణాలతో కలపలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీటిని కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలిసింది.
పట్టణీకరణతో మెరుగవుతున్న జీవన ప్రమాణాలు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే కొత్తగా మరో ఏడింటిని కొత్త నగరాలుగా తీర్చిదిద్దారు. 69 మున్సిపాలిటీలు 128కి పెరిగాయి. ఇప్పుడు కూడా జనాభాకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం.
– రాజు వెన్‌రెడ్డి, మున్సిపల్ చాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్.
ఇది కూడా చదవండి: ఉప్పల్ సరే.. మరి లష్కర్?
Comments
Please login to add a commentAdd a comment