సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.
ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా రైతులకు రూ.65వేల కోట్టు అందించాం. వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగరేణి టర్నోవర్‌ను రూ.33వేల కోట్లకు పెంచాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సింగరేణి సర్వనాశం అయ్యింది. దేశంలో బొగ్గుకు కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉండగా విద్యుత్‌ను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోంది. వచ్చే దసరాలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. దేశంలోని చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు..
Comments
Please login to add a commentAdd a comment