Telangana CM KCR Announced Notification For 80,039 Govt Jobs In Assembly, Know Complete Details - Sakshi
Sakshi News home page

TS Govt Job Notifications 2022: కరువు తీరా కొలువులు..

Published Thu, Mar 10 2022 1:35 AM | Last Updated on Thu, Mar 10 2022 11:57 AM

Telangana: CM KCR Announces Notification for 80,039 Govt Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు బుధ వారం ఉదయం శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు. 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇం దులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో సగర్వంగా ‘లోకల్‌’కోటాను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను బుధవారమే మొదలుపెడుతున్నట్టు తెలిపారు.

ఉమ్మడి ఏపీ విభజనతో ముడిపడిన షెడ్యూల్‌ 9, 10 వివాదం కూడా పరిష్కారమైతే.. మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో మార్పుచేర్పులు చేసుకోవటం ద్వారా మరో 25 వేల వరకు కొత్త ఖాళీలను సృష్టించి, భర్తీ చేసుకుందామని చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయాన్ని మంగళవారం వనపర్తి సభలో ప్రకటించి ఉండొచ్చని.. కానీ సంప్రదాయాలను గౌర వించాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలోనే ప్రకటిస్తున్నా నని తెలిపారు. శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

పిడికెడు మందితో ఉద్యమాన్ని మొదలుపెట్టి.. 
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. రెండు దశల ఉద్యమాలు దశాబ్దాల పాటు సాగాయి, 1969 ఉద్యమంలో పదో తరగతి విద్యార్థిగా ఉంటూ సిద్దిపేటలో రిజర్వు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న. సమైక్య పాలనలో అంతులేని వివక్షతో తెలంగాణ సమాజం నలిగిపోయింది. 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నం. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలస లు.. ఉద్యోగాలు రాక ఆవేదనతో యువత తుపాకు లు పట్టిన పరిస్థితి, రైతులను పాతాళానికి తొక్కిన ప్రపంచ బ్యాంకు ఆంక్షల సందర్భాన్ని కూడా చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ప్రభు త్వ భూములు అమ్మి నిధులను వేరే ప్రాంతా నికి తరలిస్తున్నా.. తెలంగాణ నేతలు పదవుల కోసం నోరు మూసుకున్న తీరు అందరికీ తెలుసు. చివరికి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నేను తెలంగాణ కోసం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించిన.

దేవుడి దయ, ప్రజల దీవెన, న్యాయమైన పోరాటం, ప్రజల్లో నెలకొన్న ఆర్తి కలిసి..14, 15 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నేను అప్పుడే చెప్పిన. దాన్ని సాధించే క్రమంలో అడ్డుపుల్లలు వేసే మిగతా పార్టీల ఆగడాలను దాటుకుని ముందుకు సాగినం. వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గమ్‌.. కానీ టీఆర్‌ఎస్‌కు రాజకీయాలంటే ఓ టాస్క్, పవిత్ర కర్తవ్యం. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న వారు ఉద్యమంలో ఎక్కడున్నరో ప్రజలకు తెలుసు. మా ఏకాగ్రతను దెబ్బతీసే వ్యక్తులను.. ఏనుగు వెళ్తుంటే చిన్నచిన్నవి అరుస్తుంటయని వదిలిపెట్టినం. 

ఎక్కడ చూసినా.. నీళ్లు, పంటలు 
వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని రక్షించుకునేందుకు ఇంకా కొట్లాడుతున్నం. ఇప్పటికే పెద్ద మొత్తంలో నీటిని తెచ్చుకోగలిగినం. ఏప్రిల్, మే నెలల్లో కూడా నిజాంసాగర్‌ను నింపుకోగలుగుతున్నం. పుష్కలంగా నీళ్లుండటంతో వాగుల్లో కూడా నీళ్లు వదలాలన్న కొత్త డిమాండ్‌ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొనలేక వెల్లకిలాపడేంత స్థాయిలో పంటలు పండించగలుతున్నం. రోడ్లన్నీ కల్లాలవుతున్నయి. తెలంగాణ రూపాయి తెలంగాణలోనే ఖర్చయ్యేలా చేసుకున్నం.
 
విభజన వివాదాలతో..
విద్యుత్‌ ఉద్యోగుల పంపకాల్లో వివాదం సుప్రీం కోర్టు దాకా పోయింది. 9, 10 షెడ్యూళ్ల పంచాయితీ ఇంక తెగలే. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు.. అంతా గందరగోళం చేస్తున్నరు. మూసీ వరదల తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో జంట జలాశయాలు నిర్మించడంతో సమస్య తీరింది. ఇంత మేలు చేసినందుకు విశ్వేశ్వ రయ్య గౌరవార్ధం ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతంలో అప్పట్లో నిజాం రాజు ఓ విందు ఏర్పాటు చేసిండు. అక్కడ కూర్చుని మాట్లాడేటప్పుడు మంచి పంటల కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని నిజాంకు మోక్ష గుండం సూచించారు. నిజాం అప్పటికప్పుడే కూర్చున్న చోటనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని ఆర్డర్‌ ఇచ్చి 5 వేల ఎకరాలు కేటాయిం చాడు. అలా రూపొందించిన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటా కావాలని ఏపీ వాళ్లు అడుగుతున్నరు. ఉస్మానియా యూనివర్సిటీ భూమిలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఆస్పత్రిలో కూడా వాటా అడుగుతున్నరు. ఏపీ వారివి అర్థరహిత వాదనలు అనటానికి ఇవే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విభజన పేచీని పరిష్కరించదు.

సీనియారిటీని తేల్చే బాధ్యత ఏపీకి ఉండటంతో మనం దానిపై ఆధారపడకతప్పని పరిస్థితి. ఏపీనేమో ఉద్యోగుల సీనియారిటీ ఎటూ తేల్చదు. చివరికి మనం వెయ్యిదాకా సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో గోసలు అనుభవించుకుంటూ వచ్చినం. 1919లో ముల్కీ రూల్స్‌ ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డా ముల్కీని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. తెలంగాణకు అన్యాయం జరిగింది. ఎవరి నుంచి మనం విడిపోయినమో, రేపు వారి నుంచే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున.. రక్షణ కావాల్సి ఉందని గట్టిగా నిర్ణయించుకున్నం. ఆగమాగం కాకుండా పటిష్టంగా రూల్స్‌ తయారుచేసి రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం శాసనసభలో తీర్మానం చేసి పంపినం. కేం ద్రం దాన్ని ఆమోదించకుండా ఏడాది వరకు పెం డింగ్‌లో పెట్టింది. నేనే చివరకు రాష్ట్రపతిని, ప్రధా నిని నాలుగైదు సార్లు కలిసి వివరించి.. కొందరు అధికారులను ఢిల్లీలో పెట్టి 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు సాధించినం.

దుర్మార్గపు కాంట్రాక్టు విధానం  
సమైక్య పాలకులు కాంట్రాక్టు ఉద్యోగాలని చెప్పి ఘోరంగా వ్యవహరించారు. చాలీచాలని జీతాలతో అర్ధాకలికి వదిలేశారు. మేం ఆ ఘోరాన్ని తుదముట్టిస్తూ.. ఒక్క కరెంటు డిపార్ట్‌మెంటులోనే 22,722 మందిని రెగ్యులరైజ్‌ చేసినం. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకున్నం. ఈరోజు దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. తెలంగాణ పతార (పరపతి) ఎంతుందంటే.. 40 ఏళ్ల తెలంగాణ బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతయి. చాలా రాష్ట్రాల కంటే తక్కువ అప్పులున్న రాష్ట్రం తెలంగాణనే. కడుపు, నోరు కట్టుకుని అవినీతి రహిత పాలనతో ఇదంతా సాధించాం. 

ఖజానాపై రూ.7 వేల కోట్ల భారం 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371–డి ప్రకారం రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారం దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్‌ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పోగా.. నేరుగా భర్తీచేయాల్సిన ఖాళీలు 80,039 ఉన్నట్టు తేలింది. వీటి భర్తీతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.7,000 కోట్లు అదనపు భారం పడుతుంది. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూలప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత సమస్యలు తీరుతాయి. 

95 శాతం స్థానికులకే.. 
ఆంధ్రాతో ఉద్యోగుల వివాదం పరిష్కారం కాకున్నా.. కొత్తగా 1.56 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1,33,942 పోస్టులు భర్తీ చేసినం. మిగతా వాటి ప్రాసెస్‌ నడుస్తోంది. గతంలో ఏకంగా 20 శాతం నాన్‌లోకల్‌ కోటా అని పెట్టి తెలంగాణ ఉద్యోగాలను కొట్టేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల మేరకు జీవోలు జారీ చేసి.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో ఇచ్చిందే 317 జీవో. అదేదో అర్థంకాక.. నెత్తి కత్తిలేని కొందరు దీనిపై కోర్టును ఆశ్రయించి ఆగమాగం చేశారు. మేం కఠినంగానే అమలు చేసినం. ఎక్కడివారు అక్కడ సర్దుకున్నరు. పదోన్నతులు ఇచ్చేసినం, టీచర్లవేవో పెండింగులో ఉంటే అవి కూడా చేయాలని ఆదేశాలిచ్చినం. ప్రగతిపథంలో అద్భుతాలు సాధించాలంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రేమభావంతో, మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇప్పటికే తెలంగాణలో ఆ ఫలితాలు సాధించాం. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి తయారీ రంగం అద్భుతంగా ఉన్న రాష్ట్రాలను తోసిరాజని.. పర్‌క్యాపిటా జీఎస్‌డీపీలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉందంటే అదే కారణం. ఆంధ్రా సృష్టించే అర్థరహితమైన వివాదాలను ఎదుర్కొంటూ, కేంద్రం వివక్ష వైఖరిని భరిస్తూ ఇవన్నీ సాధించినం. 

సీఎం ప్రసంగంపై ఉత్కంఠ 
నిరుద్యోగులకు వరం ఇవ్వబోతున్నామని.. బుధవారం ఉదయం శాసనసభలో తన ప్రసంగాన్ని వీక్షించాలని మంగళవారం వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత బుధ వారం ఉదయం అసెంబ్లీ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం శాసనసభ మొదలవుతూనే.. ప్రత్యేక ప్రకటన రూపంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడతామని ప్రకటించారు. ఈ సంద ర్భంగా గంటసేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం నుంచి విభజన సమస్యల దాకా ఎన్నో అంశాలనూ ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement