మున్సిపాలిటీలు.. మురికికూపాలు!
♦ సమ్మె మొదలై 10 రోజులు గడిచినా పట్టించుకోని ప్రభుత్వం
♦ పోరాటం ఉద్ధృతం చేయాలని జేఏసీ నిర్ణయం
♦ పట్టణాల్లో గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు
♦ అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజల ఆందోళన
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారుతున్నాయి. కార్మికులు సమ్మె కొనసాగిస్తుండడంతో శుభ్రపరిచేవారు లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది.
మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అంటువ్యాధులు ప్రబలడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె సోమవారం నుంచి మరింత ఉద్ధృతం కానుంది. తాజా ఉద్యమ కార్యాచరణను జేఏసీ నేతలు ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితో పాటు ధర్నాలు, రాస్తారోకోల వంటి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టేందుకు మున్సిపల్ కార్మికులు సన్నద్ధమవుతున్నారు.
ఉద్యమంలో భాగంగా జేఏసీ నేతలు సోమవారం విజయవాడలో రాజకీయ పార్టీల ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగర పాలక సంస్థలతో పాటు 113 మున్సిపాలిటీల్లో మొత్తం 40 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసే వరకూ సమ్మె విరమించేది లేదని రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నేతలు రంగనాయకులు, కె. ఉమామహేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ, గుంటూరు, కృష్ణా, కడప జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 17న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ప్రభుత్వం వీరి డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు.
పట్టణాల్లో దుర్గంధం
మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా మున్సిపాల్టీల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయింది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో ప్రధాన వీధులు సైతం దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి.
ఏపీలో మొత్తం కార్పొరేషన్లు: 13
మున్సిపాలిటీలు: 74
నగర పంచాయతీలు: 26
సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు: 40వేలు