20 కార్పొరేషన్ల విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తొలి విడతగా అత్యవసర సేవలందించే 20 కార్పొరేషన్లను విభజించి, అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచే రెండు రాష్ట్రాల్లో అమల్లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆర్టీసీ, పౌర సరఫరాలు, జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి కీలక సంస్థలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవారీగా విడిపోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింటెడ్ డే తర్వాత ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు రేషన్ పంపిణీ, రవాణా, విద్యుత్, విత్తనాలు, మందుల సరఫరా తదితర సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు వీలుగా 20 కార్పొరేషన్లను రెండుగా విభజించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు.
ఇందుకోసం వెంటనే ఈ కార్పొరేషన్ల పాలకమండళ్లు సమావేశమై విభజన తీర్మానాలను ఆమోదించాలని పేర్కొన్నారు. కంపెనీలు, కో-ఆపరేటివ్ సొసైటీల చట్టాల ప్రకారం విభజన ద్వారా తెలంగాణ పేరుతో కొత్తగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న వాటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని వివరించారు. ప్రామాణిక నిర్వహణ విధానాల మేరకు ఇరు రాష్ట్రాల్లోనూ ఇవి పనిచేయనున్నట్లు సీఎస్ తెలిపారు. వెంటనే కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాల పట్టికలను చార్టెడ్ అకౌంటెంట్‌తో పరిశీలన చేయించి, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికెట్ పొందేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఈ కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి ప్రకారం, అలాగే ఉద్యోగులను జిల్లాల నిష్పత్తి మేరకు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జెన్‌కో, ట్రాన్స్‌కో, సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, నీటి వనరుల అభివృద్ధి సంస్థ, సాగునీటి అభివృద్ధి సంస్థ, పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, బేవరేజెస్ కార్పొరేషన్, విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఆర్టీసీ, రహదారుల అభివృద్ధి సంస్థ, పర్యాటకాభివృద్ధి సంస్థలు రెండుగా చీలనున్నాయి. ప్రస్తుతమున్న చోట నుంచే రెండు రాష్ట్రాల కార్పొరేషన్లు పని చేస్తాయి.