జలం.. గరళం
జలం మాటున గరళం గొంతులో దిగుతోంది. రక్షితనీరు కరువై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కలుషిత నీటితో డయేరియా, టైపాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధుల బారినపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, డయేరియా విశ్వరూపం చూపుతున్నాయి. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో ఈ వ్యాధులు మరింత ప్రబలే {పమాదముంది.
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, జగిత్యాల మున్సిపాలి టీలు, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలు, 1207 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాకేంద్రం మొదలు మారుమూల పల్లె వరకు అన్ని చోట్లా తాగునీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉంది. సాధారణంగా నీటిలో 0.5 నుంచి 1.5మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ఉండాలి. కానీ, 700కు పైగా గ్రామా ల్లో ఫ్లోరిన్ 2మి.గ్రా.పైనఉంది. వాటిలో 200 ఆవాస ప్రాంతాల్లో ఫ్లోరిన్ 3 మి.గ్రా శాతం పైనే ఉంది.
కరీంనగర్ శివారు ప్రాంతంలో ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం, బైపాస్ వద్ద ఎల్లమ్మగుడి, విద్యానగర్‌లోని పోలీస్ శిక్షణ కాలేజీ ప్రాంతాల్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంది. బెజ్జంకి మండలం కాసిం పేట, గుండ్లపల్లి, జంగపల్లి, దాచారం, పోతా రం, భీమదేవరపల్లి మండలం మల్లారం, మాణిక్యాపూర్, రంగయ్యపల్లి, బోయిన్‌పల్లి మండలం గుండ్రపల్లి, వరదవెల్లి, కొత్తపేట, అనంతపల్లి, చందుర్తి మండలం కిష్టంపేట, ఎనగల్, చిగురుమామిడి మండలం సీతారాంపూర్, చిగురుమామిడి, లంబాడపల్లి, ధర్మారంలో పత్తిపాక, ఎల్కతుర్తిలో తిమ్మాపూర్, ఎల్కతుర్తి, ఇల్లంతకుంటలో తిప్పాపూర్, రహీంఖాన్‌పేట, వల్లంపట్ల, ముస్కానిపేట, గొల్లపల్లి, అనంతారం, వంతడ్పుల, గంభీరావుపేటలో దమ్మన్నపేట, సముద్రాలలింగాపూర్, గంగాధర లో ఉప్పరమల్యాల, నాగిరెడ్డిపూర్, వెంకటయ్యపల్లి, గొల్లపల్లి మండలం గుంజపడుగు, హుస్నాబాద్‌లో అక్కనపేట, జిల్లెలగడ్డ, గుడాటిపల్లి తది తర గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం 3మి.గ్రా పైనే ఉంది.
నెరవేరని లక్ష్యం
జిల్లాలో ఏడు వందలకు పైగా గ్రామాల్లో.. ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తాగునీటి నాణ్యత రోజురోజుకు లోపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల పేరుకే పరిమితమైంది. ఈ ప్రయోగశాలలో ఇద్దరే ఉద్యోగులు ఉన్నారు.
ఒకరు జూనియర్ అసిస్టెంట్ ప్రకాశ్, ఇంకొకరు శాంపిల్ టేకర్ (నమూనాలు సేకరించే వ్యక్తి). వీరిద్దరే జిల్లా అంతటా తిరగాలి. గ్రామాల్లో ఉన్న బావులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, నల్లాలు, బోర్‌వెల్స్ (చేతిపంపులు), చెరువుల నుంచి నీటి నమూనాలు సేకరించాలి. వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి నాణ్యత పరీక్షించాలి. ప్రతి నెల 60 బ్యాక్టీరియా, 30 కెమికల్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యం ఉండగా.. సిబ్బంది లేకపోవడంతో రెండు కలిపి 40కి మించడం లేదు. వీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఇక్కడ కార్యాలయానికి తాళమే. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది.
ఆఫీసు పనితోపాటు రిపోర్టుల కోసం ప్రకాశ్ కార్యాలయానికే పరిమితమయ్యారు. నీటి నమూనా సేకరించే వ్యక్తి నెలంతా తిరిగి పరీ క్షలు నిర్వహించలేకపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర కార్యాల యాలు నీటిని ఈ ప్రయోగశాలకు తీసుకొచ్చి నాణ్యత పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. వర్షాకాలం కావడంతో కలుషితనీటితో ఇంకా వ్యాధులు ప్రబలే ప్రమాదముంది.
సిబ్బంది కొరత : ప్రకాశ్, నీటినాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల
సగానికిపైగా గ్రామాల్లో రక్షితనీరు అందడం లేదు. ఆయా గ్రామాల ప్రజలకు ఎన్నోసార్లు చెప్పాం... అయినా వారు అదే నీరు తాగుతున్నారు. నీటినాణ్యత పరీక్ష నిర్వహించే సిబ్బం ది కొరత ఉండడంతోనే ఆశించిన విధంగా పరీక్షలు చేయలేకపోతున్నాం. మరో శాంపిల్ టేకర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ అవసరమున్నారు. సరిపడా సిబ్బంది ఉంటే.. జిల్లావ్యాప్తంగా నీటి నాణ్యత పరీక్షలు చేసే వీలుంది.