నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: పురుగుల బియ్యంతో వండిన అన్నం, నీళ్ల పచ్చడి, నీళ్ల సాంబారు..ఇది ప్రభుత్వ వసతిగృహాల్లో భోజనం. గుడ్లు, పండ్లు అసలే ఉండవు. తాగునీరు గగనం. స్నానపు గదులు, మరుగుదొడ్లు అధ్వా నం. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కళాశాల విద్యార్థినుల వసతిగృహల దుస్థితి ఇది. ఇవే పరిస్థితులు జిల్లాలో ఉన్న 26 ఎస్సీ, బీసీ వసతిగృహాల్లో నెలకొంది. వీటిలో సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అద్దె గదులు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, నిర్వహణ లోపంతో కుదేలవుతున్న వాటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు.
ఇంటర్ ఆపై విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే ఉపకార వేతనాలతో కళాశాల వసతిగృహాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1050 చెల్లిస్తారు. నియోజకవర్గానికి ఒక బాలుర, బాలికల కశాళాల వసతిగృహాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది నెరవేరడం లేదు. ఉన్న వసతిగృహాల నిర్వాహణ రోజురోజుకు అధ్వానంగా తయారవుతోంది. జిల్లాలో మొత్తం ఎస్సీ కళాశాల వసతిగృహాలు 20 ఉండాలి. అయితే 6 మాత్రమే ఉన్నాయి. బాలురు-1, బాలికలకు-5 వసతిగృహాలు ఉన్నాయి.
ఇందులో 1000 మంది విద్యార్థులున్నారు. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం గేటు సమీపంలో బాలురు, మద్రాసు బస్టాండు సమీపంలో రెండు బాలికల వసతిగృహాలు శిథిలావస్థ భవనాల్లో కొనసాగుతున్నాయి.
గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట వసతిగృహాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. బీసీ వసతిగృహాలు మొత్తం 20 ఉన్నాయి. ఇందులో 10 బాలికల, 10 బాలుర వసతిగృహాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 1500 మంది విద్యార్థులున్నారు. ఇవీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎస్సీ వసతిగృహాలకు ఒక్కరు మాత్రమే పర్యవేక్షకులుగా ఉన్నారు. బీసీ వసతిగృహాలకు పర్యవేక్షకులను కేటాయించలేదు. సమీపంలోని పాఠశాలల సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లకు ఇన్‌చార్‌జ బాధ్యతలు అప్పగించారు.
శిథిలావస్థలో భవనాలు
నగరంలోని రెడ్‌క్రాస్ సమీపంలోని ఎస్సీ బాలికల వసతిగృహాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆ శాఖ మరమ్మతులకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే గోడలు కారుతూ పైకప్పులు లీకేజీలతో బూత్‌బంగ్లాను తలపిస్తున్నాయి.
పాడుపడిన గదులకు తోడు తెగిపోయిన విద్యుత్ తీగలు, పగిలిపోయిన తలుపులు, కిటికీలతో చీకటి కొట్లను గుర్తు చేస్తున్నాయి. ఇక మరుగుదొడ్ల సంగతి సరేసరి. డ్రైనేజీ, పారిశుధ్యం అధ్వానంగా మారడంతో కంపు కొడుతూ ఎప్పుడు కూలుతాయో తెలియని స్థితిలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. డైనింగ్‌హాల్ పైకప్పు రేకులు పగిలిపోయాయి. కలుషిత నీరు తాగుతున్నారు. ఇక్కడ 185 మంది విద్యార్థినులకు గాను రెండు గదులు మాత్రమే ఉన్నాయి. గదులు సరిపోకపోవడంతో వరండాలో కూడా విద్యార్థులు నిద్రిస్తున్నారు. వాచ్‌మన్ లేకపోవడంతో ఆకతాయిల బెడద ఎక్కవగా ఉంటోందని వారు వాపోతున్నారు.
భోజనంలోనూ అవకతవకలే...
బిల్లులు సకాలంలో రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్‌మన్, సిబ్బంది కొరత ఉంది. హాస్టళ్ల నిర్వాహకులు , అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇక్కడ కామన్ మెనూ మరోలా ఉంది. అపరిశుభ్రత మధ్యే భోజనాన్ని తయారు చేస్తున్నారు. ఉడికీఉడకని అన్నమే దిక్కవుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం ఒక్కోసారి విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తోంది.
కూరల్లో బల్లిపడటం, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వంటివి ఇక్కడ సర్వసాధారణం. అల్పాహారంతో సహా మెనూ ఇష్టాను సారం ఇచ్చేస్తుండటం, తాగునీటి కోసం కుళాయి వద్ద క్యూ కట్టాల్సి రావడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాహణలోనూ అధికారుల ఇష్టారాజ్యమైంది. అధికారుల, వసతిగృహాల పర్యవేక్షకుల మధ్య సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.
వసతుల కల్పనకు కృషి
కొండాయపాళెం గేటు సెంటర్‌లోని బాలుర వసతి విద్యార్థులకు రూ.2 కోట్లు వెచ్చించి నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. నగరంలోని బాలికల కళాశాల వసతిగృహాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వదు. ప్రతి హాస్టల్‌కు పర్యవేక్షకుడిని, వంట మనషులు, వాచ్‌మన్ అవసరమని ప్రభుత్వానికి నివేదించాం. విద్యార్థుల కమిటీ నిర్ణయం మేరకు భోజనం మెనూ అమలవుతుంది.
- వై. విశ్వమోహన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ
ఉపసంచాలకుడు
పురుగుల అన్నం.. నీళ్ల పచ్చడి
Published Wed, Jan 29 2014 3:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement