అభివృద్ధికి ఓకే | Development fine | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఓకే

Published Sun, Jul 20 2014 2:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

అభివృద్ధికి ఓకే - Sakshi

అభివృద్ధికి ఓకే

సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరానికి భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకానికి వెంటనే నిధులు మంజూరు విషయమై తమ అంగీకారాన్ని రెండు రోజుల్లో తెలియజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులో శనివారం ఏసీఎస్‌ఆర్ మెడికల్  కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎంతో కలిసి కేంద్రపట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.  మొదట కేంద్రమంత్రి మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ తీర్మానంతో పాటు సీఎం చంద్రబాబు ఓకే అంటే హడ్కో రుణంతో నగరంలో రూ.575 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, మరో రూ.500 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.
 
 నెల్లూరు నగరంలో డ్రైనేజీతో పాటు తాగునీటి సమ స్య ఉందన్నారు. నెల్లూరు వాసిగా ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్య త తనపై ఉందన్నారు.  గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజీకి రూ.400 కోట్లు ఇస్తానని చెప్పినా అప్పట్లో కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీలో  రూ.15.91 కోట్లతో, సూళ్లూరుపేటలో రూ.26 కోట్లతో గృహనిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. వీటన్నింటికీ రాష్ట్రప్రభుత్వం  అంగీకా రం తెలిపితే  తక్షణం మంజూరు చేయిస్తానని చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నెల్లూరుతో పాటు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వెంకయ్యను బాబు కోరారు.
 
 నెల్లూరు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సోమశిల హైలెవల్ కెనాల్,సంగం బ్యారేజీ, పెన్నాబ్యారేజీ, తెలుగుగంగ, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులను ప్రాధాన్యం క్రమంలో ఏడాదికొకటి చొప్పున వచ్చే అయిదేళ్లలో  పూర్తిచేసి 13 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు మెడికల్ కళాశాలతో పాటు ఆస్పత్రికి వందల ఎకరాలు దానం చేసిన  దొడ్ల సుబ్బారెడ్డి  ఔదార్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు.
 
 నాడు వాజ్‌పేయి ప్రభుత్వం వల్లే చెన్నై హైవే వచ్చిందన్నారు. ప్రస్తుతం విశాఖ-చెన్నై కారిడార్ వల్ల జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పులికాట్ సరస్సులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య గొడవలు వస్తున్నాయన్నారు. పులికాట్  మౌత్ ఓపెన్ చేస్తే మంచిదన్నారు. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బాబు హామీ ఇచ్చారు. దేశంలోనే కృష్ణపట్నం డీప్ వాటర్ పోర్ట్ అన్నారు. ఇక్కడ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామన్నారు. బకింగ్ హామ్ కెనాల్‌ను పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. నెల్లూరుచుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోడూరు-మైపాడు బీచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నుంచి చెన్నైకి పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమరవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతోందన్నారు. నెల్లూరు-కావలి మధ్య ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నట్లు బాబు చెప్పారు. ఇది ప్రకాశంకు సైతం అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన దేవాలయాలతో బీచ్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. చెన్నై-కోల్‌కతా పదిలేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. అక్టోబర్ రెండు నుంచి వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లను అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతు రుణమాఫీపై కసరత్తు జరుగుతోందన్నారు.
 
 తాను హామీ ఇచ్చిన  నాటి నుంచి ఒక్కో కుటుంబంలో ఒక్కో రైతుకు మాత్రమే రుణమాఫీ అమలు చేస్తామన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ఎన్‌టీఆర్ ఆరోగ్య పథకం కింద బీమా వర్తింప చేస్తామన్నారు.  సభలో రాష్ట్రమంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ,పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్‌రావు, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తాళ్లపాక రమేష్‌రెడ్డి, ఆదాల ప్రభాకరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర,పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement