బాలాజీనగర్‌లో అండర్ గ్రౌండ్స్ డ్రెయినేజీ పైప్‌లైన్ కోసం తవ్వకాల్లో ధ్వంసమైన మంచినీటి పైప్‌లైన్
పాలకుల అసమర్థత.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నగర ప్రజలు కాలకూట విషాన్ని తాగుతున్నారు. ప్రాణాధారమైన జీవజలాన్ని అందించలేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రూ.కోట్ల బడ్జెట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు తాగునీటి కోసం అందులో 0.02 శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని నగర పాలక సంస్థ లెక్కలే చెబుతున్నాయి. అధికార పార్టీ నేతలు నగర ప్రజలకు అన్ని ప్రాంతాలకు రెండు పూటలా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రచారం చేసుకున్నారు. వాస్తవంగా చూస్తే అందులో సగం మందికి కూడా నీటి సరఫరా కావడం లేదని నీటి లెక్కలే తేల్చుతున్నాయి. నగరవాసి, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రజలకు మినరల్ వాటర్ ఇస్తామని చెబితే..మేయర్ అబ్దుల్ అజీజ్ ఓజోన్ వాటర్ అందిస్తామని ఇలా నిత్యం గొప్పలు చెబుతున్నారు. వాస్తవంగా కాలుష్యపూరితమైన కోలీఫాం జలాన్ని తాగిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలో 7 లక్షలు మంది జనాభా ఉండగా, 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 90 నుంచి 100 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా అధికారులు 105 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) వంతున సరఫరా చేయాలని కాకి లెక్కల బడ్జెట్‌ను రూపొందించారు. అయితే నగర పాలక సంస్థ అధికారులు 85 ఎంఎల్‌డీ వంతున నీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి వనరులు, సరఫరా చేస్తున్న నీటి లెక్కలు తేల్చితే 60 ఎంఎల్‌డీ వంతున కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది.
మొక్కుబడిగా క్లోరినేషన్
నగర ప్రజలకు సరఫరా చేసే నీటిలో క్లోరిన్ కలిపి పూర్తిగా శుద్ధి చేసి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి. అప్పుడే బాక్టీరియా కొంత మేరకు చనిపోయే అవకాశం ఉంది. కానీ అది మొక్కుబడిగా కూడా జరగడం లేదు. ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద ట్యాంకులు శుద్ధి చేయకపోవడం, వచ్చిన నీటిని శుద్ధిచేసి విడుదల చేయడంలేదు. కేవలం అలం, ఆర్‌ఎస్‌ఎఫ్, క్లోరిన్ బస్తాలు నీటిలో వేసి నీటిని వదులుతున్నారు. వాస్తవానికి చెరువు నీరు కావడంతో నీటిలో ఎటువంటి మినరల్స్, పోషకాలు ఉండవు. కానీ నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో ఈ కోలిఫాం ప్రబలడానకి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాల్చిన చెట్టు బొగ్గును నీటిలో వేస్తే నీటిని శుభ్రం చేయడంతోపాటు రంగు, రుచిని మార్చే అవకాశం ఉంది. ఇది పూర్తి శాస్త్రీయ పద్ధతి. ఈ ప్రక్రియపై కూడా ఎప్పుడూ అధికారులు దృష్టి సారించలేదు. ప్రధానంగా స్టోరేజీ ట్యాంక్‌లో ఉండాల్సిన క్లోరోమీటర్‌తో పాటు ఇతర పరికరాలు సైతం తుప్పుపట్టి మూలనపడ్డాయి.
ఏటా తాగునీటి సరఫరా ఖర్చు రూ.2.6 కోట్లే!
నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ.1,500 కోట్లని పాలకులు గప్పాలు కొట్టుకుంటున్నా.. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కేవలం రూ.2.6 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే వార్షిక బడ్జెట్‌లో 0.02 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. వందల కోట్లు వార్షిక బడ్జెట్ ఉన్నా నగరంలో కనీసం అవసరాలకు సరిపడా నీరు ఇవ్వలేని దుస్థితిలో నగర పాలకులు ఉన్నారు.
మంత్రి మినరల్ అంటే.. మేయర్ ఓజోన్
నగరంలో 7.5 లక్షల జనాభా ఉంటే కనీసం 3 లక్షల మందికి కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు. అది కూడా పనికి రాని నీటిని తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. నగరానికి చెందిన పి.నారాయణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రిగా, నగర మేయర్‌గా అబ్ధుల్ అజీజ్ ఉన్నారు. ఇద్దరు నగర ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తామని నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఒకరికి ఒకరు పోటాపోటీగా హామీలు ఇస్తున్నారు. మంత్రి నారాయణ అయితే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెబితే, మేయర్ అజీజ్ ఇంకో అడుగు మందుకు వేసి నగరంలో ఓజోన్ ప్లాంట్లు పెట్టి పూర్తిగా ఓజోన్ నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. వారంలో సగటున మూడు రోజులు మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించే ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు కనీసం మెక్కుబడిగా అయినా స్పందిచని పరిస్థితి. గతేడాది నవంబర్ నుంచి నగరంలో కోలిఫాం బాక్టీరియా నీరు సరఫరా అవుతుందని అధికారులు మొదలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల వరకు అందరూ చెబుతున్నా చర్యలు తీసుకోకపోవటం నగరపాలక దుస్థితికి నిదర్శనం.
తాగునీరు దారుణంగా ఉంది
నగరపాలక సంస్థ కుళాయిల నుంచి వచ్చే నీరు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. వచ్చే నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన నీళ్లు కూడా మురికిగా దుర్గంధం భరితంగా ఉంటున్నాయి. దీంతో వాటిని వాడుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. – కుమారి, నెల్లూరు
ఇంత దారుణమా
మున్సిపల్ నీళ్లు తాగాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది. ఎక్కడ బడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఏ పైపు ఎక్కడ తెగిపోయి, నీటి పైపుల్లో కలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నీటిని వాడితే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – శివప్రసాద్, నెల్లూరు
శరీర అవయవాలకు ప్రమాదం
కోలిఫాం బాక్టీరియా ఉన్న నీటిని తాగితే శరీర అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బాక్టీరియా ఉన్న నీటిని తాగిన వారికి విరోచనాలు కావడం, జ్వరం రావడం, మలంలో రక్తం పడటం, ఇన్‌ఫెక్షన్స్, కడుపు నొప్పి వస్తుంది. వీటన్నింటిని కలిపి డీసెంట్రీ జబ్బు అంటారు. డీహైడేషన్ వచ్చి కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్య వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాగేనీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగాలి. – డాక్టర్ పీకే రెడ్డి,
Comments
Please login to add a commentAdd a comment