ఆదిత్య నగర్‌లో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెన్నానది పక్కనే అపార్టమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఒకవేళ వరదలొస్తే ఏం చేస్తారు?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు’ అని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఆయన నెల్లూరులోని 54వ డివిజన్‌లో జానర్దన్‌రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నదికి వరదొస్తే ఎంతమేర తాకిడికి గురవుతుందని అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. నది పక్కనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను çస్టడీ చేసి వరద తాకిడి లేని ప్రాంతంతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
ఎవరు బాధ్యత వహిస్తారు?
ఈ సందర్బంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రవాహం వచ్చి వరదల తాకిడికి గురై ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అపార్ట్‌మెంట్లు నిర్మించే ముందు భూసార పరీక్షలను ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రయివేట్ సంస్థలతో చేయించారని బుగ్గనకు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు పెన్నానది పరీవాహక ప్రాంతం కాకపోతే పక్కనే నివాసాలు ఏర్పరచుకుని ఉన్న వందలాది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వరదలొస్తే అపార్ట్‌మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.
ఇళ్ల కోసం వినతి
జనార్దన్‌రెడ్డికాలనీలో హిజ్రాల సంఘ నాయకురాలు అలేఖ్య సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రవిచంద్రకు ఇళ్ల స్థలాల కోసం వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ 44 మంది పేద హిజ్రాలకు ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఇంకా ఇళ్లు కేటాయించలేదని వారి దృష్టికి తెచ్చారు.
ఆదిత్య నగర్‌లో పర్యటన
నెల్లూరు(సెంట్రల్): నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కమిటీలో సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అప్పలనాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు.
డ్రెయినేజీ పనులతో ప్రజల అవస్థలు
రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు సుదీర్ఘకాలంగా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గుంటలు తవ్వి పూడ్చకుండా పనులు చేస్తుండటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటలు తవ్విన స్థానంలో వేసిన రోడ్లు కూడా ఇళ్లున్న వాటికంటే ఎత్తులో ఉండటంతో వచ్చే సమస్యలను ప్రజలు తెలియజేశారన్నారు. పబ్లిక్‌హెల్త్ అధికారులు ఇటువంటి వాటిని గుర్తించాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో పబ్లిక్‌హెల్త్ అధికారులు పెద్ద నగరాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవగాహనతో పనులు చేయవచ్చన్నారు.
అయితే అందుకు భిన్నంగా అధికారులు నెల్లూరులో వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెన్నా నది ఒడ్డునే పెద్ద నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు సంభవిస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అధికారులు చెప్పలేపోవడం దారుణమన్నారు. అనంతరం చైర్మన్ జనార్దన్‌రెడ్డికాలనీలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. దాని పనితీరు, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ (వైఎస్సార్‌సీపీ), కె.అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా పలు శాఖల అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment