PAC chairman Buggana Rajendranath
-
వరదలొస్తే ఏం చేస్తారు?
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెన్నానది పక్కనే అపార్టమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఒకవేళ వరదలొస్తే ఏం చేస్తారు?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు’ అని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఆయన నెల్లూరులోని 54వ డివిజన్లో జానర్దన్రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నదికి వరదొస్తే ఎంతమేర తాకిడికి గురవుతుందని అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. నది పక్కనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను çస్టడీ చేసి వరద తాకిడి లేని ప్రాంతంతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సందర్బంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రవాహం వచ్చి వరదల తాకిడికి గురై ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూసార పరీక్షలను ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రయివేట్ సంస్థలతో చేయించారని బుగ్గనకు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు పెన్నానది పరీవాహక ప్రాంతం కాకపోతే పక్కనే నివాసాలు ఏర్పరచుకుని ఉన్న వందలాది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వరదలొస్తే అపార్ట్మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇళ్ల కోసం వినతి జనార్దన్‌రెడ్డికాలనీలో హిజ్రాల సంఘ నాయకురాలు అలేఖ్య సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రవిచంద్రకు ఇళ్ల స్థలాల కోసం వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ 44 మంది పేద హిజ్రాలకు ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఇంకా ఇళ్లు కేటాయించలేదని వారి దృష్టికి తెచ్చారు. ఆదిత్య నగర్లో పర్యటన నెల్లూరు(సెంట్రల్): నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కమిటీలో సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అప్పలనాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులతో ప్రజల అవస్థలు రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు సుదీర్ఘకాలంగా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గుంటలు తవ్వి పూడ్చకుండా పనులు చేస్తుండటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటలు తవ్విన స్థానంలో వేసిన రోడ్లు కూడా ఇళ్లున్న వాటికంటే ఎత్తులో ఉండటంతో వచ్చే సమస్యలను ప్రజలు తెలియజేశారన్నారు. పబ్లిక్‌హెల్త్ అధికారులు ఇటువంటి వాటిని గుర్తించాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో పబ్లిక్‌హెల్త్ అధికారులు పెద్ద నగరాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవగాహనతో పనులు చేయవచ్చన్నారు. అయితే అందుకు భిన్నంగా అధికారులు నెల్లూరులో వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెన్నా నది ఒడ్డునే పెద్ద నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు సంభవిస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అధికారులు చెప్పలేపోవడం దారుణమన్నారు. అనంతరం చైర్మన్ జనార్దన్‌రెడ్డికాలనీలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. దాని పనితీరు, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ (వైఎస్సార్సీపీ), కె.అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా పలు శాఖల అధికారులున్నారు. -
‘ప్రభుత్వ పెద్దలు సైతం కోటపై కన్నేశారు..’
సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వమే అనధికారిక తవ్వకాలు చేపట్టడం దారుణమని పీఏసీ చైర్మన్, డోన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అధికారులు కాపలా ఉండి రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 14 లేదా 15వ శతాబ్దానికి చెందిన కోటలో ఇప్పుడు ఉన్నట్లుండి తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారో ప్రభుత్వం, అధికారులు వివరణ ఇవ్వాలన్నారు. గుప్త నిధుల కోసం అనుకుంటే పురావస్తు శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు మాత్రం సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు బందోబస్తు పెట్టి, స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారన్నారు. చెన్నంపల్లి కోటలో అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు ఆఫీసులో కలిసి విన్నవించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చెన్నంపల్లి కోటలో మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు జరుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారన్నారు. అలాగే కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేదని చెప్పారన్నారు. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టినట్లు తెలపడంతో ప్రాస్పెక్టరీ(ప్రాథమిక) అనుతులు తీసుకున్నారా అని తాము అడిగామన్నారు. తీసుకోలేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందని పీఏసీ చైర్మన్ అన్నారు. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణలోనే అక్రమ తవ్వకాలు చేపట్టడం వెనుక మతలబు ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో దుండగులు గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారని, ఈ కోవలోనే ప్రభుత్వ పెద్దలు సైతం చెన్నంపల్లికోటపై కన్నేశారని ఆరోపించారు. ఈ తవ్వకాల సమాచారాన్ని పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి, కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. -
బాబూ.. పోలవరం బాధ్యత నీదే: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరం ప్రాజెక్టును ఇంతకుముందు ప్రకటించిన విధంగా త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వెంటపడి ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా.. చంద్రబాబు తన చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టును తిరిగి కేంద్రానికే ఇచ్చేస్తానని చెప్పడమేమిటని నిలదీశారు. సీఎం 27 సార్లు, సాగునీటి శాఖ మంత్రి 47 సార్లు పర్యటించామంటూ చెప్పుకుంటున్నారని.. దాని వల్ల ఒరిగిందేమిటని బుగ్గన ప్రశ్నించారు. తనకున్న ప్రచార యావతోనే ఆయన పోలవరం చుట్టూ తిరిగారని, దాని వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించాలని అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారని బాబును బుగ్గన ప్రశ్నించారు. -
పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రమే చేపట్టాలి
-
లోకేశ్ వారసత్వాన్ని ఎలా ఎదుర్కొంటారు?
దేని గురించి మాట్లాడినా ప్రపంచ స్థాయి అని చంద్రబాబు ఇటీవల చెబుతుండటం ఆయన స్థాయికి, వయసుకు తగదు. మూడు నాలుగేళ్లలో ఒక రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం సాధ్యమే అంటే, మనకు తెలిసిన ప్రపంచ స్థాయి నేతలందరూ పనికిరాని వారనే కదా అర్థం. శతాబ్దాల క్రితం న్యూఢిల్లీని కట్టినవారు సమర్థులు కారా? 400 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను కట్టిన కులీకుతుబ్ షా సమర్థుడు కాడా? అభివృద్ధి అనేది శతాబ్దాలు, దశాబ్దాల క్రమంలో జరిగే ప్రక్రియ. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, మూడేళ్ల కాలంలో లక్షా 9 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం కలవరం కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆస్తులను సృష్టించడానికి బదులు అప్పులను పెంచే పనులు చక్కగా చేసుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం మూడేళ్లలో ఏపీని ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తానని గొప్పలు చెప్పటం అంటే అభివృద్ధిని దశాబ్దాల క్రమంలో పద్ధతిగా సాగించిన ప్రపంచనేతలందరూ అసమర్థులనే అర్థం వస్తుందన్నారు. టెలికాస్ట్ హక్కులను ఏబీఎన్ చానల్‌కు కట్టబెట్టి ఏపీ అసెంబ్లీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని, ఎక్కడ కెమెరాను చూపించాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది ఆ చానల్ నిర్ణయించడంతో తీవ్ర అన్యాయం జరుగుతున్నందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయిం చినట్లు చెబుతున్న బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయం? ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. కాగ్ వారి తాజా గణాంకాలు చూస్తే, విపరీతమైన లోటు కనిపిస్తోంది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నాయి. రెంటినీ కలిపి చూస్తే దాదాపు లక్ష కోట్ల రూపాయలపైన అప్పు పెరిగింది. 1956 నుంచి 2014 వరకు 60 సంవత్సరాల కాలంలో వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 96 వేల కోట్లు అయితే, ఒక్క ఈ మూడేళ్ల కాలంలోనే దాదాపు లక్షా 9 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. దీంట్లో కూడా రూ. 63 వేల కోట్లు కేవలం రెవెన్యూ లోటుగా కనబడుతోంది. రోజు ఖర్చుల కోసం, స్థిరంగా ఏ ఆస్తీ తయారు చేయకుండా ఉండేదాని కోసం రూ. 63 వేల కోట్ల అప్పు చేసేశారు. మిగిలిన రూ. 46 వేల కోట్లు కూడా స్థిరాస్తులు సృష్టించడానికి బదులు వృథా ఖర్చు పెట్టేశారు. దీంట్లో రూ. 8 వేలకోట్లను విద్యుత్ సంస్థల అప్పు తీర్చడం కోసం పెట్టినట్లుంది తప్పితే మిగిలినదంతా పట్టిసీమ వంటి అంచనాలకు మించిన, అనవసరమైన ఖర్చులకోసం వెచ్చించారు. పట్టిసీమకు రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టామన్నారు కానీ కాగ్ నివేదిక చూస్తే అది మితిమీరిన అంచనా అని తెలుస్తోంది. ఇక వెలగపూడిలో కట్టిన తాత్కాలిక భవనాలు. కేవలం తాత్కాలిక భవనాలు కట్టడానికి చదరపు అడుగుకు రూ. 4,500లు చెల్లించారు. అదే హైదరాబాద్ అంత పెద్దనగరంలో గచ్చిబౌలి ఏరియాలో చదరపు అడుగుకు రూ. 4,000ల చొప్పున భూమితో సంబంధం లేకుండానే మనకు కట్టిన అపార్ట్మెంట్లే దొరుకుతున్నాయి. ఏపీని 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా చేస్తానని బాబు అంటున్నారే? ఈ 2050 మాట సరే కానీ..ఆయన గత రికార్డును చూద్దాం. ఇంతకుముందు తొమ్మిదేళ్లు పాలించారు. తాను సీఎం కాక ముందు 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక లోటు అనేది లేదు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తొలిసారిగా ఏపీకి 22 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్, తదనంతర సీఎంల హయాంలో ఆ 22 వేల కోట్ల లోటును పూడ్చటమే కాకుండా అదనంగా 11 వేల కోట్ల మిగులు ఆదాయాన్ని ఏర్పర్చి పోయారు. ఆస్తికి, అప్పుకు నిష్పత్తి చూస్తే బాబు సీఎం కాకముందు 1994లో ప్రతి వంద రూపాయల రాష్ట్ర అప్పుకు వందకంటే ఎక్కువగా రాష్ట్ర ఆస్తి ఉండేది. కానీ బాబు 2004లో దిగిపోయేనాటికి రూ. 100ల రాష్ట్ర అప్పుకు రూ. 45లు మాత్రమే రాష్ట్ర ఆస్తి ఉండేది. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేశాను అంటున్నారు బాబు? ఏపీ లోటు బడ్జెట్ రూ. 16 వేల కోట్లు అని ఒక కథనం. అంత లోటు బడ్జెట్ 2014 నాటికి ఏపీకి లేదు. కేంద్రం కూడా దీన్ని స్పష్టం చేసింది. రూ. 3 వేల కోట్ల వరకు మాత్రమే లోటు బడ్జెట్ ఉండేది. దాన్ని కూడా ఇచ్చేసినట్లు కేంద్రం చెబుతోంది. అది కాక వైవీ రెడ్డి అధ్యక్షతలో ఉన్న 14వ ఆర్థిక సంఘం రూ. 22 వేల కోట్లను 5 ఏళ్ల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఇచ్చింది. కొత్త రాష్ట్రానికి ఆర్థిక లోటును తీర్చడం కోసం అంతమొత్తం కేటాయించారు. అంతే కానీ లోటు బడ్జెట్, ఈ బీదపలుకులు అన్నీ తప్పు. అసెంబ్లీ బహిష్కరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకున్నట్లుందే? ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని బేఖాతరు చేస్తూ అవసరం లేకున్నా అంటే అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల బలం ఉండి కూడా చంద్రబాబు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేవారు ఉన్నారంటూ చెప్పారు కూడా. ఎలా వెళుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు కాంట్రాక్టులిస్తున్నారు, పదవులు ఇస్తున్నారు. డబ్బులిస్తున్నారు. ప్యాకేజీలు ఇస్తున్నారు. అసలు మీకిది అవసరమా? రాజ్యాంగ పరంగా ఇంత నష్టదాయకమైన పనిని ఎలా చేస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలూ దీనికి అంగీకరించారా? మూడేళ్లుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ వస్తున్నాం. పైగా ఈ మూడేళ్లలో మా పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాలే లేవు. ఒకవేళ మాట్లాడేందుకు వచ్చినా వారికి సమయం ఇవ్వకపోగా, నేరుగా మా వాళ్లనే తిట్టడానికి సమయం కల్పిస్తున్నారు. అక్కడ టెలికాస్ట్ హక్కులు ఏబీఎన్వి. ఆరు కెమెరాలు ఉన్నప్పుడు ఏ కెమెరాను చూపించాలో దాన్నే చూపిస్తారు. చూపించకూడదనుకున్న కెమెరాను కట్ చేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుతున్నట్లుగా అసెంబ్లీని నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతటి అన్యాయం జరుగుతున్న అసెంబ్లీకి వెళ్లకపోవడమే మేలనుకున్నాం. నంద్యాల ఓటమిని మీరెలా విశ్లేషిస్తారు? ఈరోజు మనం తీవ్ర నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మారిపోదు అని ప్రజలకు తెలుసు. పైగా వీళ్లు ఒక నంద్యాల నియోజకవర్గానికే విచ్చలవిడిగా ఫండ్స్ ఇచ్చారు. ఫలానా పనులు అర్జెంటుగా మేం చేస్తున్నాం అని చూపించారు. ఉదాహరణకు, నంద్యాలలో రోడ్డు విస్తరణ పనులను హడావుడిగా చేపట్టారు. ఎన్నికల్లో గెలిచాక ఇంతవరకు దాన్ని ముట్టుకోలేదు. ఎంత పొరపాటు చేశాం అని జనం ఇప్పుడు తమను తాము తిట్టుకుంటున్నారు. ఈరోజుకీ ఆ రోడ్డు అలాగే ఉండి దుమ్మురేగుతోంది. జనం దానిమీదే ప్రయాణిస్తున్నారు. బాబు, వైఎస్ జగన్.. వీరినెలా పోలుస్తారు? ఇద్దరివీ రెండు విభిన్న తరాలు. చంద్రబాబుది దాదాపు రిటైర్మెంట్ అవుతున్న తరం. జగన్ జనరేషన్ అంటే ఇప్పుడు 45 ఏళ్ల వయసు. తదుపరి 20 ఏళ్ల వరకు శక్తివంతంగా పరిపాలన చేయగల దశ తనది. తరాల మధ్య అంతరం అనేది అక్కడే కనపడిపోతోంది. ఉదాహరణకు మానసికంగా, ఆలోచనపరంగా ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఏళ్ల వయసులోనే మనిషి ఉచ్ఛదశకు వస్తారు. అప్పటికి తగిన అనుభవం ఉంటుంది. ఇంకా పదిహేనేళ్లపాటు పనిచేయగలిగిన శక్తి ఉంటుంది. 70కి దగ్గరయ్యేసరికి ఇక అది రిటైర్మెంట్ అన్నమాట. లోకేశ్ వారసత్వాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? అది పనితీరుపై ఆధారపడి ఉంటుంది. లోకేశ్ అనుభవం ప్రకారం చూస్తే ఆయన ప్రవేశమే తప్పని నా అభిప్రాయం. ఒక వారసుడిని రాజకీయాల్లోకి తేవాలనుకున్నప్పడు మీరు ఎవరినైనా ముందు ఎమ్మెల్యేగా తీసుకురావాలి. అంటే నా ఉద్దేశం జనం నుంచే మొదలు పెట్టాలి. లేటయినా ఫర్వాలేదు. ఎమ్మెల్సీగా తీసుకొచ్చి తర్వాత మంత్రిని చేయడం అంటే సేఫ్ సైడ్ చూసుకున్నారనే అర్థం. మీరు కూడా అధికారంలోకి వస్తే అబద్ధాలు చెబుతూ గడిపేస్తారా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకపోతే ఇక వాటిని ఎందుకు చెప్పాలి? అదే మాకూ టీడీపీకీ ఉన్న తేడా.. 2019 ఎన్నికల్లో మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. మేం గెలిస్తే ఏంచేయాలనుకుంటున్నామో అవన్నీ ప్లాన్ చేసుకుని చేయవచ్చు. ఈ క్రమంలో మేం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు జనంలోకి వెళ్లాయనే తలుస్తున్నాం. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/EENb6U https://goo.gl/BJsjd8 -
అక్రమ ప్రాజెక్టుల చరిత్ర పునరావృతం
- సీఎంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం - చంద్రబాబు అప్పటి పాలనలోనే ఆల్మట్టి, బాబ్లీలకు అంకురార్పణ - ఇప్పుడు ‘పాలమూరు’, డిండిలను నిర్మిస్తున్న తెలంగాణ - అన్యాయాన్ని అడ్డుకునేందుకే విపక్ష నేత జగన్ దీక్ష సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు అప్పటి తొమ్మిదేళ్ల పాలనలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఏపీకి నష్టం కలుగజేశాయని, ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన హయాంలోనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు హయాంలో చరిత్ర పునరావృతమవుతోందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి కొరత తీవ్రంగా ఉంటున్న పరిస్థితుల్లో.. ఎగువ రాష్ట్రాలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న 1995-2004 మధ్య కాలంలోనే అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. అప్పట్లో కేంద్రంలో తాను కింగ్మేకర్ని అని చెప్పుకుంటూ కూడా చంద్రబాబు కర్ణాటకలో ఆల్మట్టిని, మహారాష్ట్రలో బాబ్లీని ఆపలేక పోయారని ఎద్దేవా చేశారు. ఈ నిర్మాణాల వల్లనే బచావత్ అవార్డు గడువు ముగిసి కొత్తగా వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఆ రాష్ట్రాలు ఎక్కువ నీటి కేటాయింపులు పొందగలిగాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్రలు తమ ప్రాజెక్టులను వేగంగా నిర్మించుకుంటే ఏపీలో ప్రాజెక్టులపై బాబు అసలు శ్రద్ధే చూపలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చంద్రబాబు ఒక లేఖ రాసి సరిపెట్టారని విమర్శించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో 800 అడుగుల నుంచి 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని తెలంగాణ సంకల్పించిందని చెప్పారు. ఇదే కనుక జరిగితే రాయలసీమ పూర్తిగా ఎడారిలా మారుతుందని, కృష్ణా డెల్టా.. ప్రకాశం జిల్లాలు అల్లాడి పోతాయని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ఈ ప్రాంతాలకు నీరందాలంటే కనీసం 854 అడుగుల మేర నీటి మట్టం ఉండాలని చెప్పారు.బాబుకు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంపై శ్రద్ధ పెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందరి దృష్టికీ తీసుకెళ్లేందుకే.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్షను చేయబోతున్నారని బుగ్గన తెలిపారు. ఈ అక్రమాన్ని ప్రజ ల దృష్టికి, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికే జగన్ ఆందోళనకు దిగుతున్నారన్నారు.