అక్రమ ప్రాజెక్టుల చరిత్ర పునరావృతం
- సీఎంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం
- చంద్రబాబు అప్పటి పాలనలోనే ఆల్మట్టి, బాబ్లీలకు అంకురార్పణ
- ఇప్పుడు ‘పాలమూరు’, డిండిలను నిర్మిస్తున్న తెలంగాణ
- అన్యాయాన్ని అడ్డుకునేందుకే విపక్ష నేత జగన్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు అప్పటి తొమ్మిదేళ్ల పాలనలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఏపీకి నష్టం కలుగజేశాయని, ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన హయాంలోనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు హయాంలో చరిత్ర పునరావృతమవుతోందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో నీటి కొరత తీవ్రంగా ఉంటున్న పరిస్థితుల్లో.. ఎగువ రాష్ట్రాలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న 1995-2004 మధ్య కాలంలోనే అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. అప్పట్లో కేంద్రంలో తాను కింగ్‌మేకర్‌ని అని చెప్పుకుంటూ కూడా చంద్రబాబు కర్ణాటకలో ఆల్మట్టిని, మహారాష్ట్రలో బాబ్లీని ఆపలేక పోయారని ఎద్దేవా చేశారు. ఈ నిర్మాణాల వల్లనే బచావత్ అవార్డు గడువు ముగిసి కొత్తగా వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఆ రాష్ట్రాలు ఎక్కువ నీటి కేటాయింపులు పొందగలిగాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్రలు తమ ప్రాజెక్టులను వేగంగా నిర్మించుకుంటే ఏపీలో ప్రాజెక్టులపై బాబు అసలు శ్రద్ధే చూపలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చంద్రబాబు ఒక లేఖ రాసి సరిపెట్టారని విమర్శించారు.
ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో 800 అడుగుల నుంచి 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని తెలంగాణ సంకల్పించిందని చెప్పారు. ఇదే కనుక జరిగితే రాయలసీమ పూర్తిగా ఎడారిలా మారుతుందని, కృష్ణా డెల్టా.. ప్రకాశం జిల్లాలు అల్లాడి పోతాయని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ఈ ప్రాంతాలకు నీరందాలంటే కనీసం 854 అడుగుల మేర నీటి మట్టం ఉండాలని చెప్పారు.బాబుకు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంపై శ్రద్ధ పెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అందరి దృష్టికీ తీసుకెళ్లేందుకే..
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్షను చేయబోతున్నారని బుగ్గన తెలిపారు. ఈ అక్రమాన్ని ప్రజ ల దృష్టికి, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికే జగన్ ఆందోళనకు
దిగుతున్నారన్నారు.