
సాక్షి, హైదరాబాద్: ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరం ప్రాజెక్టును ఇంతకుముందు ప్రకటించిన విధంగా త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వెంటపడి ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా.. చంద్రబాబు తన చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టును తిరిగి కేంద్రానికే ఇచ్చేస్తానని చెప్పడమేమిటని నిలదీశారు. సీఎం 27 సార్లు, సాగునీటి శాఖ మంత్రి 47 సార్లు పర్యటించామంటూ చెప్పుకుంటున్నారని.. దాని వల్ల ఒరిగిందేమిటని బుగ్గన ప్రశ్నించారు. తనకున్న ప్రచార యావతోనే ఆయన పోలవరం చుట్టూ తిరిగారని, దాని వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించాలని అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారని బాబును బుగ్గన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment