లోకేశ్‌ వారసత్వాన్ని ఎలా ఎదుర్కొంటారు? | kommineni Srinivasa RAo Manasulo Maata with PAC Chairman Rajendranath Reddy | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం

Published Wed, Nov 1 2017 1:11 AM | Last Updated on Wed, Nov 1 2017 3:09 AM

kommineni Srinivasa RAo Manasulo Maata with PAC Chairman Rajendranath Reddy

దేని గురించి మాట్లాడినా ప్రపంచ స్థాయి అని చంద్రబాబు ఇటీవల చెబుతుండటం ఆయన స్థాయికి, వయసుకు తగదు. మూడు నాలుగేళ్లలో ఒక రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం సాధ్యమే అంటే, మనకు తెలిసిన ప్రపంచ స్థాయి నేతలందరూ పనికిరాని వారనే కదా అర్థం. శతాబ్దాల క్రితం న్యూఢిల్లీని కట్టినవారు సమర్థులు కారా? 400 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను కట్టిన కులీకుతుబ్‌ షా సమర్థుడు కాడా? అభివృద్ధి అనేది శతాబ్దాలు, దశాబ్దాల క్రమంలో జరిగే ప్రక్రియ. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, మూడేళ్ల కాలంలో లక్షా 9 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం కలవరం కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఆస్తులను సృష్టించడానికి బదులు అప్పులను పెంచే పనులు చక్కగా చేసుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం మూడేళ్లలో ఏపీని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా చేస్తానని గొప్పలు చెప్పటం అంటే అభివృద్ధిని దశాబ్దాల క్రమంలో పద్ధతిగా సాగించిన ప్రపంచనేతలందరూ అసమర్థులనే అర్థం వస్తుందన్నారు. టెలికాస్ట్‌ హక్కులను ఏబీఎన్‌ చానల్‌కు కట్టబెట్టి ఏపీ అసెంబ్లీని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేశారని, ఎక్కడ కెమెరాను చూపించాలి, ఎక్కడ కట్‌ చేయాలి అనేది ఆ చానల్‌ నిర్ణయించడంతో తీవ్ర అన్యాయం జరుగుతున్నందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయిం చినట్లు చెబుతున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

పబ్లిక్‌ అకౌంట్స్‌ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయం?
ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. కాగ్‌ వారి తాజా గణాంకాలు చూస్తే, విపరీతమైన లోటు కనిపిస్తోంది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నాయి. రెంటినీ కలిపి చూస్తే దాదాపు లక్ష కోట్ల రూపాయలపైన అప్పు పెరిగింది. 1956 నుంచి 2014 వరకు 60 సంవత్సరాల కాలంలో వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 96 వేల కోట్లు అయితే, ఒక్క ఈ మూడేళ్ల కాలంలోనే దాదాపు  లక్షా 9 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. దీంట్లో కూడా రూ. 63 వేల కోట్లు కేవలం రెవెన్యూ లోటుగా కనబడుతోంది. రోజు ఖర్చుల కోసం, స్థిరంగా ఏ ఆస్తీ తయారు చేయకుండా ఉండేదాని కోసం రూ. 63 వేల కోట్ల అప్పు చేసేశారు. మిగిలిన రూ. 46 వేల కోట్లు కూడా స్థిరాస్తులు సృష్టించడానికి బదులు వృథా ఖర్చు పెట్టేశారు. దీంట్లో రూ. 8 వేలకోట్లను విద్యుత్‌ సంస్థల అప్పు తీర్చడం కోసం పెట్టినట్లుంది తప్పితే మిగిలినదంతా పట్టిసీమ వంటి అంచనాలకు మించిన, అనవసరమైన ఖర్చులకోసం వెచ్చించారు. పట్టిసీమకు రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టామన్నారు కానీ కాగ్‌ నివేదిక చూస్తే అది మితిమీరిన అంచనా అని తెలుస్తోంది. ఇక వెలగపూడిలో కట్టిన తాత్కాలిక భవనాలు. కేవలం తాత్కాలిక భవనాలు కట్టడానికి చదరపు అడుగుకు రూ. 4,500లు చెల్లించారు. అదే హైదరాబాద్‌ అంత పెద్దనగరంలో గచ్చిబౌలి ఏరియాలో చదరపు అడుగుకు రూ. 4,000ల చొప్పున భూమితో సంబంధం లేకుండానే మనకు కట్టిన అపార్ట్‌మెంట్లే దొరుకుతున్నాయి. 

ఏపీని 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా చేస్తానని బాబు అంటున్నారే?
ఈ 2050 మాట సరే కానీ..ఆయన గత రికార్డును చూద్దాం. ఇంతకుముందు తొమ్మిదేళ్లు పాలించారు. తాను సీఎం కాక ముందు 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక లోటు అనేది లేదు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తొలిసారిగా ఏపీకి 22 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్, తదనంతర సీఎంల హయాంలో ఆ 22 వేల కోట్ల లోటును పూడ్చటమే కాకుండా అదనంగా 11 వేల కోట్ల మిగులు ఆదాయాన్ని ఏర్పర్చి పోయారు. ఆస్తికి, అప్పుకు నిష్పత్తి చూస్తే బాబు సీఎం కాకముందు 1994లో ప్రతి వంద రూపాయల రాష్ట్ర అప్పుకు వందకంటే ఎక్కువగా రాష్ట్ర ఆస్తి ఉండేది. కానీ బాబు 2004లో దిగిపోయేనాటికి రూ. 100ల రాష్ట్ర అప్పుకు రూ. 45లు మాత్రమే రాష్ట్ర ఆస్తి ఉండేది. 

రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేశాను అంటున్నారు బాబు?
ఏపీ లోటు బడ్జెట్‌ రూ. 16 వేల కోట్లు అని ఒక కథనం. అంత లోటు బడ్జెట్‌ 2014 నాటికి ఏపీకి లేదు. కేంద్రం కూడా దీన్ని స్పష్టం చేసింది. రూ. 3 వేల కోట్ల వరకు మాత్రమే లోటు బడ్జెట్‌ ఉండేది. దాన్ని కూడా ఇచ్చేసినట్లు కేంద్రం చెబుతోంది. అది కాక వైవీ రెడ్డి అధ్యక్షతలో ఉన్న 14వ ఆర్థిక సంఘం రూ. 22 వేల కోట్లను 5 ఏళ్ల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఇచ్చింది. కొత్త రాష్ట్రానికి ఆర్థిక లోటును తీర్చడం కోసం అంతమొత్తం కేటాయించారు. అంతే కానీ లోటు బడ్జెట్, ఈ బీదపలుకులు అన్నీ తప్పు. 

అసెంబ్లీ బహిష్కరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకున్నట్లుందే?
ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని బేఖాతరు చేస్తూ అవసరం లేకున్నా అంటే అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల బలం ఉండి కూడా చంద్రబాబు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేవారు ఉన్నారంటూ చెప్పారు కూడా. ఎలా వెళుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు కాంట్రాక్టులిస్తున్నారు, పదవులు ఇస్తున్నారు. డబ్బులిస్తున్నారు. ప్యాకేజీలు ఇస్తున్నారు.

అసలు మీకిది అవసరమా? రాజ్యాంగ పరంగా ఇంత నష్టదాయకమైన పనిని ఎలా చేస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలూ దీనికి అంగీకరించారా?
మూడేళ్లుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ వస్తున్నాం. పైగా ఈ మూడేళ్లలో మా పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాలే లేవు. ఒకవేళ మాట్లాడేందుకు వచ్చినా వారికి సమయం ఇవ్వకపోగా, నేరుగా మా వాళ్లనే తిట్టడానికి సమయం కల్పిస్తున్నారు. అక్కడ టెలికాస్ట్‌ హక్కులు ఏబీఎన్‌వి. ఆరు కెమెరాలు ఉన్నప్పుడు ఏ కెమెరాను చూపించాలో దాన్నే చూపిస్తారు. చూపించకూడదనుకున్న కెమెరాను కట్‌ చేస్తారు. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని నడుపుతున్నట్లుగా అసెంబ్లీని నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతటి అన్యాయం జరుగుతున్న అసెంబ్లీకి వెళ్లకపోవడమే మేలనుకున్నాం.

నంద్యాల ఓటమిని మీరెలా విశ్లేషిస్తారు?
ఈరోజు మనం తీవ్ర నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మారిపోదు అని ప్రజలకు తెలుసు. పైగా వీళ్లు ఒక నంద్యాల నియోజకవర్గానికే విచ్చలవిడిగా ఫండ్స్‌ ఇచ్చారు. ఫలానా పనులు అర్జెంటుగా మేం చేస్తున్నాం అని చూపించారు. ఉదాహరణకు, నంద్యాలలో రోడ్డు విస్తరణ పనులను హడావుడిగా చేపట్టారు. ఎన్నికల్లో గెలిచాక ఇంతవరకు దాన్ని ముట్టుకోలేదు. ఎంత పొరపాటు చేశాం అని జనం ఇప్పుడు తమను తాము తిట్టుకుంటున్నారు. ఈరోజుకీ ఆ రోడ్డు అలాగే ఉండి దుమ్మురేగుతోంది. జనం దానిమీదే ప్రయాణిస్తున్నారు. 

బాబు, వైఎస్‌ జగన్‌.. వీరినెలా పోలుస్తారు?
ఇద్దరివీ రెండు విభిన్న తరాలు. చంద్రబాబుది దాదాపు రిటైర్మెంట్‌ అవుతున్న తరం. జగన్‌ జనరేషన్‌ అంటే ఇప్పుడు 45 ఏళ్ల వయసు. తదుపరి 20 ఏళ్ల వరకు శక్తివంతంగా పరిపాలన చేయగల దశ తనది. తరాల మధ్య అంతరం అనేది అక్కడే కనపడిపోతోంది. ఉదాహరణకు మానసికంగా, ఆలోచనపరంగా  ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఏళ్ల వయసులోనే మనిషి ఉచ్ఛదశకు వస్తారు. అప్పటికి తగిన అనుభవం ఉంటుంది. ఇంకా పదిహేనేళ్లపాటు పనిచేయగలిగిన శక్తి ఉంటుంది. 70కి దగ్గరయ్యేసరికి ఇక అది రిటైర్మెంట్‌ అన్నమాట. 

లోకేశ్‌ వారసత్వాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? 
అది పనితీరుపై ఆధారపడి ఉంటుంది. లోకేశ్‌ అనుభవం ప్రకారం చూస్తే ఆయన ప్రవేశమే తప్పని నా అభిప్రాయం. ఒక వారసుడిని రాజకీయాల్లోకి తేవాలనుకున్నప్పడు మీరు ఎవరినైనా ముందు ఎమ్మెల్యేగా తీసుకురావాలి. అంటే నా ఉద్దేశం జనం నుంచే మొదలు పెట్టాలి. లేటయినా ఫర్వాలేదు. ఎమ్మెల్సీగా తీసుకొచ్చి తర్వాత మంత్రిని చేయడం అంటే సేఫ్‌ సైడ్‌ చూసుకున్నారనే అర్థం. 

మీరు కూడా అధికారంలోకి వస్తే అబద్ధాలు చెబుతూ గడిపేస్తారా?
అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకపోతే ఇక వాటిని ఎందుకు చెప్పాలి? అదే మాకూ టీడీపీకీ ఉన్న తేడా..  2019 ఎన్నికల్లో మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. మేం గెలిస్తే ఏంచేయాలనుకుంటున్నామో అవన్నీ ప్లాన్‌ చేసుకుని చేయవచ్చు. ఈ క్రమంలో మేం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు జనంలోకి వెళ్లాయనే తలుస్తున్నాం.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/EENb6U

https://goo.gl/BJsjd8

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement