ఆంధ్రప్రదేశ్ నేరాలకు రాజధానిగా మారినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమైన రుజువులు కనిపిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే అనేక ఘాతుకాలు చోటు చేసుకోవడం దీనికి కారణం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం విచారకరమైన అంశమని చెప్పాలి.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుదో విచిత్రమైన శైలి. ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వంలో ఉన్న వారిని బద్నాం చేసేందుకు ఉన్నవీ లేనివి.. చిన్నా చితకా ఘటనలను కూడా కొండంత చేసి చూపుతూంటారు. అదే అధికారంలో ఉన్నారా...? కొండ విరిగి మీదపడ్డా.. అబ్బే చీమ కూడా కదల్లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం మొత్తం ఇలాంటి ఘటనలతో కూడుకున్నదే. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వారిని ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోని సిబ్బంది చిన్నా చితక ఘటనలను చిలువలు వలువలుగా చేసి ప్రచారంలో పెడుతూంటాయి. వాటి ఆధారంగా బాబు ప్రభుత్వంపై బురద చల్లుతూంటారు.
అధికారంలో ఉన్నప్పుడు దీనికి పూర్తి రివర్స్ గేర్! అసలు ఏమీ జరగనట్టు, ఒక వేళ ఎక్కడైనా జరిగినా తాను చాలా కఠినంగా వ్యవహరించినట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. విభజన తరువాత కూడా గత 130 రోజుల్లో చోటు చేసుకున్నన్ని హింసాత్మక ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. హింస ఒక ఎత్తు అయితే.. ఇసుక, మద్యం, మాదకద్రవ్యాల ఘటనలు ఇంకో ఎత్తు. ఎవరైనా సరే.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో పస లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది.
స్వయానా టీడీపీ ఎమ్మెల్యేలే ఇలాంటి అకృత్యాలకు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా కిమ్మని అనేందుకూ సాహసించడం లేదు బాబు, పవన్ ద్వయం! మద్యం షాపులు, మట్కా నిర్వాహకులు, పేకాట క్లబ్‌లు తమకు ఎంతెంత మామూళ్లు ఇవ్వాలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ప్రకటిస్తూండటం, అభివృద్ధి సాకుతో మున్సిపాలిటీలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూండటం బహుశా లోకేష్ రెడ్ బుక్‌ను మించిన వ్యవహారం అనుకోవాలి.
రాష్ట్రంలో వివిధ ప్రాంతలలో జరిగిన అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హిందూపూర్ నియోజకవర్గంలో కొందరు నీచులు అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దారుణం. దుండగులు కుటుంబ సభ్యులను కట్టేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బతుకుతెరువుకోసం వచ్చిన వారిపై పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించడానికి వైఎస్సార్ సీపీ మహిళానేతలు వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతించ లేదు.
వైఎస్సార్ సీపీ పాలన సమయంలో విజయవాడలో ఒక బాలిక అఘాయిత్యానికి గురైతే పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలికను చంద్రబాబు పరామర్శించడానికి వెళ్లారు. నిజానికి పురుషులు ఎవ్వరూ అలా వెళ్ల కూడదని మార్గదర్శకాలు ఉన్నా చంద్రబాబు అధికారులను బెదిరించి మరీ వెళ్లారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మహిళా నేతలను కూడా పరామర్శించనివ్వడం లేదు.
మామూలుగా అయితే హిందూపూర్ జరిగిన ఘటనల్లాంటివి మీడియాలో అత్యంత ప్రముఖంగా కనిపించాలి. కానీ ఈ వార్త ఎక్కువ శాతం మీడియాలో లోపలి పేజీలకే పరిమితమైంది. ఎల్లో మీడియా అయితే సాధ్యమైనంత వరకూ ఇలాంటి ఘటనలను ప్రజలకు తెలియకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ధర్మవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తల్లి హత్యకు గురైతే పదిరోజుల తర్వాతగానీ ఆమె శవం ఆచూకీ దొరకలేదు. ఇక తిరుపతి జిల్లా వరగాని అనే గ్రామంలో ఒక బాలుడు కిడ్నాప్ అయి హత్యకు గురయ్యాడు.
పుంగనూరులో ఒక ముస్లిం బాలికను హత్యాచారం చేసి ఆ తర్వాత కనిపించకుండా మాయం చేశారు. అక్కడ తీవ్రమైన ఆందోళన వచ్చాకగానీ ఆ బాలిక మృతదేహాన్ని కనుగొనలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడకు వెళ్లడానికి సిద్ధం కాగా అప్పుడు రాష్ట్ర మంత్రులు హడావుడిగా వెళ్లి కుటుంబ సభ్యులకు హామీలు ఇచ్చి వచ్చారు. నందికొట్కూరు వద్ద ముచ్చుమర్రిలో వాసంతి అనే బాలిక మాయమై శవమైపోయింది. ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం దొరకలేదు. ఇలా ఒకటి కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో నిత్యం ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి.
డోన్‌లో టీడీపీ నేతలకు చెందిన కొందరు పిల్లలు మైనర్ బాలురపై జరిపిన లైంగిక దాడులు కలకలం రేపాయి. వీటికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఈ ఘటనకు మద్యం సేవించడమే కారణమని తేలుతోంది. కొద్ది రోజుల క్రితం బద్వేల్, తెనాలి వంటి చోట్ల అకృత్యాలు జరిగాయి. గతంలో జగన్ ప్రభుత్వం దిశ యాప్ ద్వారా ఎక్కడ ఏ మహిళకు ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేసింది.
దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. కాని చంద్రబాబు ప్రభుత్వం వాటన్నిటిని నీరుకార్చినట్లుంది. చంద్రబాబుకు జగన్ పై ద్వేషం ఉంటే ఉండవచ్చు కానీ జనానికి మేలు చేసే విషయాలపై ఇలా వ్యవహరించి వ్యవస్థలను ద్వంసం చేయడం మాత్రం దారుణం అని చెప్పాలి.ఏలూరు వద్ద ఒక హాస్టల్ మేనేజర్ 14 మంది బాలికల్ని లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ కేసులు కొన్నిటిలో కొందరిని అరెస్టు చేసి ఉండవచ్చు.
సమాజంలో కొన్ని నేరాలు జరుగుతూనే ఉంటాయి. వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వంలో పోలీసులకు ఇలాంటి వాటిని అదుపు చేయడం కన్నా టీడీపీ నేతలు చెప్పిన వారిని వేధించడానికి, వారిపై కేసులు పెట్టడానికే సమయం సరిపోతున్నట్టు లేదు. అదే టైమ్‌లో టీడీపీ నేతల దౌర్జన్యాలను కొన్ని చోట్ల పోలీసులు సైతం భరించక తప్పడం లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఒక ఎస్సై చొక్కా పట్టుకొని నడివీధిలో దౌర్జన్యం చేశారు. రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఒక పోలీసు అధికారి పట్ల ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందీ అందరూ చూశారు.
అనంతపురం జిల్లా హనకనకల్లులో శ్రీరాముడి రథానికి కొందరు దుండుగులు నిప్పంటిస్తే దాన్ని వైఎస్ఆర్ సీపీకి పులమడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. ఈ ఘటనతో రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఇలాంటివి చేస్తుండడంతో మొత్తం పోలీసు వ్యవస్థనంతటినీ టీడీపీ నేతలే నడుపుతున్నారనే భావన కలుగుతోంది.
ముంబయికి చెందిన మోసకారి నటి జత్వానీకి సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం ద్వారా తన కక్ష ధోరణిని బైట పెట్టుకుంది. రఘురామ కృష్ణంరాజు కుల విద్వేషాలను రెచ్చగొట్టారనే కేసులో అరెస్టయినప్పుడు తనపై పోలీసు అధికారులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆయన ఇప్పుడు కేసు పెట్టారు. అందులో కొంతమంది సీనియర్ అధికారులను ఇరికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై వత్తిడి తెస్తున్నారట. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందన్న అభియోగం కేసు, నటి జత్వానీ కేసు సీఐడీకి అప్పగించి మరీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం వారు దాడి చేస్తే ఆ కేసును ఏం చేశారో తెలియడం లేదు.
గతంలో సుగాలి ప్రీతి కేసులోను, 31 వేల మంది మహిళల మిస్సింగ్ అంటూ జగన్ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా 130 రోజుల్లో జరిగిన అకృత్యాలపై కనీసం స్పందించడం లేదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు అత్యాచారాలు, మరో వైపు హింసాకాండ, ఇంకోవైపు వేధింపుల పర్వంతో ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఘోరమైన పరిస్థితుల్లోకి కూటమి ప్రభుత్వం తీసుకుపోతోంది.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment