నీరు...దారి...ఇదే సమస్య!
- ప్రజల నుంచి విజ్ఞప్తులు
- వ్యయ అంచనాల్లో ప్రభుత్వం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలు తాగునీరు, డ్రైనేజీ, రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో వాననీరు వెళ్లే మార్గం లేక, భూగర్భ డ్రైనేజీలు లేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్‌లో తమ వద్దకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులకు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో సింహభాగం ఇవే ఉన్నాయి. వీధి దీపాలు, ఫుట్‌పాత్‌ల సమస్యలు ఉన్నప్పటికీ, వీటిపైనే ప్రజలు ఎక్కువగా స్పందించారు. ఇక సొంత ఇల్లు లేదనేవారు భారీ సంఖ్యలోనే ఉన్నప్పటికీ... వాటికి ఎన్ని దరఖాస్తులు అందినదీ మంగళవారం నాటి సీఎం సమీక్ష సమావేశంలో వెల్లడి కానుంది.
ప్రజల ఫిర్యాదులు పరిష్కరించేందుకు దాదాపు రూ.730 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమిక అంచనా. వీటిలో ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయిస్తారు.. ఎన్ని దశల్లో పూర్తిచేస్తారు.. ఎప్పటిలోగా పూర్తిచేస్తారు.. తదితర అంశాలు మంగళవారం నాటి సమావేశంలో వెల్లడి కాగలవని పలువురు భావిస్తున్నారు. ఇదే తరుణంలో గ్రేటర్‌లోని ఏ సర్కిల్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తారనేదిఆసక్తికరంగా మారింది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 18 సర్కిళ్లు ఉన్నాయి. ఎల్‌బీనగర్ సర్కిల్ నుంచి రూ. 111 కోట్ల మేరకు... కూకట్‌పల్లి నుంచి రూ. 108 కోట్ల మేరకు విజ్ఞప్తులు అందాయి. కుత్బుల్లాపూర్ నుంచి ఏకంగా రూ. 123 కోట్ల విలువైన వినతులందాయి.