వరుణుడే దిక్కు
సాక్షి, నెల్లూరు: జూన్, జూలైలో సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కా లేదు. జిల్లా వ్యవసాయ రంగానికి ప్రా ణాధారమైన 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయంలో నీటి మట్టం 15 టీఎంసీలకు చేరింది. డెడ్ స్టోరేజీ 8 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు పోను మిగిలింది 3 టీఎంసీల నీరు మాత్రమే. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో నామమాత్రంగా కూడా వర్షాలు కురవలేదు. జూన్ సాధారణ వర్షపాతం 57 మిల్లీమీటర్లు కాగా కేవలం 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూలై సాధారణ వర్షపాతం 86 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకూ 35.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన రెండు నెలల్లో సగం వర్షపాతం కూడా నమోదుకాలేదు. సోమశిలలో ఉన్న నీళ్లను చూసుకొని రైతులు పెన్నాడెల్టాలో రెండో పంట సాగుకు దిగారు. సకాలంలో నీళ్లు అందక పోవడంతో 55,404 హెక్టార్ల సాధారణ వరిసాగుకు గాను ఇప్పటి వరకూ 46,427 హెక్టార్లలో మాత్రమే వరిపంట సాగుచేశారు.
అక్టోబర్ వరకూ నీళ్లు ఉంటే తప్ప వరిపండే పరిస్థితి లేదు. అధికారులేమో పెన్నా డెల్టాకింద 2 లక్షల 43 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పినా అది పూర్తిగా సాగయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం సోమశిలలో సాగుకు 3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. జిల్లాతో పాటు ఎగువన కడప,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడి ఉంటే పెన్నాద్వారా సోమశిలకు నీళ్లు చేరేవి. అక్కడ కూడా వర్షాలు లేవు. మరోవైపు ఎగువరాష్ట్రమైన కర్నాటకలో సరైన వర్షాలు కురవకపోవడంతో కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకే చేరేపరిస్థితి లేకుం డా పోయింది. దీంతో శ్రీశైలం దాదాపు ఎండిపోయింది. కనీసం ఎగువన అయినా వర్షాలు కురిస్తే తప్ప సోమశిలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సోమశిలకు నీళ్లు వస్తేనే నెల్లూరు జిల్లాలో వరి పండుతుంది. సకాలంలో వరుణుడు కరుణించక పోతే కృష్ణా, గోదావరి జిల్లాల తర్వాత అధికంగా వరిపండించే జిల్లాలో కరువు తప్పదు. ఎడగారు సాగు కూడా జిల్లాలో ఆశించిన స్థాయిలో లేదు. సాధారణ సాగుతో పోలిస్తే సగం కూడా సాగుకు నోచుకోని దుస్థితి. 969 హెక్టార్లలో సాగుకావాల్సిన సజ్జ కేవలం 178 హెక్టార్లకు పడిపోయింది. కంది 1549 హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా ఒక్క ఎకరాలో సాగుకాలేదు. 7238 హెక్టార్లలో సాగుకావాల్సిన వేరుశనగ కేవలం 3677 హెక్టార్లకే పరిమితమైంది. మొత్తం 90,658 హెక్టార్లలో పం టలు సాగుకావాల్సి ఉండగా కనీసం 5 వేల హెక్టార్లకు కూడా నోచుకోలేదు. రాబోయే కాలంలోనైనా వర్షాలు కురవక పోతే జిల్లాలో కరువు పరిస్థితి తప్పేట్టులేదు.
ప్రాజెక్టులలో తాజా నీటిమట్టం : 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిలలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరే ఉంది. 67 టీఎంసీల కండలేరు రిజర్వాయర్‌లో 14.800 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కనిగిరి రిజర్వాయర్‌లో 21.45 అడుగులకు గాను 17.5 అడుగులు,16.30 అడుగుల సామర్థ్యం కలిగిన నెల్లూరు ట్యాంక్‌లో ప్రస్తుతం 12.02 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి.