సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు దేశానికి వెన్నెముక. అటువంటి రైతు సాగునీరందక పంటలు ఎండి దీనస్థితిలో ఉన్నాడు. వారిని ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నడుం బిగించారు. సాగు, తాగునీరు అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమ బాటపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కొండపనాయుడు, యానాదిరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రస్తుతం వేలాది ఎకరాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి. ఒక్క తడి పారితే పంటలు చేతికొచ్చే పరిస్థితి. ఎలాగైనా పంటలను చేతికందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మూడు రోజులపాటు నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. చివరి దశలో ఉన్న పంటలకు సాగునీరందించటంతో పాటు వేసవిలో తాగునీటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కావలి ఏరియా ఆసుపత్రి సెంటర్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గురువారం దీక్ష చేపట్టారు.
కావలి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ర్యాలీగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు సంఘీబావం తెలిపారు. ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేస్తున్నారని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావలికి తరలిరావటం కనిపించింది. వచ్చిన వారంతా ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇదీ ప్రస్తుతం రైతుల పరిస్థితి
కావలి నియోజకవర్గ పరిధిలో సుమారు 60 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అవన్నీ చివరి దశలో ఉన్నాయి. చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి పలుమార్లు మంత్రులు, అధికారులను కలిసి విన్నవించారు. ఆయన ఒత్తిడితో కలెక్టర్ జానకి స్పందించి కావలి ఎస్కేప్ ఛానల్ ద్వారా డైవర్షన్ పెట్టి బోగోలు, కావలి మండలాల పరిధిలోని పంటలకు సాగునీరందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉపశమనం లభించింది. మిగిలిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారికి చివరి తడి పెద్ద సమస్యగా మారింది.
రెండు, మూడు రోజుల్లో నీరందకపోతే వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంది. కావలికి చెందిన సుబ్రమణ్యం, రమణమ్మ, శ్రీనివాసులు ఎదుర్కొంటున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. వీరు ఇంట్లో ఉన్న బంగారాన్ని, పాసుపుస్తకాలను తాకట్టుపెట్టి వరి పంట సాగుచేస్తున్నారు. వీరు సాగుచేస్తున్న వరి పంట చేతికి రావాలంటే ఒక్కసారి నీరు పారాలి. అయితే ప్రస్తుతం నీరు వచ్చే పరిస్థితి లేదు. పంటలను గట్టెక్కించమని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఇటువంటి వారి బాధలను గమనించిన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి తన కడుపు మాడ్చుకునైనా ప్రభుత్వం కళ్లు తెలిపించాలని నిర్ణయించుకున్నారు.
శాశ్వత పరిష్కారం కోసం...
కావలి పరిధిలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. సంగం బ్యారేజీ వద్ద చేపడుతున్న ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలి. అదేవిధంగా కావలి కాలువ ఆయకట్టుకు అనుగుణంగా ఆధునికీకరణ పనులు చేపట్టాలి. 550 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 1,200 క్యూసెక్కులకు పెంచాలి. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ ద్వారా నేరుగా చెరువులకు నీటి సరఫరా చేయాలి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలి. డీఆర్, డీఎం చనల్ ఆధునికీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు పూర్తయ్యేవరకు తన ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే ప్రతాప్‌ర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
ముందుచూపు లేకపోవడం వల్లే..
దీక్ష నుద్దేశించి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల, కండలేరులో నీరు పుష్కలంగా ఉంటే కావలితో పాటు ఉదయగిరికి నీటి సమస్య తలెత్తేది కాదన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే రూ.87వేల కోట్లు బకాయిలు ఉంటే రూ.3,900 కోట్లే ఇచ్చారన్నారు. అదేవిధంగా మహిళా రుణాలు మాఫీ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ హామీ ఇవ్వమని ఎంతో మంది జగన్‌మోహన్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే ఆయన ఎంతో ముందుచూపుతో ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వీలుకాదని చెప్పటం వల్లే ఆ హామీ ఇవ్వలేదని వివరించారు.
‘దీక్షా’దక్షుడు
Published Fri, Feb 20 2015 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM