ఇస్కపాళెం వెళ్లకుండా ఎమ్మెల్యే రామిరెడ్డి నిర్బంధం (ఫైల్)
కుట్ర రాజకీయాలకు అధికార పార్టీ తెరతీసింది. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దర్పంతో పల్లెల్లో విషసంస్కృతికి బీజం వేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని పోలీసు బలప్రయోగంతో అణిచివేసే కార్యక్రమాలకు పూనుకుంది. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తోంది. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోనూ, ఇటీవల కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో కూడా ఇదే తరహా తతంగం నడిపారు. దీనికి స్పందించి కనీసం మాట్లాడాల్సిన ఉన్నతాధికారులు కూడా మంత్రుల ఒత్తిడితో ముఖం చాటేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సర్పంచ్‌ల పదవీ కాలం చివరిరోజు కావడంతో పూర్తయిన పనులు అన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేతో ప్రారంభింపజేసేందుకు అంతా సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించడంతోపాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.అయితే ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆదివారం సాయంత్రం అధికారపార్టీ నేతలు వ్యూహం రచించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారుల అనుమతిలేదని, ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులకు లేఖ ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇదేమని అడిగేందుకు యత్నించినా ఫోనుకు సైతం అందుబాటులోకి లేకుండా పోయాడు.
పోలీస్ బలగాలతో అడ్డగింత
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వెళ్లే క్రమంలో డీఎస్పీ రామాంజనేయులురెడ్డి భారీగా పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. ప్రారంభోత్సవాలు చేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదని చెప్పి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే తాను పర్యటించటానికి కూడా ఆంక్షలు విధించడం సరికాదంటూ ఎమ్మెల్యే గట్టిగా చెప్పి గ్రామంలో పర్యటించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గ్రామం కావడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అడ్డుకునే యత్నం చేశారు.
వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, ఇతర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రారంభోత్సవాలకు ప్రజాప్రతినిధిని పోట్రోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిఉంది. అయితే అంతా చేసి అనుమతి లేదని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు స్థానిక సర్పంచ్‌లే చేయాలనే నిబంధన ఉంది. అలాగే తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిధులు రూ.14 లక్షలతో నిర్మించిన 11 కేవీ సబ్‌స్టేషన్‌ను, రూ.5 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించకుండా ముందే అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే రాజకీయ కుట్ర
గడిచిన నాలుగేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా అధికార పార్టీ ఆత్మకూరులో గందరగోళంగా ఉండటంతో మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, కన్నబాబు ఇలా అందరూ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి పేరు రాకుండా అడ్డుకునే కుట్రకు తెరతీశారు. మంత్రి నారాయణ నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లు రావడం, కార్యక్రమం సిద్ధం చేసిన అధికారులతోనే ఫిర్యాదు ఇప్పించి హక్కుల్ని కాలరాశారు.
సర్పంచ్‌ల పదవీ కాలం మంగళవారంతో ముగిసిన క్రమంలో తమ హయాంలో చేసిన పనులు కూడా తాము చేశామని చెప్పుకోవటానికి వీలు లేకుండా ఇన్‌చార్జ్ మంత్రులు, మంత్రి నారాయణ ప్రారంభించాలనే నెపంతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య సొంత గ్రామం కావడంతోనే ఈ తతంగం అంతా నడిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో పర్యటించకుండా గత నెల రోజులుగా పోలీసుల బలప్రయోగంతో వేధిస్తున్నారు. అధికార పార్టీ నేతలు బీద సోదరుల స్వగ్రామం కావడంతో అక్కడ పర్యటించకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటానికి సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment