త్వరలో ఐఏబీ
సాక్షి, నెల్లూరు: సోమశిల ప్రాజెక్టు పరిధిలో తొలిపంటకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 15 నాటికి రెండో పంటకు సంబంధించిన వరిపంట కోతలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లోనే జిల్లా సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సమావేశం తీర్మానం మేరకు అక్టోబర్ 15 లోపు సోమశిల నుంచి తొలిపంటకు నీటిని విడుదల చేయనున్నట్టు సమాచారం. జిల్లాలో సరైన వర్షాలు కురవక పోయినా ఎగువరాష్ట్రం కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నిండడంతో సోమశిలకు కృష్ణానీళ్లు వదిలిన విషయం తెలిసిందే. గురువారానికి సోమశిల నీటిమట్టం 16 టీఎంసీలకు చేరింది. ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిలకు మరింత వరదనీరు వచ్చిచేరే అవకావముంది. దీంతో జిల్లాలో వరిసాగుపై రైతులు ఆశలు పెంచుకున్నారు. సెప్టెంబర్ చివరికంతా నారుమళ్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారులు సై తం ముందు జాగ్రత్తగా వరి విత్తనాలను సిద్ధం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 15 నాటికి రెండో పంట కోతలు ముగుస్తాయి. దీంతో సోమశిల పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సెప్టెంబర్‌లోనే జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో తొలిపంటకు ఎప్పడు నీళ్లు విడుదల చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 15 నాటికే సోమశిల నుంచి నీళ్లు విడుదల చేసే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. రెండోపంట కోతలు ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15వ తేదీలోపు పెన్నాడెల్టా ఆయకట్టు పరిధిలోని కాలువలలో పూడిక(సిల్ట్) తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే కాలువలు సిల్టుతో నిండిపోయి ఆయకట్టుకు సరిగ్గా నీళ్లు వెళ్లని పరిస్థితి నెలకొంది.
ప్రతిపంటకూ సిల్ట్ తొలగించాల్సి ఉన్నా సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా రెండో పంటకు ముందు కాలువ పూడికతీత పనుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా పనులు చేపట్టలేక పోయారు. దీంతో కాలువలు మరింత అధ్వానంగా మారాయి. పర్యవసానంగా ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సుమారు రూ.4 కోట్లతో కాలువల పూడికతీతకు సంబంధించి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐఏబీ అయిన వెంటనే యుద్ధప్రాతిపదికన కాలువలలో పూడిక తొలగించి, ఆ తర్వాత నీటిని విడుదల చేయనున్నారు.