నెల్లూరు(అగ్రికల్చర్): రైతుప్రభుత్వం మా ది అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాల కులు ఆచరణలో మాత్రం వారికి చుక్కలుచూపుతున్నారు. అందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకమే నిదర్శనం. జిల్లాలో ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. ఖరీఫ్, రబీ పంటకాలాలు ముగిశాయి. ఓ నెలలో ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో జిల్లాకు కేటాయించిన యాంత్రీకరణ బడ్జెట్ ద్వారా ఎంతమందికి ప్రయోజనం చేకూర్చుతారో అంతుచిక్కడం లేదు.
జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాల తీరుపై ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి న్యాయం చేస్తారా...లేక సమీక్షలతో సరిపెడతారోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.10 కోట్లు వెచ్చించి అన్నిరకాల యంత్ర పరికరాలు, వ్యవసాయ సామగ్రి 50 శాతం రాయితీతో అందజేస్తామని ప్రకటించారు. ధరలు, రాయితీలు ఖరారు చేయడానికి కాలమంతా వెచ్చించారు. రూ.10 కోట్ల బడ్జెట్‌ను రూ.5.35 కోట్లకు కుదిం చారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) పథకంలో 1,640 యూనిట్లకు రూ.2.33 కోట్లు, ఎన్‌ఎస్‌పీలో 964 యూనిట్లకు రూ.2.17కోట్లు, ఎస్‌ఎంఏఎం స్కీమ్‌లో 964 యూనిట్లకు రూ.85 లక్షలు కేటాయించారు. అదైనా సకాలంలో ఖర్చు చేసి అమలు చేశారా.. అంటే అదీ లేదు.
మీసేవలతో మరిన్ని కష్టాలు
ఈ తరుణంలో యాంత్రీకరణ పరికరాలు అవసరమైన రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వివిధ సాంకేతిక కారణాలతో మీసేవా కేంద్రాలు సక్రమంగా పనిచేయక పోవడంతో పాటు అధికారులు, రైతులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులకే సరైన అవగాహన లేక దరఖాస్తుల అప్‌లోడ్ కష్టంగా మారింది. మూడు నెలలు కావస్తున్నా 224 దరఖాస్తులు మాత్రమే అప్‌లోడ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో రైతులు నేరుగా వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకునే వీలుండేది. ఈ ఏడాది నూతనంగా ఏఓ సిఫారసు లెటరుతో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆచరణలో రైతులకు ప్రయోజనం జరగదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో బడ్జెట్ ఖర్చుకాకుండా యంత్ర పరికరాలు రైతులకు అందకుండా చేయడంలో ప్రభుత్వం సఫలమవుతోంది. జిల్లాకు కేటాయించిన రూ.5.35 కోట్లు ఖర్చు చేసి సుమారు 3 వేలమందికి పరికరాలు ఎప్పుడిస్తారో అధికారులకే తెలియడం లేదు.
ఉద్యానశాఖదీ అదే పరిస్థితి
ఉద్యానశాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ పరిస్థితి అలాగే ఉంది. నిబంధనలు మార్పు చేయడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. స్ప్రేయర్లు కావాలన్నా మొదట పూర్తి ధర చెల్లిస్తే తర్వాత రాయితీ రైతు ఖాతాలో జమ చేస్తామని మెలికపెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ఉద్యానశాఖకు ఇపుడు కొత్త నిబంధన జారీ చేయడంతో అధికారుల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద యాంత్రీకరణ పథకం అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మైక్రో ఇరిగేషన్ పథకంలోనూ ఇదే నిబంధనలు ఉండటంతో ముందుకు సాగడం లేదు.
కేటాయించే పరికరాలు:ఎన్‌ఎస్‌పీ, ఎస్‌ఎంఏఎం స్కీముల ద్వారా ఎద్దులతో లాగే పరికరాలు, ట్రాక్టర్‌తో లాగే పరికరాలు, ఇంప్రూవ్డ్ పరికరాలు, రోటోవీటర్స్, హార్వెస్టర్లు, వివిధ రకాల స్ప్రేయర్లు, డీజిల్ ఇంజన్లు, పవర్ ట్రిల్లర్స్ అందజేయాల్సి ఉంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పత్తి పంటకు కస్టమ్ హైరింగ్ సెంటర్, వేరుశనగ సీహెచ్‌సీ, పోస్టు హార్వెస్టింగ్ పరికరాలు, హైరింగ్ స్టేషన్స్(యంత్రపరికరాల అద్దె కేంద్రాలు), ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్, సోలార్ ఫెన్సింగ్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, సీడ్ అండ్ ఫర్టిలైజర్స్ డ్రిల్లర్లు, మొక్క జొన్న షెల్లర్స్, మల్టీక్రాప్ త్రెషర్స్, రోటోవీటర్స్, పవర్ వీడర్స్, ఇంప్రూవ్డ్ ఫా ర్మ్ మెషిషనరీస్, తైవాన్ స్ప్రేయర్లు అందజేయాలి.
సాంకేతిక కారణాలతో ఆలస్యం
ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు ప్రకారం రైతులు తమ దరఖాస్తులను మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. నిబంధనలు, సాంకేతిక ఇబ్బందుల వల్ల యాంత్రీకరణ ఆలస్యమవుతోంది. జిల్లాకు మూడు వేల యంత్రాలను టార్గెట్‌గా ప్రభుత్వం నిర్ణయిస్తూ రూ.6కోట్లు కేటాయించింది. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
- ఐ.మురళి, ఇన్‌చార్జి జేడీఏ
యాంత్రీకరణ మిథ్య!
Published Mon, Feb 23 2015 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement