నెల్లూరు రవాణా: అర్థరాత్రి కరెంటు సరఫరా.. అన్నదాతల పాలిట యమపాశంగా మారింది. గడచిన నాలుగు నెలల కాలంలో 30 మందికిపైగా రైతులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. అధికారంలోకి వస్తే నిరంతరాయంగా తొమ్మిదిగంటల పాటు సరఫరా అందిస్తామన్న చంద్రబాబు హామీలు అమలు కావటం లేదు. అరకొర విద్యుత్ సరఫరాతో పంటలను దక్కించుకునేందుకు అన్నదాతలు రాత్రిళ్లు పొలాలకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి రాలిపోతున్నారు.
ప్రభుత్వం పగలు 4 గంటలు.. రాత్రి 3 గంటల పాటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రోజంతటికీ కలిపి కేవలం 5 గంటలు మాత్రం సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. అది కూడా అర్థరాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతులు చూడకుండా వెళ్లి ప్రమాదాలబారిన పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 1.43 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 80 శాతం మంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారందరికీ బోరుబావులే ఆధారం. జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, పండ్ల తోటలు, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరి చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో నీరందకపోతే పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. కండలేరు, సోమశిల జలాశయాల్లో నీటిమట్టం పడిపోయింది. దీంతో కాలువలకు కూడా నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పూర్తిగా బోర్లమీదే అధారపడ్డ రైతులు వేళాపాలా లేకుండా కరెంటు సరఫరా చేస్తుండడంతో రాత్రీ, పగలూ పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు తీగలు తగిలో.. షాక్‌కు గురయ్యే అనేకమంది రైతులు మృత్యువాతకు గురవుతున్నారు.
నాలుగు నెలల్లో 30 మంది మృతి
చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన పెంచలయ్య శనివారం పంటకు చుట్టిన కరెంటు తీగలు తగిలి మృత్యువాతపడ్డారు. ఈనెల 10న ఇందుకూరుపేట మండలం జంగవారిదరవు గ్రామానికి చెందిన జొన్నవాడ శేఖర్ (45) పొలంలో మోటార్ వేసేందుకు వెళ్లి షాక్‌కొట్టి మరణించారు. మర్రిపాడు మండలం చుంచులూరుకు చెందిన చిల్లపోగు పీచయ్య (58), కె.శీనయ్య (45) ఈనెల 6న పంటకు నీరుపెట్టేందకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. విడవలూరు మండలం ఊటుకూరులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్తీక్ రొయ్యలకు మేతపెడుతూ విద్యుత్ వైర్లు తగిలి మరణించారు.
చిల్లకూరు మండలం బల్లవోలుకు చెందిన వి.మనోహర్ (45) గత నెల 17న విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లి కరెంటు కాటుకు బలయ్యారు. పొదలకూరు మండలం డేగమూడికి చెందిన కౌలు రైతు జి.చంద్రశేఖరరెడ్డి (36) పంటకు చుట్టిన తీగలు తగిలి అకాలమరణం చెందారు. జనవరి 11న ఓజిలి మండలం కారూరుకు చెందిన పి.శ్రీనివాసులు(40) పొలానికి వెళ్లి విద్యుత్ షాక్ గురై మరణించారు. డక్కిలి మండలం మోపూరుకు చెందిన బి.హరిరెడ్డి వరి కోత కోస్తుండగా మిషన్‌కు విద్యుత్ వైరు తగిలి మృతిచెందారు.
డిసెంబర్ 13న నెల్లూరు రూరల్ మండలం ఉప్పటూరు గ్రామానికి చెందిన బి.వెంకటేశ్వర్లు (38) స్తంభం నుంచి మోటారుకు తీగలాగుతూ షాక్‌కు గురై మరణించారు. ఇలా జిల్లావ్యాప్తంగా పొలం పనులకు వెళ్లిన అనేకమంది రైతులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. యజమానులు మరణించడంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మారారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి పగటి పూటే కరెంటు సరఫరా చేయడంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలను బాగుచేసి రైతుల ప్రాణాలను కాపాడాలాని రైతు కుటుంబాలు కోరుతున్నాయి.
యమపాశం
Published Sun, Feb 22 2015 3:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement