కనగానపల్లి: పీఏబీఆర్ నీటి కోసం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నీటి పారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే వివాదాలకు కారణమవుతోంది. వివరాల్లోకెళ్తే.. పీఏబీఆర్ నుంచి ధర్మవరం కాలువ ద్వారా రాప్తాడు, కనగానపల్లి మండలాల మీదుగా నీరు వెళ్తున్నాయి. నెల రోజుల నుంచి అధికారులు రాప్తాడు మండలాలలోని చెరువులకు నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంతంలో ఉన్న కనగానపల్లి మండలంలోని ముక్తాపురం, పర్వతదేవరపల్లి. మామిళ్లపల్లి చెరువులకు, కుంటలకు నీరు చేరడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు రెండు రోజుల క్రితం కాలువ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని దిగువకు తిప్పుకొన్నారు. అయితే శనివారం సాయంత్రం రాప్తాడు మండలంలోని మరూరు గ్రామం రైతులు దిగువకు వస్తున్న కాలువ నీటిని అడ్డుగించి వారి చెరువుకు మళ్లించుకొన్నారు.
విషయం తెలుసుకొన్న కనగానపల్లి మండలంలోని గ్రామాల రైతులు శనివారం అర్ధరాత్రి నీటి మళ్లీంచుకోవడానికి మరూరు గ్రామ సమీపంలోని కాలువ గట్టు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇరు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రైతులను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో ముక్తాపురం, పర్వతదేవరపల్లి. మామిళ్లపల్లి గ్రామాల రైతులు తమకు న్యాయం చేయాలని అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. వందలాది వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడడంతో పోలీసులు రైతులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపచేశారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ...
ఈ యేడాది అక్టోబర్ 20 నుంచి పీఏబీఆర్ నుంచి కాలువకు నీటిని వదిలారు. వీటి ద్వారా రాప్తాడు, ధర్మవరం, కనగానపల్లి మండలాలలోని 42 చెరువులకు 25 శాతం వరకు నీటిని నింపుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. అధికారుల పర్యవేక్షణా లోపంతో నీటిని వదలి రెండు నెలలు అవుతున్నా, ఇప్పటికీ రాప్తాడు మండలంలోని చెరువులకే నీరు వెళ్తోందని దిగువ ప్రాంత రైతులు వాపోతున్నారు.
పైభాగం నుంచి ఒక్కొక్క చెరువుకు ఒక్కసారి నీటిని నింపుతూ వస్తామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు, కొన్ని గ్రామాల రైతులతో డబ్బుతో తీసుకొని ఆ ప్రాంతానికే నీటిని వదులుతున్నారని కనగానపల్లి మండలం రైతులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పంచించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జల జగడం
Published Mon, Dec 22 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement