ఈ వాతావరణం ‘అగ్గి’కి అనుకూలం!
ఈ వాతావరణం ‘అగ్గి’కి అనుకూలం!
పనుగొండ , : ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రబీ వరి పైరును అగ్గి తెగులు తీవ్రంగా నష్టపరుస్తోంది.
దీనిని సకాలంలో గుర్తించి నివారించకపోతే రైతులు ఆర్థికంగా పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అగ్గి తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ ప్లాంట్ పాథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కృష్ణంరాజు, శాస్త్రవేత్త డాక్టర్ వి.భువనేశ్వరి అందిస్తున్న సూచనలు...
ఇలా వృద్ధి చెందుతుంది
పైరిక్యులేరియా గ్రిసియా అనే శిలీంద్రం కారణంగా వరి పైరుకు అగ్గి తెగులు సోకుతుంది. వరి పంట లేని సమయంలో ఈ శిలీంద్రం పొలం గట్లపై పెరిగే తుంగ, గరిక, ఊద, గాటేరు వంటి గడ్డి జాతి మొక్కల్ని ఆశ్రయించి జీవిస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ శిలీంద్రం త్వరగా పెరిగి బీజాలను ఉత్పత్తి చేస్తుంది. శిలీంద్ర బీజాలు గాలి ద్వారా వ్యాపిస్తూ వరి పంటపై దాడి చేస్తాయి. వీటివల్ల ముందుగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ నూలు కండె ఆకారానికి మారతాయి. మచ్చల అంచులు ముదురు గోధుమ రంగులో, వాటి మధ్య భాగం బూడిద రంగులో కన్పిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులపై మచ్చలు పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీంతో పైరు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండుతుంది. మొక్కలు తగలబడినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని అగ్గి తెగులు అని పిలుస్తారు.
ఎప్పుడు దాడి చేస్తుంది?
వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా, గాలిలో తేమ 90% కంటే ఎక్కువగా ఉండి మంచు కురుస్తుంటే అగ్గి తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు దీని తాకిడి అధికంగా ఉంటుంది. సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువు వేస్తే తెగులు తాకిడి మరింత పెరుగుతుంది.
ఏ దశలో ఎలా నష్టపరుస్తుంది?
పిలకలు వేసే సమయంలో అగ్గి తెగులు సోకితే వరి పైరు కురచగా మారి తక్కువ పిలకలు వేస్తుంది. ఈ తెగులు కణుపులకు సోకినప్పుడు అవి గోధుమ/నలుపు రంగుకు మారతాయి. కణుపు భాగం విరిగిపోతుంది. కంకుల మెడ భాగానికి తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. ఆ భాగం ముదురు గోధుమ/నలుపు రంగుకు మారి కణజాలం కుళ్లుతుంది. వరి వెన్నులు మెడ వద్ద విరిగి కిందికి వాలిపోతాయి. ఫలితంగా వెన్ను భాగానికి పోషకాల సరఫరా ఆగిపోయి, గింజలు తాలుగా మారతాయి. దీనినే కొన్ని ప్రాంతాల్లో మెడవిరుపు తెగులు అంటారు.
ఏం చేయాలి?
అగ్గి తెగులు నివారణకు పొలం గట్ల మీద, పొలం లోపల ఉన్న గడ్డి జాతి కలుపు మొక్కల్ని తొలగించాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ 75% లేదా 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథయోలేన్ 40% లేదా 2.5 మిల్లీలీటర్ల కాసుగా మైసిన్ చొప్పున కలిపి పైరు బాగా తడిసేలా 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.