అనంతపురం రూరల్ : వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు. సెప్టెంబర్ 15 వరకు అని చెప్పి.. ఇప్పుడు ఆగస్టు 31కే గడువు ముగిసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. బీమా గడువు పెంచాలని కోరుతూ అనంతపురం రూరల్ మండలం చియ్యేడు, పూలకుంట, కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకలపల్లి,ందుకూరు, ఏడావులపర్తి, దుర్గం ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు మంగళవారం ఉద్యమించారు.
చియ్యేడులోని సిండికేట్ బ్యాంకును ముట్టడించి.. గేటు మూసివేసి.. అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట పండకపోయినా బీమా ఉంటుందన్న ధీమాతో వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ బీమా కూడా లేకుండా చేస్తే తామెలా బతకాలి.. రైతులంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. 15 రోజుల కిందటే ప్రీమియం చెల్లించి, పాసు పుస్తకాలను బ్యాంకు అధికారులకు అందజేసినా నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15 వరకు గడువు ఉందని తామనుకున్నామని, అయితే ఆగస్టు నెలాఖరుకు గడువు ముగిస్తున్నట్లు 30న ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని ఇన్‌చార్‌జ మేనేజర్ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
మీ నిర్లక్ష్యానికి తమను బాధ్యుల్ని చేయడం సరికాదని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బీమా గడువు పొడిగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. రైతుల ఆందోళనకు మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పసులూరు ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు టీ రామాంజినేయులు, మద్దతు తెలిపారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
రైతులంటే చులకనా?
Published Wed, Sep 3 2014 3:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement