అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో వాతావరణ పరిస్థితులు శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల వర్షాలు, పంట కాలాలు గతి తప్పుతున్నాయి. జిల్లాలో వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ నుంచి వాతావరణశాఖ వారానికి రెండు బులెటిన్లు విడుదల చేస్తున్నా... ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. విస్తారంగా వర్షాలు పడాల్సిన ప్రస్తుత తరుణంలో అందుకు భిన్నంగా విపరీతమైన ఎండలు కాస్తున్నాయి.
36-37 డిగ్రీల గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పది రోజుల కిందట వరకు 32-33 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు.. ఉన్నఫళంగా నాలుగైదు డిగ్రీలు పెరిగాయి. ఇందుకు శాస్త్రవేత్తలు కూడా సరైన కారణం చెప్పడం లేదు. ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ‘అనంత’లో మాత్రం అకాల వర్షాలు కురుస్తూ ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్నాయి. ఆ తర్వాత మొహం చాటేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఏమాత్రమూ కన్పించడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలవుతున్నా ఒక్క మంచి వర్షం కూడా కురవలేదంటే వర్షాభావ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జూన్‌లో 63.9 మి.మీకి గాను 47 మి.మీ, జూలైలో 67.4 మి.మీకి గాను 34 మి.మీ, ఆగస్టులో 88 మి.మీగాను కేవలం 15 మి.మీ వర్షపాతం నమోదైంది.
దట్టమైన మేఘాలు ఆవరిస్తున్నా.. గంటకు 20 -22 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో అవి తేలిపోతున్నాయి. అక్కడక్కడ చెదురుముదురుగా కురిసిన వర్షాలకు రైతులు ఖరీఫ్ పంటలు వేశారు. భవిష్యత్తులో వర్షం వస్తుందనే ఆశతో అరకొర పదనులోనే జిల్లా వ్యాప్తంగా 7.03 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 5.50 లక్షల హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం ఈ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది .ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పంట ఎండుముఖం పట్టాయి. భారీ వర్షాలు పడాల్సిన తరుణంలో ఆ ఊసే లేకపోవడం, దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనంతపై వాతావ‘రణ’భేరి
Published Mon, Sep 2 2013 4:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement