చీకటిమయమైన జుబ్లీ, బంజారాహిల్స్
పలు చోట్ల వర్షాలు.. రెండు రాష్ట్రాల్లోనూ కుండపోత
హైదరాబాద్: నగర వాతావరణంలో బుధవారం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకోవడంతో సంపన్న ప్రాంతాలు బంజారాహిల్స్, జుబ్లీహిల్స్‌లో చీకటి ఆవరించింది. కారుమేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో ఉదయం పది కావొస్తున్నా సూర్యుడు కనిపించకపోవడంతో చాలా ప్రాంతాల్లో చీకటి అలుముకుంది. తగినంత వెలుగులేకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లైట్లు వేసుకొని మరీ వాహనాలు నడిపిస్తున్నారు. దీంతో వాహనాల వెలుగులతో రోడ్లు రాత్రిని తలపిస్తున్నాయి. దీనికితోడు ఈదురుగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. నిన్నటివరకు ఎండ బాగానే ఉండగా.. అనూహ్యంగా వాతావరణం మారిపోవడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ వైపుగా కదిలిన ఉపరితల ద్రోణి వల్లే హైదరాబాద్‌లో ఈ అనూహ్య పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. నగర శివారులో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కొత్తపేట్, చంపాపెట్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోవు మూడు గంటల్లో హైదరాబాద్, యాదాద్రి, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మెదక్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చునని, భారీ ఈదురుగాలులు వీయవచ్చునని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. కాగా, వాతావరణం ప్రతికూలంగా మారినప్పటికీ బుధవారం ఉదయం కూడా ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుల నిమజ్జనం కొనసాగింది.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఉదయం నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి. నార్కెట్ పల్లి, చిట్యాల, చండూరు, మునుగోడు మండల్లాలో వాన కురుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండల్లాలోనూ భారీగా వర్షం పడుతోంది.
ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించిందని, ఈ ద్రోణి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు తగ్గుముఖంతో వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి నెలకొంది. సాధారణం కన్నా అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, పగటి ఉష్ణోగ్రతలు 2-4డిగ్రీలు పెరిగే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.