సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసి ఏడాది కావస్తోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటికి శంకుస్థాపనలు చేస్తూ.. అలవికాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూపిలిపాళెంలో సునామీ పరిశోధన కేంద్రం శంకుస్థాపనకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై ప్రత్యేక కథనం... చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అందులో ఒక్కటీ నెరవేరలేదు.. రైతు రుణమాఫీ కోసం ప్రకటించిన నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం నిధులు రైతులు తీసుకున్న అప్పుల వడ్డీలకే చాల్లేదని బ్యాంకర్లు తేల్చారు. బాబు పుణ్యాన రైతులు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్రం భరించే 3 శాతం ఇన్సెంటివ్‌ని సైతం కోల్పోయారు. వేలాదిమంది రైతులు డిఫాల్టర్లుగా మారారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఆ మాటెత్తలేదు. దీంతో రుణాలు మాఫీ కాక.. కొత్త రుణాలు దొరక్క అల్లాడిపోతున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే..
జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కరువొచ్చింది. సాగునీరు అందక సుమారు లక్ష ఎకరాల్లో వరి, నిమ్మతోటలు ఎండిపోయాయి. రూ.కోట్ల పెట్టుబడి నేలపాలైంది. అకాల వర్షం కారణంగా జిల్లాలో 16 మండలాల పరిధిలో 2,326 హెక్టార్లలో వరి, వేరుశనగ, పెసర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. నష్టం అంచనా రూ.5 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు.
అయితే వాస్తవంగా జిల్లావ్యాప్తంగా 10వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనా రూ.25 కోట్ల మేర ఉంటుంది. ఉద్యానపంటలైన మామిడి, నిమ్మ, బొప్పాయి పంటలు మరో 100 హెక్టార్లలో దెబ్బతింది. వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. పంటలకు గిట్టుబాటు ధర అందటం లేదు. క్వింటాలు ధర రూ.1,460 మద్దతు ధర ఉంటే.. దళారులు కుమ్మక్కై రూ.1,100, రూ.900 చొప్పున కొనుగోలు చేసుకుంటూ రైతులను నిలువునా ముంచుతున్నారు. వర్షాభావం కారణంగా 80శాతం భూగర్భజలాలు పడిపోయాయి. ఫలితంగా 360 పంచాయితీల్లో మంచినీటి సమస్య నెలకొంది. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు అనేక మందికి రాకుండా చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కిందనే ప్రచారం ఉంది. ఈ- పాస్ విధానం అంటూ రేషన్ లబ్ధిదారులను రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. వ్యవసాయానికి 9గంటలు కరెంటన్నారు. అదీ లేదు.
హామీలు నెరవేరుస్తారా?
మత్స్యకార హార్బర్, పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువ అభివృద్ధి, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని చంద్రబాబు ప్రకటించారు. టెక్స్‌టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు తెస్తానని ప్రకటించారు. సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కాలపరిమితి నిర్ణయించి ఐదేళ్లలో పూర్తిచేసి మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. స్మార్టుసిటీల్లో నెల్లూరు ఒకటిగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రారంభించిన ఐదు పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు మాత్రం కాలేదు. ఇప్పటికైనా కళ్లు తెరచి జనం సమస్యలు పరిష్కరించాలి.
ఏడాదవుతోంది బాబూ!
Published Sat, Apr 25 2015 2:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement