సంక్షోభం తప్పదా?
ఓ వైపు కరుణించని వరుణుడు.. మరో వైపు సర్కారు తీరుతో అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. సాగునీటి సలహా మండలి సమావేశంలో(ఐఏబీ) పంటల సాగుకు నీరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ మాటలను నమ్మిన రైతులు అప్పు చేసి పంటలు సాగు చేశారు. తీరా సాగునీటి విషయం వద్దకు వచ్చేసరికి ప్రస్తుత పరిస్థితుల్లో నీరివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రైతులు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోయినా.. ఉన్న రిజర్వాయర్లను నమ్ముకుని రైతులు పంటలు సాగు చేశారు. సోమశిల కింద నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ఇరిగేషన్ అధికారులు అక్టోబర్‌లో జరిగిన ఐఏబీ సమావేశంలో హామీ ఇచ్చారు కూడా. అదేవిధంగా తెలుగుగంగ నుంచి నీరు విడుదల చేస్తారని నమ్మి విస్తారంగా పంటలు సాగుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోమశిల కింద 2.50 లక్షల ఎకరాలక్కూడా నీరివ్వలేమని చేతులెత్తాశారు.
సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర, దక్షిణ కాలువలతో పాటు కావలి కాలువ, సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్, కనుపూరు కాలువ మీదుగా వచ్చే నీటిని నమ్ముకుని రైతులు పంటలు సాగుచేశారు. ఈ కాలువల నుంచి మెట్టప్రాంతంలోని భూములకు సాగునీటిని అందించేందుకు సుమారు వంద చెరువులకు నీరివ్వాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించకపోవటంతో అధికారులు చెరువులకు నీరు విడదల చేయలేదు. దీంతో మెట్టప్రాంతంలోని వేలాది ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. కావలి కాలువ కింద 30వేల ఎకరాలు, కనుపూరు కాలువ, సోమశిల ఉత్తర కాలువల కింద 35 వేల ఎకరాలకు నీరివ్వలేమని తేల్చి చెప్పారు.
డెల్టా కింద కూడా సుమారు 50 వేల ఎకరాలకు నీరు ఇవ్వడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏఎస్‌పేట పరిధిలోని 12.50 వేల ఎకరాలకు సోమశిల ఉత్తరకాలువ నుంచి నీటి సరఫరా చేయాల్సి ఉంది. కాలువ పనులు పూర్తి కాకపోవడంతో సాగవుతున్న పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ కాలువ పనుల కోసం రూ.200 కోట్లు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు కాలువ పనులను పక్కనపెట్టారు. దీంతో మండలంలోని వేలాది ఎకరాల పరస్థితి దయనీయంగా మారింది. పొదలకూరు మండల పరిధిలో 20వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి.
తెలుగుగంగ నీటి కోసం
ఎదురుచూపులు
గంగ నీటి కోసం గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి పరిధిలోని రైతులు ఎదురుచూస్తున్నారు. తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేస్తారని నమ్మి రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేశారు. 2ఏ కెనాల్, 5ఏ కెనాల్, 7ఏ కెనాల్ కింద సుమారు 30వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. తెలుగుగంగ నుంచి ఈ కెనాల్స్‌కు సుమారు మూడు టీఎంసీ నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. ఇంత వరకు పట్టించుకోలేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు లేక.. కాలువల నుంచి నీరు విడుదల చేయకపోవటంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి సాగు సంక్షోభం ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.