శాంటియాగో: భూగర్భంలో జల వనరులు తరగిపోయినప్పుడు వర్షాల కోసం ఆకాశంవైపు దిక్కులు చూడడం తప్పా చేసేదేమీ లేదనుకుంటే పొరపాటు. అలా దిక్కులు చూడడం నుంచి కూడా జల వనరుల సమీకరణకు కొత్త దిక్కు కనిపిస్తుందని చిలీ రాజధాని శాంటియాగో నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనా బ్లాంకా అనే ఓ చిన్న గ్రామం ప్రజలు నిరూపించారు.
ఈ గ్రామం ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వర్షాలు లేవు. పర్యవసానంగా భూగర్భంలో జలవనరులు అడుగంటి పోయాయి. అంత లోపలి వరకు బోరింగ్‌లు వేసే స్థోమత కూడా ఈ గ్రామం ప్రజలకు లేదు. మరి ఏం చేయాలి? ఈ గ్రామంలో పొగ మంచు ఎప్పుడూ కనిపిస్తుంటోంది. బలమైన గాలులు కూడా వీస్తుంటాయి. ఆ కారణంగా సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉండదు.
ఆ పొగమంచులోని నీటిని ఒడిసిపట్టుకుంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన గ్రామ పెద్దలకు కలిగింది. ఎలా ఒడిసి పట్టుకోవడం ? గ్రామ పెద్దలు చదువుకున్న తమ పిల్లలను అడిగారు. పొగమంచు వచ్చే దిశగా తాళ్లతో అల్లిన జాలీలు కడితే పొగమంచులోని నీటిని తాళ్లు లాగేసుకుంటాయని, తాళ్ల తెర అడుగు భాగాన ఓ గొట్టాన్ని ఏర్పాటుచేసి నీటిని డ్రమ్ముల్లోకి నింపవచ్చని ఎవరో ఐడియా ఇచ్చారు.
అంతే! ఆరోజు నుంచి గ్రామం నీటి కష్టాలు తీరిపోయాయి. విద్యుత్ కూడా అవసరం లేకుండా స్వచ్ఛమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసి పట్టుకునే విద్యను వారు నేర్చుకున్నారు. వారు గ్రామం పొలిమేరలో 140 చదరపు మీటర్ల జాలి తెరలను ఏర్పాటు చేయడం ద్వారా రోజుకు 840 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సేకరిస్తున్నారు. దీంతో వారి తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలు తీరిపోతున్నాయి. వాస్తవానికి చిలీలో ఇలా నీటిని ఒడిసిపట్టుకునే విధానం 1950 దశకంలోనే అమల్లో ఉంది.
సరైన ప్రోత్సాహం లేక అది కాలగర్భంలో కలసి పోయింది. మళ్లీ ఈ విధానానికి ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తోంది. మొరొక్కోలో ఇప్పుడు ‘దార్ సి హమద్’ ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున మంచుపొగ నుంచి నీటిని సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జమీలా బర్గాచ్ 2016 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. నీటి వనరులు అతి తక్కువగా ఉండే సహారా ఎడారిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నీటి తెరలను ఏర్పాటు చేసి ఎడారిలో కూడా చెట్లను పెంచుతున్నారు.