సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా 500 వార్డులు ఏర్పాటుకానున్నాయి. త్వరలోనే ‘మున్సిపోల్స్’ నిర్వహించా లని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు వార్డుల విభజనపై దృష్టి సారించింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల లో కొత్త మున్సిపల్ చట్టాన్ని తేనుండటంతో ఆలోపు వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున.. ఈసారి పక్కాగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉంది. దీన్ని తాజాగా నిర్వహించే పునర్విభజనలో సవరించనున్నారు.
జనాభా ప్రాతిపదికన వార్డు లను వర్గీకరిస్తారు. ఈ లెక్కన వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2014లో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులున్నాయి. ప్రస్తుతం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉండగా.. వీటిలో వార్డుల సంఖ్య 2,400 కానుంది. వార్డు జనాభాను తక్కువగా నిర్దేశిస్తే ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యంలేదు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కొన్నింటిలో మేజర్ గ్రామపంచాయతీలకన్నా కూడా తక్కువ జనాభా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత జనాభా పదివేల లోపే ఉంది. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం జనాభా కూడా దాదాపుగా అంతే. ఈ నేపథ్యంలో ఇక్కడ కనిష్టంగా 11 వార్డులను ఏర్పాటు చేస్తే.. సగటున ఒక్కో వార్డు జనాభా వేయిలోపే రానుంది. కాగా.. ఈ నెలాఖర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో నూతన పురపాలక చట్టం ప్రవేశపెట్టిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేదశలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగు తాయని అధికారులు తెలిపారు.
పౌర సేవలన్నీ ఆన్‌లైన్‌లో
మున్సిపాలిటీలకు ఉన్న చెడ్డపేరును తొలగించే దిశగా కొత్తచట్టానికి సర్కారు పదునుపెడుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రణాళికను పారదర్శకంగా మలి చేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. నిర్దేశిత కాలవ్యవధిలో బిల్డింగ్ పర్మిషన్ జారీ చేయకపోతే.. ఆటోమేటిక్‌గా మంజూరు చేసినట్లుగానే భావించేలా చట్టంలో వెసులుబాటు కల్పిస్తోంది. అదేసమయంలో భవన నిర్మాణ అనుమతి ఫైలు క్లియర్ చేయకుండా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన ఉద్యోగిపై జరిమానా/ సస్పెన్షన్ వేటు వేసే కఠిన నిబంధనలను కూడా ఈ చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అలాగే పురపాలికల్లో పౌర సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ, మిగతావాటిని కూడా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుండగా, కొత్త చట్టంలో పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులైజేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నియామవళిని పకడ్బందీగా రూపొందిస్తోంది.
పదేళ్లు ఒకే రిజర్వేషన్?
స్థానిక సంస్థల రిజర్వేషన్లను పదేళ్లపాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధానాన్ని వర్తింపజేసింది. ఇదే పద్ధతిని పట్టణ సంస్థలకు వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలు చేసే విధానంపై అధ్యయ నం చేస్తోంది. మహారాష్ట్ర తరహాలో పురపాలక సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment