Wards division
-
కొత్త వార్డులొచ్చేశాయి !
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన ఓ కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ప్రకటనను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పురపాలికల వారీగా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వార్డుల విభజన కోసం ఈ నెల 3న 14 రోజుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వార్డులు/డివిజన్ల పునర్విభజన ముసాయిదాను ప్రకటించి, వారం రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. వీటిని పరిష్కరించడం ద్వారా మంగళవారం వార్డులు/డివిజన్ల పునర్విభజన తుది ప్రకటనను జారీ చేసింది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రెండుమూడు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముంది. కొత్త వార్డులు/డివిజన్ల భౌగోళిక స్వరూపం, సరిహద్దులను దృష్టిలో పెట్టుకుని వీటికి సం బంధించిన ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు వారం రోజులు పట్టనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జనాభా దామాషా ప్రకారం... మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వార్డు, చైర్పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కార్పొరేషన్లలో సైతం ఇలానే చేస్తారు. మున్సి పల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలి స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. అంతా సజావుగా జరిగితే జనవరి చివరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఏవైనా అడ్డంకులొస్తే ఫిబ్రవరి లో జరుగుతాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు. -
మున్సి‘పోల్స్’ కసరత్తు వేగిరం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల కసరత్తు వేగిరమైంది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన 14 రోజుల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల విభజన ప్రక్రియ చేపట్టడం ఇది రెండోసారి. గతంలో కేవలం 7 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించి హడావుడిగా ప్రక్రియను ప్రభుత్వం ముగించిందని, ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు కేవలం ఒకేరోజు మాత్రమే కేటాయించిందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం వార్డుల విభజనకు 14 రోజుల షెడ్యూల్‌ను తాజాగా పురపాలక శాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలు వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటనను మంగళవారం ప్రకటించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వీటిని పరిష్కరించి ఈ నెల 17న వార్డుల విభజనకు సంబంధించిన తుది ప్రకటనను ప్రభుత్వం జారీ చేయనుంది. వార్డుల క్రమసంఖ్య వరుసగా ఉత్తరం నుంచి ప్రారంభమై తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల వారీగా సాగేలా మున్సిపాలిటీల మ్యాపుల రూపకల్పనలోజాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించి ఉండరాదని తెలిపింది. రిజర్వేషన్లకు కొత్త రోస్టర్ వార్డుల విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు 5 రోజుల సమయం పట్టనుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. అన్ని మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీల వార్డు, చైర్పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సైతం ఇలానే ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలిన స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. వార్డు/డివిజన్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ స్థానిక జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. చైర్పర్సన్, మేయర్ స్థానాల రిజర్వేషన్లను మాత్రం పురపాలికల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా జరిగితే జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో ఖరారు చేసే రిజర్వేషన్లను మరో రెండు సాధారణ ఎన్నికల వరకు కొనసాగించనున్నారు. -
‘మున్సిపోల్స్’కు ముహూర్తం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే ఏడాది జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి దాదాపు 18–20 రోజుల వ్యవధిలోగా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసే అవకాశముంది. 73 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మళ్లీ వార్డుల విభజనకు ముసాయిదా ప్రకటన జారీచేసి వారం పాటు అభ్యంతరాలు స్వీకరించాలని, ఆ తర్వాత వారంలోగా ఈ అభ్యంతరాలు పరిష్కరించి వార్డుల విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేయాలని హైకోర్టు సూచించింది. అయితే వార్డుల విభజన ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేయాలని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పేర్కొంటున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. తదుపరి డిసెంబర్ తొలి వారంలో వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత 14 రోజుల గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన.. వార్డుల విభజన అనంతరం ఎన్నికలు జరగాల్సి ఉన్న 141 పురపాలికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను పురపాలికలు చేపట్టనున్నాయి. తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. అనంతరం వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోగా వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి. వార్డుల విభజన ప్రకటన ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించనుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తికావడానికి దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన రెండు, మూడు రోజులకే ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వసన్నద్ధతో ఉంది. ఫిబ్రవరి దాటితే మళ్లీ వాయిదే.. మున్సిపల్ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే మరో 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో మరెలాంటి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలోగానే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
హడావుడిగా ఎందుకు చేశారు?
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ వార్డుల విభజన ఏవిధంగా చేశారో, గతంలో చెప్పినట్లుగా ఎన్నికల ప్రక్రియకు అవసరమని చెప్పిన గడువును ఎందుకు తగ్గించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాత మున్సిపల్ చట్టానికి, కొత్త మున్సిపల్ చట్టానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించాలని కోరింది. ఈ వివరాల్ని శుక్రవారం(16న) నాడు జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని పేర్కొంటూ నిర్మల్ జిల్లాకు చెందిన కె.అంజుకుమార్‌రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన డాక్డర్ ఎస్.మల్లారెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం విచారించింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందనే పలు మున్సిపాలిటీ ఎన్నికలపై సింగిల్ జడ్జి స్టే ఆదేశాల్ని రద్దు చేయాలని, పిల్స్‌ను కొట్టేయాలని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వీటన్నింటినీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల ప్రక్రియను 109 రోజుల్లో చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రోజులోనే చేస్తామంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. 109 రోజులని చెప్పి 100 రోజుల్లో చేస్తే పర్వాలేదని, ఎనిమిది రోజుల్లోనే చేసేయడంపైనే తమకు సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. హడావుడిగా ప్రక్రియను ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని వివరణ కోరింది. వార్డుల విభజన ప్రక్రియ గతంలో ఎలా ఉండేదో.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఏమిటో కూడా వివరించాలని ఆదేశించింది. -
వార్డుల పునర్విభజన పై గందరగోళం
సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన తీరుపై ప్రజలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 2న విడుదలైన ముసాయిదా జాబితా సరిగాలేదని ఇప్పటికే చాలామంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారే పరిస్థితులను వివరిస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించడంలో పొరపాటు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార యంత్రాంగం చేసిన హడావుడితో జాబితా గజిబిజిగా తయారైంది. ఇష్టారీతిన వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టడంతో సవరించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఒకే క్రమ సంఖ్య ఇంటి నంబర్లను రెండు వార్డుల్లో కలపడంతో అవి ఏ కాలనీలకు వస్తాయో తెలియక స్థానికులు, పోటీ చేయాల్సిన ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియ చేపట్టకపోవడం కారణంగానే సమస్యలు తలెత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 49కి చేరిన వార్డుల సంఖ్య మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఇదివరకు ఉన్న 41 వార్డులను పునర్విభజన చేస్తూ 49 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 22 నుంచి 30 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల కులగణన చేపట్టారు. ఇది పూర్తయిన రోజు నుంచే వార్డుల పునర్విభజన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 2న జాబితా వెల్లడించాలని స్పష్టం చేయడంతో అధికారులు మున్సిపాలిటీ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, బిల్కలెక్టర్లకు బాధ్యతను అప్పగించారు. వీరు క్షేత్రస్థాయి కాలనీల్లో పర్యటించి వార్డుల వారీగా హద్దులు నిర్ణయించడం, ఓటర్ల వారీగా పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. శాశ్వత నిర్మాణాలైన రోడ్లు, రైల్వేపట్టాలు, చెరువులు తదితర వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విభజన ప్రక్రియ సందర్భంగా ఇవి అడ్డుగా వస్తే అక్కడికే నిలిపివేయాల్సి ఉంటుంది. 2200 నుంచి 2700 వరకు ఒక వార్డుగా విభజించినప్పటికీ నిబంధనలు మాత్రం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక వార్డులో ఓటర్లను కలపాల్సి వస్తే సమీపంలో ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వాటికి దూరంగా ఉన్న వాటిని కలిపేశారు. అధికారులు కార్యాలయంలో ముందుగా రూపొందించిన మ్యాప్‌లను పరిశీలించడం, ఇంటి నెంబర్ల వారీగా ఓటరు జాబితాలను తీసుకొపి వార్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కచ్చితంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పడంతో హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టారు. ఫలితంగా జాబితా గజిబిజిగా మారేందుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రజలతో పాటు ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇలా ఉండటం మూలంగా పూర్తి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆయా కాలనీవాసులకు కూడా తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వార్డుల విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందని అధికార యంత్రాంగం తప్పిదాలను ఎత్తిచూపుతూ పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పలువురు పట్టణవాసులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు పునర్విభజన ప్రక్రియపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 21ఫిర్యాదులు వచ్చాయి. అధికంగా పూజరితండా, పాత పాలమూరు, అప్పన్నపల్లి, పద్మవతికాలనీ, టిడిగుట్ట, షాషాబ్‌గుట్ట, పాలకొండ తదితర వార్డులు నుంచి అధికంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 13వ వార్డు పాత పాలమూరును విభజించి 16వ వార్డుగా, 23వ వార్డుగా ఏర్పాటు చేశారు. దాంట్లో పాత 13వ వార్డులో ఉన్న ఇంటి నెంబర్లు 5–10–1 నుంచి 5–10– 61/2 వరకు పాత పాలమూరుకు దూరంగా ఉన్న బండమీదిపల్లి, హన్మన్పుర వార్డుకు కలిపారు. అదేవిధంగా 5–10, 5–11, 5–12 బ్లాక్‌లతో పాటు పాత, కొత్త బాలాజీ నగర్ కలిపి 16వ వార్డుగా ఏర్పాటు చేయాలని గురువారం స్థానికులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలాగే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు చిన్నదర్పల్లి పరిధిలో ఉన్న పూజారితండాను తొలగిస్తూ 33వ వార్డులో కలుపుతున్నారని, ఆ తండాను గతంలో ఉన్న 34వ వార్డులోనే ఉండేవిధంగా చూడాలని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్ సురేందర్‌కు ఆ వార్డుకు యువకులు వినతి పత్రం ఇచ్చారు. నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన ఆయా వార్డుల సరిహద్దులను గుర్తిస్తూ ఓటర్లు, ఇంటి నంబర్ల ఆధారంగా విభజనచేయాల్సి ఉంటుంది. అయితే వార్డుల విభజన పూర్తిగా ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టడంతో భారీగా ఓటర్లు కన్పించకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తాం వార్డుల విభజనపై అభ్యంతరాలు చెప్పడానికి శుక్రవారం వరకు సమయం ఉంది. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తాం. స్థానికంగా ఉండే సమస్యలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తాం. ఓటర్లు, ఇంటి నెంబర్లు ఎవైనా తప్పుగా ఉంటే అభ్యంతరాలు చెప్పవచ్చు. –సురేందర్, కమిషనర్ -
ఇక రిజర్వేషన్ల కుస్తీ..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లె పోరుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాం గం అంతా బిజీ బిజీగా ఉంది. ఓటర్ల జాబితా మొదలుకొని కులగణన ప్రకియ వరకు వివిధ దశల్లో నిర్వహించాల్సి న కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియపై కుస్తీ ప్రారంభించింది. గురువారం దీనిపై ప్రకటన విడుదలజేయనుంది. మరో వైపు అధికారులు పోలింగ్ స్టేషన్ల ఎంపిక ప్రకియపై దృష్టి సారించారు. అన్ని వసతులున్న కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్ నుంచి అధికారులకు అదేశాలు అందడంతో గుర్తింపు ప్రకియ ప్రారంభమైంది. జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీల్లో 8910 వార్డులున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల కిత్రం జరిగిన సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రామాణికంగా గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో 16,45,439 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మే 20 వరకు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటించారు. ఆత్మకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్ల వారీగా ఉన్న పంచాయతీల్లోని వార్డుల్లో గల ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిశాక కులగణనపై కసరత్తును నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి కులగణన ప్రకియను చేపట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపే కీలకంగా దీన్ని నిర్వహించారు. ఈ నెల మొదటి వారం వరకు దీన్ని నిర్వహించి తుది జాబితాతో ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కులగణనపై కొన్ని చోట్ల నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు రావడంతో మళ్లీ కసరత్తు చేశారు. అందిన డ్రాఫ్ట్ కాపీలు ఇందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి డ్రాఫ్ట్ కాపీలు మంగళవారం అందాయి. బుధవారం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కులగణన అధారంగా పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గురువారం గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రకియపైనా అధికార గణం దృష్టి సారించింది. ప్రాథమికంగా ఒక్కో వార్డులో ఒక్కో బూత్ చొప్పున 8910 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ వస్తే మూడు దశల్లో ఎన్నికలు కులగణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఇలా జరిగేందుకు అవకాశం.. మొదటగా కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాల్లో గల 360 పంచాయతీల పరిధిలో 3406 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గల 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 2346 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని 15 మండలాల్లో 346 గ్రామ పంచాయతీల్లో 3158 వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
500 కొత్త మున్సిపల్ వార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా 500 వార్డులు ఏర్పాటుకానున్నాయి. త్వరలోనే ‘మున్సిపోల్స్’ నిర్వహించా లని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు వార్డుల విభజనపై దృష్టి సారించింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల లో కొత్త మున్సిపల్ చట్టాన్ని తేనుండటంతో ఆలోపు వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున.. ఈసారి పక్కాగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉంది. దీన్ని తాజాగా నిర్వహించే పునర్విభజనలో సవరించనున్నారు. జనాభా ప్రాతిపదికన వార్డు లను వర్గీకరిస్తారు. ఈ లెక్కన వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2014లో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులున్నాయి. ప్రస్తుతం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉండగా.. వీటిలో వార్డుల సంఖ్య 2,400 కానుంది. వార్డు జనాభాను తక్కువగా నిర్దేశిస్తే ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యంలేదు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కొన్నింటిలో మేజర్ గ్రామపంచాయతీలకన్నా కూడా తక్కువ జనాభా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత జనాభా పదివేల లోపే ఉంది. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం జనాభా కూడా దాదాపుగా అంతే. ఈ నేపథ్యంలో ఇక్కడ కనిష్టంగా 11 వార్డులను ఏర్పాటు చేస్తే.. సగటున ఒక్కో వార్డు జనాభా వేయిలోపే రానుంది. కాగా.. ఈ నెలాఖర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో నూతన పురపాలక చట్టం ప్రవేశపెట్టిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేదశలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగు తాయని అధికారులు తెలిపారు. పౌర సేవలన్నీ ఆన్లైన్లో మున్సిపాలిటీలకు ఉన్న చెడ్డపేరును తొలగించే దిశగా కొత్తచట్టానికి సర్కారు పదునుపెడుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రణాళికను పారదర్శకంగా మలి చేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. నిర్దేశిత కాలవ్యవధిలో బిల్డింగ్ పర్మిషన్ జారీ చేయకపోతే.. ఆటోమేటిక్‌గా మంజూరు చేసినట్లుగానే భావించేలా చట్టంలో వెసులుబాటు కల్పిస్తోంది. అదేసమయంలో భవన నిర్మాణ అనుమతి ఫైలు క్లియర్ చేయకుండా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన ఉద్యోగిపై జరిమానా/ సస్పెన్షన్ వేటు వేసే కఠిన నిబంధనలను కూడా ఈ చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అలాగే పురపాలికల్లో పౌర సేవలన్నింటినీ ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో ఉన్నప్పటికీ, మిగతావాటిని కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుండగా, కొత్త చట్టంలో పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులైజేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నియామవళిని పకడ్బందీగా రూపొందిస్తోంది. పదేళ్లు ఒకే రిజర్వేషన్? స్థానిక సంస్థల రిజర్వేషన్లను పదేళ్లపాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధానాన్ని వర్తింపజేసింది. ఇదే పద్ధతిని పట్టణ సంస్థలకు వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలు చేసే విధానంపై అధ్యయ నం చేస్తోంది. మహారాష్ట్ర తరహాలో పురపాలక సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. -
విలీనానికి ఓకే
సాక్షి, కామారెడ్డి: శివారు పల్లెలు పట్టణాల పరిధిలోకి రానున్నాయి.. మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.. పట్టణ శివారులోని గ్రామాల విలీనాన్ని సమర్థిస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనంపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసిన ఉన్నత న్యాయస్థానం.. విలీన ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. పట్టణ శివారులోని గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 గ్రామాలను ఐదు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టులో సవాల్ చేశారు. సర్కారు నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరగగా, విలీన గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు, విలీన గ్రామాల ప్రజలు వేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన హైకోర్టు.. విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన 125 పిటిషన్లు కోట్టి వేస్తూ.. బల్దియాలో శివారు గ్రామాల విలీనం సబబేనని తీర్పును వెల్లడించింది. దీంతో మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియ వివాదానికి తెర పడినట్లయింది. ఇక విలీన గ్రామాలు అధికారికంగా మున్సిపాలిటీల్లో విలీనానికి లైన్ క్లీయర్ అయింది. ఉమ్మడి జిల్లాలో 23 గ్రామాలు.. హైకోర్టు తీర్పుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో స్థానిక పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామాల విలీనానికి అడ్డంకులు తొలగి పోయాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 7, ఎల్లారెడ్డిలో 3, బోధన్‌లో 2, ఆర్మూర్‌లో 3, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 గ్రామాలు విలీనం కానున్నాయి. హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఇక అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఆయా మున్సిపాలిటీలలో వార్డుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. వార్డుల రూపంలో విలీన గ్రామాలు మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కానున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో టేక్రియాల్, సరంపల్లి, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, వడ్లూరు, లింగాపూర్, దేవునిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇక, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానిపేట్, లింగారెడ్డిపేట, దేవునిపల్లి గ్రామాలు చేరనున్నాయి. వార్డుల విభజన.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లు, కామారెడ్డిలో 33, ఎల్లారెడ్డిలో 9, బాన్సువాడలో 11, ఆర్మూర్‌లో 23, బోధన్ 35, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 7 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రకారం ప్రస్తుతం వార్డులు సరిగ్గానే ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, శివారు గ్రామాలు విలీనమవుతున్న తరుణంలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విలీన గ్రామాలను పట్టణంలోకి కలుపుతూ వార్డుల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాల సేకరించి చివరి వార్డుల జాబితాను సిద్ధం చేయనున్నారు. -
చట్టసవరణ తర్వాతే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: పురపాలికల చట్టాల సవరణ తర్వాతే రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు ప్రస్తుత నిబంధనలు అడ్డుగా మారడంతో చట్ట సవరణ అనివార్యమైంది. రాష్ట్ర పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేయడం ద్వారా గతేడాది మార్చిలో రాష్ట్రంలో 75 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు 135కుపైగా శివారు గ్రామాలను 37 పాత మునిసిపాలిటీలు, 5 మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేశారు. కొత్తగా ఏర్పడే మునిసిపాలిటీల్లో ఉండాల్సిన వార్డుల సంఖ్యతోపాటు పాత మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనమైన ప్రాంతాలు ఏ వార్డు/డివిజన్ల పరిధిలోకి వస్తాయన్న విషయాన్ని సైతం ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన చట్ట సవరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటర్ల సంఖ్య సమంగా ఉండేలా వార్డులు/డివిజన్ల విభజన జరపాలని నిబంధనలుండగా, శివారు గ్రామాల విలీనంతో కొన్ని వార్డులు/డివిజన్లలో ఓటర్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగిపోయింది. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మునిసిపాలిటీల్లో సైతం వార్డుల పునర్విభజనలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వార్డుల పునర్విభజనకు అడ్డంకులు తొలగించేందుకు పురపాలక శాఖ చట్టాలకు మరోసారి సవరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఉండగా 6 మునిసిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన 137 మునిసిపాలిటీలకు జూన్‌లో ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి మే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినా పురపాలక చట్టాలకు సవరణలు అవసరం కావడం తో కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మే చివరి నాటికి 58 మునిసిపాలిటీలు పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. రాజ్యాంగపరమైన అడ్డం కులతో 5 షెడ్యూల్డ్ ప్రాంత మునిసిపాలిటీలు ఇంతవరకు ఎన్నికలకు నోచుకోలేదు. కొత్తగా ఏర్పడిన 74 మునిసిపాలిటీలతోపాటు ఈ 63 మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డులవారీగా ఓటర్ల జాబితాలను ఈ నెల 28న ప్రచురించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశిం చింది. ఏప్రిల్ చివరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బం ది నియామకం తదితర ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. ఆలోగా పురపాలక చట్టాలకు సవరణ పూర్తయితే మే చివర్లో లేదా జూన్ తొలి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
పుర కసరత్తు
మున్సిపల్ ఎన్నికలకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజనను పూర్తి చేయనుంది. ఆతర్వాత పాత మున్సిపాలిటీలో విలీన గ్రామాలను వార్డులుగా చేయనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ జిల్లాలోని మున్సిపాలిటీలకు మార్గదర్శకాలను పంపింది. దీని ప్రకారం జిల్లాలో కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి, నేరడుచర్ల మున్సిపాలిటీల్లో కొత్తగా వార్డులను ఏర్పాటు చేయనున్నారు. సాక్షిప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసేందుకు సమీప గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇలా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న తిరుమలగిరి, నేరడుచర్ల కొత్త మున్సిపాలిటీలు అయ్యాయి. అలాగే కొన్ని గ్రామాలను పాత మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలు విలీనం అయ్యాయి. పురపాలక శాఖ మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో తొలుత వార్డుల విభవజన పూర్తి కానుంది. ఆతర్వాత పాత మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను వార్డులుగా చేస్తారు. ఈ ప్రకారం సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో వార్డులు పెరిగే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీల్లో ఏర్పా టు చేసిన వార్డులకు హద్దులు నిర్ణయించి పురపాలక శాఖకు అధికారికంగా పంపుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందు కు సర్వే చేస్తారు. ఈ సర్వే గణాంకాల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇది పూర్తయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. పేట మున్సిపాలిటీలో తొమ్మిది గ్రామాలు విలీనం.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు, 1,05,250 మంది జనాభా, 67,644 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల దురాజ్‌పల్లి, కుడకుడ, దసాయిగూడెం, బీబీగూడెం, కుప్పిరెడ్డిగూడెం, కుసుమవారిగూడెం, గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలను విలీనం చేశారు. తమ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలకు చెందిన కొంత మంది నేతలు స్టే తెచ్చుకున్నారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 64,546 మంది జనాభా, 40,101 మంది ఓటర్లు ఉన్నారు. సమీపంలో ఉన్న కొమరబండ, తమ్మర గ్రామాలను ఈ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ రెండు గ్రామాలకు చెందిన వారు కూడా స్టే తెచ్చుకున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 9 వార్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డుకు 1451 మంది ఓటర్లు ఉన్నారు. మాలిపురం, అనంతారం, నందపురం గ్రామాలను మున్సిపాలిటీలో కలపవద్దని స్టే తెచ్చారు. నేరడుచర్లను మేజర్ గ్రామ పంచాయతీలో రాంపురం, నర్సయ్యగూడెం, నేతాజినగర్, రామగిరి గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారు. రాంపురం గ్రామంవారు స్టే తెచ్చుకున్నారు. నేరడుచర్లలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 20 వార్డులు ఉన్నాయి. స్టే తొలిగితేనే ప్రక్రియ ముగింపు.. వార్డుల విభజనపై పురపాలక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసినా విలీన గ్రామాలపై స్టే ఎత్తివేస్తేనే పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా విలీన గ్రామాలపై ఉన్న స్టేను కోర్టు ఎత్తివేస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. అయితే రెండు, మూడు రోజుల్లో ఈ స్టేను ఎత్తివేస్తారని, దీంతో వార్డుల విభజన ప్రక్రియ సులువవుతుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. తమ గ్రామాల విలీనంపై స్టే తెచ్చుకున్న నేతలు మాత్రం రాజకీయంగా తమ భవిష్యత్ ఎమవుతుందోనని ఆందోళనలో ఉన్నారు. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండడంతో స్టే ఎత్తివేస్తే తాము సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉండదని ఆందోళనలో ఉన్నారు. -
ఫిఫ్టీ...ఫిఫ్టీ
- రిజర్వేషన్ల లెక్క తేలింది - మహిళలకు సగం డివిజన్లు - సోమ లేదా మంగళవారాల్లో వార్డుల ఖరారు గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి మహిళలు చక్రం తిప్పనున్నారు. పాలక మండలిలో సగభాగం కాబోతున్నారు. నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. మొత్తం 150 డివిజన్లలో సగం (75) మహిళలకే దక్కనున్నాయి. వీరిలో అన్ని వర్గాల వారూ ఉండబోతున్నారు. శుక్రవారం రిజర్వేషన్ల లెక్క తేలడంతో దీనిపై స్పష్టత వచ్చింది. ఇక ఏ వార్డు.. ఏ వర్గానికి వెళుతుందో రెండు...మూడు రోజుల్లో ఖరారు కాబోతోంది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం. ఏయే వర్గాలకు ఎన్ని వార్డులు వంతున వస్తాయో లెక్క తేలుస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వు చేయాల్సి ఉండటంతో అందుకనుగుణంగా వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో సహా) 75 సీట్లు కేటాయించారు. 33 శాతం బీసీలకు కేటాయించాల్సి ఉన్నందున వారికి 50 సీట్లు ఖరారు చేశారు. 150 వార్డుల్లో ఏయే వార్డులు ఎవ రెవరికి అనేది మాత్రం వెల్లడించలేదు. సోమ లేదా మంగళవారాల్లో ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ ఏ వార్డు ఎవరికి రిజర్వ్ చేశారో తెలుసుకునేందుకు రాజకీయ పక్షాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. వివిధ డివిజన్ల నుంచి పోటీ చేయాలని యత్నిస్తున్న నాయకులు దీనికి మరింత ఆత్రంగా చూస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారవుతున్నాయని తెలియగానే... ఏ వార్డు ఎవరికో తెలుసుకునే పనిలో పడ్డారు. తాము కోరుకున్న డివిజన్ అంచనాల మేరకు లేకపోతే ఏం చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నారు. ఒక వేళ మహిళలకు రిజర్వు అయితే తమ సతీమణులకో, కుమార్తెలకో బరిలో దించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మేయర్ పీఠం ఈసారి బీసీలకు దక్కనుంది. ఈ నేపథ్యంలో పలువురు బీసీ నేతలు రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన వారు సైతం మేయర్ పదవి కోసం కార్పొరేటర్‌గా పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అవకాశాల్లో సగం.. ఆకాశంలో సగమైన మహిళలకు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సగం అవకాశాలు దక్కనున్నాయి. మొత్తం 150 సీట్లకుగాను వారికి 75 సీట్లు ఖరారయ్యాయి. అంటే పాలక మండలిలో ఈసారి పురుషులతో సమాన సంఖ్యలో మహిళలు ఉంటారన్నమాట. ఇక ఓపెన్ కేటగిరీలో గతంలో 58 సీట్లు ఉండగా... ఈసారి అవి 44కు తగ్గాయి. ఎస్సీలకు గతంలో 12 ఉండగా... ప్రస్తుతం 10కి తగ్గాయి. మహిళలు ఎక్కువగా ఉన్న డివిజన్లు మహిళలకు మొత్తం 75 సీట్లు దక్కనుండటంతో వారికి ఏయే వార్డులు వెళతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుభాష్‌నగర్‌లో అత్యధికంగా 34,152 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 25 వేలకు పైగా ఉన్న డివిజన్లు మొత్తం 26. అవి.. సరూర్‌నగర్ (28,474), ఆర్కేపురం(27,716), సైదాబాద్ (27,638), మూసారాంబాగ్ (25,367), ఐఎస్ సదన్(25,398), మైలార్‌దేవ్‌పల్లి (29,830), జాంబాగ్(26, 878), గన్‌ఫౌండ్రి (25,116), అంబర్‌పేట(25,318), బాగ్‌అంబర్‌పేట (25,504), రామ్ నగర్ (26,126), ఖైరతాబాద్(25,614), కొండాపూర్ (28,252), బాలాజీ నగర్ (26,828), అల్లాపూర్ (25,193), కుత్బుల్లాపూర్ (27,032), నేరేడ్మెట్ (25,999), మౌలాలి (26,913), ఈస్ట్ఆనంద్బాగ్(25,279), మల్కాజిగిరి (26,847), గౌతమ్ నగర్ (27,898), తార్నాక (27,973), బన్సీలాల్‌పేట (25,016), మోండా మార్కెట్(25,592). ఈ డివిజన్లు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. గతంలో వార్డుల రిజర్వేషన్ తీరిదీ.. ఎస్టీ మహిళ: జంగమ్మెట్, ఎస్టీ జనరల్: అమీర్‌పేట ఎస్సీ మహిళలు: యాప్రాల్, అడ్డగుట్ట, పద్మారావునగర్, అల్వాల్. ఎస్సీ జనరల్: గచ్చిబౌలి, మెట్టుగూడ, ఓల్డ్ మల్కాజిగిరి, బన్సీలాల్‌పేట, మచ్చబొల్లారం, కవాడిగూడ, రాజేంద్రనగర్, జియాగూడ. బీసీ (మహిళ): పురానాపూల్, నవాబ్‌సాహెబ్‌కుంట, మారేడ్‌పల్లి, రెడ్‌హిల్స్, చిలకలగూడ, కాచిగూడ, ఫలక్‌నుమా, రామ్‌గోపాల్‌పేట, గుడి మల్కాపూర్, కార్వాన్, జహనుమా, బౌద్ధనగర్, నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, రామ్‌నగర్, ఆర్సీపురం, దత్తాత్రేయనగర్. బీసీ జనరల్: అహ్మద్‌నగర్, అలియాబాద్, జగద్గిరిగుట్ట, చందానగర్, మురాద్‌నగర్, ఎర్రగడ్డ, చావుని, డబీర్‌పురా, శేరిలింగంపల్లి, సుల్తాన్‌బజార్, టోలిచౌకి, గౌలిపురా, మల్లేపల్లి, బాగ్‌అంబర్‌పేట, మూసారాంబాగ్, గాజుల రామారం, ఫతేదర్వాజ, అంబర్‌పేట, సీతాఫల్మండి, చింతల్, హఫీజ్‌పేట, ధూల్‌పేట, షాపూర్‌నగర్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, జీడిమెట్ల, గోషామహల్, మంగళ్‌హాట్, పటాన్చెరు, రహ్మత్‌నగర్, రామ్నాస్పురా, మైలార్‌దేవ్‌పల్లి, బేగంబజార్. మహిళ జనరల్: బల్కంపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీ కాలనీ, కర్మాన్‌ఘాట్, బంజారాహిల్స్, చింతల్‌బస్తీ, విజయనగర్ కాలనీ, దోమలగూడ, గౌతంనగర్, సఫిల్‌గూడ, బేగంపేట, డిఫెన్స్ కాలనీ, మౌలాలి, గాంధీనగర్, ముషీరాబాద్, అత్తాపూర్, రామకృష్ణాపురం, హిమాయత్‌నగర్, తార్నాక, బోరబండ, సరూర్‌నగర్, ఉప్పల్, ఘాన్సిబజార్, నల్లకుంట, అడిక్‌మెట్, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ. -
2011 జనాభా ఆధారంగానే వార్డుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లో 2001 జనాభా లెక్కల ఆధారంగా చేసిన వార్డుల విభజనను హైకోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన చేయాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2001 జనాభా లెక్కల ఆధారంగా వార్డులు విభజించడాన్ని సవాలు చేస్తూ ఖమ్మం పట్టణానికి చెందిన సి.హెచ్.నాగేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 2001 జనాభా ప్రకారం 50 వార్డులుగా విభజించడం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు.