ఫిఫ్టీ...ఫిఫ్టీ
- రిజర్వేషన్ల లెక్క తేలింది
- మహిళలకు సగం డివిజన్లు
- సోమ లేదా మంగళవారాల్లో వార్డుల ఖరారు
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి మహిళలు చక్రం తిప్పనున్నారు. పాలక మండలిలో సగభాగం కాబోతున్నారు. నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. మొత్తం 150 డివిజన్‌లలో సగం (75) మహిళలకే దక్కనున్నాయి. వీరిలో అన్ని వర్గాల వారూ ఉండబోతున్నారు. శుక్రవారం రిజర్వేషన్ల లెక్క తేలడంతో దీనిపై స్పష్టత వచ్చింది. ఇక ఏ వార్డు.. ఏ వర్గానికి వెళుతుందో రెండు...మూడు రోజుల్లో ఖరారు కాబోతోంది.
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం. ఏయే వర్గాలకు ఎన్ని వార్డులు వంతున వస్తాయో లెక్క తేలుస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వు చేయాల్సి ఉండటంతో అందుకనుగుణంగా వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో సహా) 75 సీట్లు కేటాయించారు. 33 శాతం బీసీలకు కేటాయించాల్సి ఉన్నందున వారికి 50 సీట్లు ఖరారు చేశారు. 150 వార్డుల్లో ఏయే వార్డులు ఎవ రెవరికి అనేది మాత్రం వెల్లడించలేదు. సోమ లేదా మంగళవారాల్లో ఇది ఖరారయ్యే అవకాశం ఉంది.
రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ
ఏ వార్డు ఎవరికి రిజర్వ్ చేశారో తెలుసుకునేందుకు రాజకీయ పక్షాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. వివిధ డివిజన్ల నుంచి పోటీ చేయాలని యత్నిస్తున్న నాయకులు దీనికి మరింత ఆత్రంగా చూస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారవుతున్నాయని తెలియగానే... ఏ వార్డు ఎవరికో తెలుసుకునే పనిలో పడ్డారు. తాము కోరుకున్న డివిజన్ అంచనాల మేరకు లేకపోతే ఏం చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నారు. ఒక వేళ మహిళలకు రిజర్వు అయితే తమ సతీమణులకో, కుమార్తెలకో బరిలో దించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మేయర్ పీఠం ఈసారి బీసీలకు దక్కనుంది. ఈ నేపథ్యంలో పలువురు బీసీ నేతలు రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన వారు సైతం మేయర్ పదవి కోసం కార్పొరేటర్‌గా పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
అవకాశాల్లో సగం..
ఆకాశంలో సగమైన మహిళలకు ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సగం అవకాశాలు దక్కనున్నాయి. మొత్తం 150 సీట్లకుగాను వారికి 75 సీట్లు ఖరారయ్యాయి. అంటే పాలక మండలిలో ఈసారి పురుషులతో సమాన సంఖ్యలో మహిళలు ఉంటారన్నమాట. ఇక ఓపెన్ కేటగిరీలో గతంలో 58 సీట్లు ఉండగా... ఈసారి అవి 44కు తగ్గాయి. ఎస్సీలకు గతంలో 12 ఉండగా... ప్రస్తుతం 10కి తగ్గాయి.
మహిళలు ఎక్కువగా ఉన్న డివిజన్లు
మహిళలకు మొత్తం 75 సీట్లు దక్కనుండటంతో వారికి ఏయే వార్డులు వెళతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుభాష్‌నగర్‌లో అత్యధికంగా 34,152 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు.
మహిళా ఓటర్లు 25 వేలకు పైగా ఉన్న డివిజన్లు మొత్తం 26. అవి.. సరూర్‌నగర్ (28,474), ఆర్‌కేపురం(27,716), సైదాబాద్ (27,638), మూసారాంబాగ్ (25,367), ఐఎస్ సదన్(25,398), మైలార్‌దేవ్‌పల్లి (29,830), జాంబాగ్(26, 878), గన్‌ఫౌండ్రి (25,116), అంబర్‌పేట(25,318), బాగ్‌అంబర్‌పేట (25,504), రామ్ నగర్ (26,126), ఖైరతాబాద్(25,614), కొండాపూర్ (28,252), బాలాజీ నగర్ (26,828), అల్లాపూర్ (25,193), కుత్బుల్లాపూర్ (27,032), నేరేడ్‌మెట్ (25,999), మౌలాలి (26,913), ఈస్ట్‌ఆనంద్‌బాగ్(25,279), మల్కాజిగిరి (26,847), గౌతమ్ నగర్ (27,898), తార్నాక (27,973), బన్సీలాల్‌పేట (25,016), మోండా మార్కెట్(25,592). ఈ డివిజన్లు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి.
గతంలో వార్డుల రిజర్వేషన్ తీరిదీ..
ఎస్టీ మహిళ: జంగమ్మెట్, ఎస్టీ జనరల్: అమీర్‌పేట
ఎస్సీ మహిళలు: యాప్రాల్, అడ్డగుట్ట, పద్మారావునగర్, అల్వాల్.
ఎస్సీ జనరల్: గచ్చిబౌలి, మెట్టుగూడ, ఓల్డ్ మల్కాజిగిరి, బన్సీలాల్‌పేట, మచ్చబొల్లారం, కవాడిగూడ, రాజేంద్రనగర్, జియాగూడ.
బీసీ (మహిళ): పురానాపూల్, నవాబ్‌సాహెబ్‌కుంట, మారేడ్‌పల్లి, రెడ్‌హిల్స్, చిలకలగూడ, కాచిగూడ, ఫలక్‌నుమా, రామ్‌గోపాల్‌పేట, గుడి మల్కాపూర్, కార్వాన్, జహనుమా, బౌద్ధనగర్, నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, రామ్‌నగర్, ఆర్‌సీపురం, దత్తాత్రేయనగర్.
బీసీ జనరల్: అహ్మద్‌నగర్, అలియాబాద్, జగద్గిరిగుట్ట, చందానగర్, మురాద్‌నగర్, ఎర్రగడ్డ, చావుని, డబీర్‌పురా, శేరిలింగంపల్లి, సుల్తాన్‌బజార్, టోలిచౌకి, గౌలిపురా, మల్లేపల్లి, బాగ్‌అంబర్‌పేట, మూసారాంబాగ్, గాజుల రామారం, ఫతేదర్వాజ, అంబర్‌పేట, సీతాఫల్‌మండి, చింతల్, హఫీజ్‌పేట, ధూల్‌పేట, షాపూర్‌నగర్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, జీడిమెట్ల, గోషామహల్, మంగళ్‌హాట్, పటాన్‌చెరు, రహ్మత్‌నగర్, రామ్నాస్‌పురా, మైలార్‌దేవ్‌పల్లి, బేగంబజార్.
మహిళ జనరల్: బల్కంపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీ కాలనీ, కర్మాన్‌ఘాట్, బంజారాహిల్స్, చింతల్‌బస్తీ, విజయనగర్ కాలనీ, దోమలగూడ, గౌతంనగర్, సఫిల్‌గూడ, బేగంపేట, డిఫెన్స్ కాలనీ, మౌలాలి, గాంధీనగర్, ముషీరాబాద్, అత్తాపూర్, రామకృష్ణాపురం, హిమాయత్‌నగర్, తార్నాక, బోరబండ, సరూర్‌నగర్, ఉప్పల్, ఘాన్సిబజార్, నల్లకుంట, అడిక్‌మెట్, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ.