సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన ఓ కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ప్రకటనను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పురపాలికల వారీగా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వార్డుల విభజన కోసం ఈ నెల 3న 14 రోజుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వార్డులు/డివిజన్ల పునర్విభజన ముసాయిదాను ప్రకటించి, వారం రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది.
వీటిని పరిష్కరించడం ద్వారా మంగళవారం వార్డులు/డివిజన్ల పునర్విభజన తుది ప్రకటనను జారీ చేసింది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రెండుమూడు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముంది. కొత్త వార్డులు/డివిజన్ల భౌగోళిక స్వరూపం, సరిహద్దులను దృష్టిలో పెట్టుకుని వీటికి సం బంధించిన ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు వారం రోజులు పట్టనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
జనాభా దామాషా ప్రకారం...
మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వార్డు, చైర్‌పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కార్పొరేషన్లలో సైతం ఇలానే చేస్తారు. మున్సి పల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలి స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. అంతా సజావుగా జరిగితే జనవరి చివరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఏవైనా అడ్డంకులొస్తే ఫిబ్రవరి లో జరుగుతాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్‌ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment