సాక్షి, కామారెడ్డి: శివారు పల్లెలు పట్టణాల పరిధిలోకి రానున్నాయి.. మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.. పట్టణ శివారులోని గ్రామాల విలీనాన్ని సమర్థిస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనంపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసిన ఉన్నత న్యాయస్థానం.. విలీన ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. పట్టణ శివారులోని గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 గ్రామాలను ఐదు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టులో సవాల్ చేశారు. సర్కారు నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరగగా, విలీన గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు, విలీన గ్రామాల ప్రజలు వేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన హైకోర్టు.. విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన 125 పిటిషన్లు కోట్టి వేస్తూ.. బల్దియాలో శివారు గ్రామాల విలీనం సబబేనని తీర్పును వెల్లడించింది. దీంతో మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియ వివాదానికి తెర పడినట్లయింది. ఇక విలీన గ్రామాలు అధికారికంగా మున్సిపాలిటీల్లో విలీనానికి లైన్ క్లీయర్ అయింది.
ఉమ్మడి జిల్లాలో 23 గ్రామాలు..
హైకోర్టు తీర్పుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో స్థానిక పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామాల విలీనానికి అడ్డంకులు తొలగి పోయాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 7, ఎల్లారెడ్డిలో 3, బోధన్‌లో 2, ఆర్మూర్‌లో 3, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 8 గ్రామాలు విలీనం కానున్నాయి. హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఇక అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఆయా మున్సిపాలిటీలలో వార్డుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. వార్డుల రూపంలో విలీన గ్రామాలు మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కానున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో టేక్రియాల్, సరంపల్లి, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, వడ్లూరు, లింగాపూర్, దేవునిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇక, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానిపేట్, లింగారెడ్డిపేట, దేవునిపల్లి గ్రామాలు చేరనున్నాయి.
వార్డుల విభజన..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, కామారెడ్డిలో 33, ఎల్లారెడ్డిలో 9, బాన్సువాడలో 11, ఆర్మూర్‌లో 23, బోధన్ 35, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 7 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రకారం ప్రస్తుతం వార్డులు సరిగ్గానే ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, శివారు గ్రామాలు విలీనమవుతున్న తరుణంలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విలీన గ్రామాలను పట్టణంలోకి కలుపుతూ వార్డుల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాల సేకరించి చివరి వార్డుల జాబితాను సిద్ధం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment