joint district
-
పట్టభద్రుల పోటీ... రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’తో పాటు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్ జోష్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్’స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ టీఆర్ఎస్ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వంటి వారు టికెట్‌ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’స్థానం నుంచి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్ శ్రీనివాస్, వికారాబాద్‌కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్ పటేల్ కూడా టీఆర్ఎస్ టికెటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..! ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్ నగర్’ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోమారు బరిలోకి రాంచందర్‌రావు? ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌రావు తదతరులు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వరంగల్ బరిలో కోదండరాం ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆ ముగ్గురు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్సీల రాజీనామాతో వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మూడు స్థానా లకు ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. వీలైనంత వరకు ఈ 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేలా పార్టీ అధిష్టానం వ్యూహం సిద్ధం చేసింది. అయితే ఉమ్మడి జిల్లాల్లోని సమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాలతో పాటు మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటికీ కలిపి సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో రెండు టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లే. 2015లో జరిగిన ఎన్నికల్లో వరంగల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్, కాంగ్రెస్ నల్లగొండ స్థానాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం అమలు చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మరో మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు రానున్నా రు. కేసీఆర్ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే అవకా శం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ►వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కొండా మురళి.. కాంగ్రెస్‌లో చేరడంతో పదవికి చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఈ స్థానానికి పరిశీలిస్తోంది. ►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పద వికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పట్నం మహేందర్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. ►ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరుగుతోంది. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే కోటాలోనా.. స్థానిక సంస్థలో కోటాలో అవకాశం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. త్వరలో మరో నాలుగు స్థానాలు.. రాష్ట్ర శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. ప్రస్తు తం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 స్థానా లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 4 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనర్హత వేటు కారణంగా యాదవరెడ్డి, రాములునాయక్, భూపతిరెడ్డిల శానసమండలి సభ్యత్వాలు రద్దయ్యా యి. అనర్హత వేటు నిర్ణయంపై వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు అనంతరం ఈ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ స్థానాలకు టీఆర్ఎస్ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత కె.నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని లోక్‌సభ అభ్యర్థుల జాబితా వెల్లడించిన రోజే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. -
విలీనానికి ఓకే
సాక్షి, కామారెడ్డి: శివారు పల్లెలు పట్టణాల పరిధిలోకి రానున్నాయి.. మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.. పట్టణ శివారులోని గ్రామాల విలీనాన్ని సమర్థిస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనంపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసిన ఉన్నత న్యాయస్థానం.. విలీన ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. పట్టణ శివారులోని గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 గ్రామాలను ఐదు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టులో సవాల్ చేశారు. సర్కారు నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరగగా, విలీన గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు, విలీన గ్రామాల ప్రజలు వేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన హైకోర్టు.. విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన 125 పిటిషన్లు కోట్టి వేస్తూ.. బల్దియాలో శివారు గ్రామాల విలీనం సబబేనని తీర్పును వెల్లడించింది. దీంతో మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియ వివాదానికి తెర పడినట్లయింది. ఇక విలీన గ్రామాలు అధికారికంగా మున్సిపాలిటీల్లో విలీనానికి లైన్ క్లీయర్ అయింది. ఉమ్మడి జిల్లాలో 23 గ్రామాలు.. హైకోర్టు తీర్పుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో స్థానిక పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామాల విలీనానికి అడ్డంకులు తొలగి పోయాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 7, ఎల్లారెడ్డిలో 3, బోధన్‌లో 2, ఆర్మూర్‌లో 3, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 గ్రామాలు విలీనం కానున్నాయి. హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఇక అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తి కానుంది. తర్వాత ఆయా మున్సిపాలిటీలలో వార్డుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. వార్డుల రూపంలో విలీన గ్రామాలు మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కానున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో టేక్రియాల్, సరంపల్లి, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, వడ్లూరు, లింగాపూర్, దేవునిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇక, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానిపేట్, లింగారెడ్డిపేట, దేవునిపల్లి గ్రామాలు చేరనున్నాయి. వార్డుల విభజన.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లు, కామారెడ్డిలో 33, ఎల్లారెడ్డిలో 9, బాన్సువాడలో 11, ఆర్మూర్‌లో 23, బోధన్ 35, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 7 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రకారం ప్రస్తుతం వార్డులు సరిగ్గానే ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, శివారు గ్రామాలు విలీనమవుతున్న తరుణంలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విలీన గ్రామాలను పట్టణంలోకి కలుపుతూ వార్డుల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాల సేకరించి చివరి వార్డుల జాబితాను సిద్ధం చేయనున్నారు. -
నేరస్తుల వివరాల సేకరణ
నల్లగొండ క్రైం : జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే నేరస్తుల వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1200మంది నేరస్తులు ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రజలు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రౌడీ షీటర్ల నుంచి ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రతి రౌడీషీటర్‌కు సంబంధించిన ఇల్లు, ఫొటో, వేలిముద్రలు, కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధమున్న రౌడీ షీటర్ టమాట శీను ఇంటి వద్ద ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు సేకరించారు. అతడి ఇంటిని జీపీఎస్ (గ్లోబల్ పొజీషన్ సిస్టమ్)కు అనుసంధానం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 950 మంది నేరస్తుల వివరాలను సేకరించారు. నేర సంఘటనల్లో సంబంధమున్న 15 మంది అనారోగ్యం, ప్రత్యర్థుల దాడిలో మృతిచెందినట్లు సమాచారం. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరిస్తున్న కొత్త ఎస్ఐలకు జిల్లా మొత్తం మీద నేరస్తులపై అవగాహన కలిగేందుకు ఈ సమాచారం సేకరణ ఉపయోగపడుతుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఫైన్స్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం.. రౌడీషటర్లు, దోపిడీ, దొంగతనాలు తదితర కేసుల్లో నేరస్తులకు సంబంధించిన ఫొటోలు, ఆధార్‌కార్డు, వేలిముద్రలు, ఇంటి మ్యాప్, వారి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు, ఎన్ని కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు, అతడి జీవనశైలి, ప్రస్తుతం ఏం పనిచేస్తున్నాడు, ఏదైనా నేరానికి కుట్రలు చేస్తున్నాడా అన్న విషయాలపై సమగ్రంగా ఆరాతీసి ఫైన్స్ సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం చేస్తారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగినప్పుడు సంఘటన స్థలంలో లభించిన వేలిముద్రలను ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. నేరంతో సంబంధం ఉంటే వెంటనే పాత నేరస్తుల వివరాలన్నీ తెలిసిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటనల్లో సంబంధమున్నా కొత్తగా రూపొందించిన సాప్ట్వేర్ ద్వారా నిందితుడి వివరాలు వెంటనే తెలిసిపోతాయి. రాత్రిపూట అనుమానస్పదంగా తిరిగిన వ్యక్తులను కూడా ఈ సాప్ట్‌వేర్‌తో గుర్తించగలుగుతారు. నేరస్తుడికి సంబంధించిన తల్లితండ్రులు, అత్తగారి తరుపు కుటుంబ సభ్యుల, బంధువుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వివరాలు సేకరించేది వీరివే.. జిల్లాలో హత్యలు, భూదందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, దొంగతనాలు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులు, చోరీలు తదితర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నవారి వివరాలను పోలీసులు సమగ్రంగా సేకరిస్తారు. నేరస్తులతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.