నల్లగొండ క్రైం : జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే నేరస్తుల వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1200మంది నేరస్తులు ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రజలు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రౌడీ షీటర్ల నుంచి ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రతి రౌడీషీటర్‌కు సంబంధించిన ఇల్లు, ఫొటో, వేలిముద్రలు, కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధమున్న రౌడీ షీటర్ టమాట శీను ఇంటి వద్ద ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు సేకరించారు. అతడి ఇంటిని జీపీఎస్ (గ్లోబల్ పొజీషన్ సిస్టమ్)కు అనుసంధానం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 950 మంది నేరస్తుల వివరాలను సేకరించారు. నేర సంఘటనల్లో సంబంధమున్న 15 మంది అనారోగ్యం, ప్రత్యర్థుల దాడిలో మృతిచెందినట్లు సమాచారం. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరిస్తున్న కొత్త ఎస్‌ఐలకు జిల్లా మొత్తం మీద నేరస్తులపై అవగాహన కలిగేందుకు ఈ సమాచారం సేకరణ ఉపయోగపడుతుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఫైన్స్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం..
రౌడీషటర్లు, దోపిడీ, దొంగతనాలు తదితర కేసుల్లో నేరస్తులకు సంబంధించిన ఫొటోలు, ఆధార్‌కార్డు, వేలిముద్రలు, ఇంటి మ్యాప్, వారి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు, ఎన్ని కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు, అతడి జీవనశైలి, ప్రస్తుతం ఏం పనిచేస్తున్నాడు, ఏదైనా నేరానికి కుట్రలు చేస్తున్నాడా అన్న విషయాలపై సమగ్రంగా ఆరాతీసి ఫైన్స్ సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం చేస్తారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగినప్పుడు సంఘటన స్థలంలో లభించిన వేలిముద్రలను ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. నేరంతో సంబంధం ఉంటే వెంటనే పాత నేరస్తుల వివరాలన్నీ తెలిసిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటనల్లో సంబంధమున్నా కొత్తగా రూపొందించిన సాప్ట్‌వేర్ ద్వారా నిందితుడి వివరాలు వెంటనే తెలిసిపోతాయి. రాత్రిపూట అనుమానస్పదంగా తిరిగిన వ్యక్తులను కూడా ఈ సాప్ట్‌వేర్‌తో గుర్తించగలుగుతారు. నేరస్తుడికి సంబంధించిన తల్లితండ్రులు, అత్తగారి తరుపు కుటుంబ సభ్యుల, బంధువుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
వివరాలు సేకరించేది వీరివే..
జిల్లాలో హత్యలు, భూదందాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లు, దొంగతనాలు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులు, చోరీలు తదితర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నవారి వివరాలను పోలీసులు సమగ్రంగా సేకరిస్తారు. నేరస్తులతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
నేరస్తుల వివరాల సేకరణ
Published Mon, Jan 9 2017 3:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement