ఆ ముగ్గురు ఎవరు?  | TRS has Focused on the Finalization of MLC Candidates | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు ఎవరు? 

Published Wed, May 8 2019 4:45 AM | Last Updated on Wed, May 8 2019 4:45 AM

TRS has Focused on the Finalization of MLC Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీల రాజీనామాతో వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మూడు స్థానా లకు ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. వీలైనంత వరకు ఈ 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేలా పార్టీ అధిష్టానం వ్యూహం సిద్ధం చేసింది. అయితే ఉమ్మడి జిల్లాల్లోని సమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాలతో పాటు మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.

అన్నింటికీ కలిపి సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో రెండు టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లే. 2015లో జరిగిన ఎన్నికల్లో వరంగల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నల్లగొండ స్థానాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం అమలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ మరో మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు రానున్నా రు. కేసీఆర్‌ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే అవకా శం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. 

►వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కొండా మురళి.. కాంగ్రెస్‌లో చేరడంతో పదవికి చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఈ స్థానానికి పరిశీలిస్తోంది. 

►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పద వికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పట్నం మహేందర్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది.  

►ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరుగుతోంది. నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే కోటాలోనా.. స్థానిక సంస్థలో కోటాలో అవకాశం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. 

త్వరలో మరో నాలుగు స్థానాలు.. 
రాష్ట్ర శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. ప్రస్తు తం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 స్థానా లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 4 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనర్హత వేటు కారణంగా యాదవరెడ్డి, రాములునాయక్, భూపతిరెడ్డిల శానసమండలి సభ్యత్వాలు రద్దయ్యా యి. అనర్హత వేటు నిర్ణయంపై వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు అనంతరం ఈ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ స్థానాలకు టీఆర్‌ఎస్‌ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత కె.నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని లోక్‌సభ అభ్యర్థుల జాబితా వెల్లడించిన రోజే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement