సాక్షి, హైదరాబాద్: పురపాలికల చట్టాల సవరణ తర్వాతే రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు ప్రస్తుత నిబంధనలు అడ్డుగా మారడంతో చట్ట సవరణ అనివార్యమైంది. రాష్ట్ర పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేయడం ద్వారా గతేడాది మార్చిలో రాష్ట్రంలో 75 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు 135కుపైగా శివారు గ్రామాలను 37 పాత మునిసిపాలిటీలు, 5 మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేశారు. కొత్తగా ఏర్పడే మునిసిపాలిటీల్లో ఉండాల్సిన వార్డుల సంఖ్యతోపాటు పాత మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనమైన ప్రాంతాలు ఏ వార్డు/డివిజన్ల పరిధిలోకి వస్తాయన్న విషయాన్ని సైతం ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన చట్ట సవరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటర్ల సంఖ్య సమంగా ఉండేలా వార్డులు/డివిజన్ల విభజన జరపాలని నిబంధనలుండగా, శివారు గ్రామాల విలీనంతో కొన్ని వార్డులు/డివిజన్లలో ఓటర్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగిపోయింది.
అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మునిసిపాలిటీల్లో సైతం వార్డుల పునర్విభజనలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వార్డుల పునర్విభజనకు అడ్డంకులు తొలగించేందుకు పురపాలక శాఖ చట్టాలకు మరోసారి సవరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఉండగా 6 మునిసిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన 137 మునిసిపాలిటీలకు జూన్‌లో ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి మే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినా పురపాలక చట్టాలకు సవరణలు అవసరం కావడం తో కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మే చివరి నాటికి 58 మునిసిపాలిటీలు పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి.
రాజ్యాంగపరమైన అడ్డం కులతో 5 షెడ్యూల్డ్ ప్రాంత మునిసిపాలిటీలు ఇంతవరకు ఎన్నికలకు నోచుకోలేదు. కొత్తగా ఏర్పడిన 74 మునిసిపాలిటీలతోపాటు ఈ 63 మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డులవారీగా ఓటర్ల జాబితాలను ఈ నెల 28న ప్రచురించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశిం చింది. ఏప్రిల్ చివరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బం ది నియామకం తదితర ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. ఆలోగా పురపాలక చట్టాలకు సవరణ పూర్తయితే మే చివర్లో లేదా జూన్ తొలి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment