సూర్యాపేట పట్టణ వ్యూ
మున్సిపల్ ఎన్నికలకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజనను పూర్తి చేయనుంది. ఆతర్వాత పాత మున్సిపాలిటీలో విలీన గ్రామాలను వార్డులుగా చేయనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ జిల్లాలోని మున్సిపాలిటీలకు మార్గదర్శకాలను పంపింది. దీని ప్రకారం జిల్లాలో కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి, నేరడుచర్ల మున్సిపాలిటీల్లో కొత్తగా వార్డులను ఏర్పాటు చేయనున్నారు.
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసేందుకు సమీప గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇలా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న తిరుమలగిరి, నేరడుచర్ల కొత్త మున్సిపాలిటీలు అయ్యాయి. అలాగే కొన్ని గ్రామాలను పాత మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలు విలీనం అయ్యాయి. పురపాలక శాఖ మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో తొలుత వార్డుల విభవజన పూర్తి కానుంది.
ఆతర్వాత పాత మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను వార్డులుగా చేస్తారు. ఈ ప్రకారం సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో వార్డులు పెరిగే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీల్లో ఏర్పా టు చేసిన వార్డులకు హద్దులు నిర్ణయించి పురపాలక శాఖకు అధికారికంగా పంపుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందు కు సర్వే చేస్తారు. ఈ సర్వే గణాంకాల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇది పూర్తయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది.
పేట మున్సిపాలిటీలో తొమ్మిది గ్రామాలు విలీనం..
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు, 1,05,250 మంది జనాభా, 67,644 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల దురాజ్‌పల్లి, కుడకుడ, దసాయిగూడెం, బీబీగూడెం, కుప్పిరెడ్డిగూడెం, కుసుమవారిగూడెం, గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలను విలీనం చేశారు. తమ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని గాంధీనగర్, రాయినిగూడెం, పిల్లలమర్రి గ్రామాలకు చెందిన కొంత మంది నేతలు స్టే తెచ్చుకున్నారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 64,546 మంది జనాభా, 40,101 మంది ఓటర్లు ఉన్నారు. సమీపంలో ఉన్న కొమరబండ, తమ్మర గ్రామాలను ఈ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
ఈ రెండు గ్రామాలకు చెందిన వారు కూడా స్టే తెచ్చుకున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 9 వార్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డుకు 1451 మంది ఓటర్లు ఉన్నారు. మాలిపురం, అనంతారం, నందపురం గ్రామాలను మున్సిపాలిటీలో కలపవద్దని స్టే తెచ్చారు. నేరడుచర్లను మేజర్ గ్రామ పంచాయతీలో రాంపురం, నర్సయ్యగూడెం, నేతాజినగర్, రామగిరి గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారు. రాంపురం గ్రామంవారు స్టే తెచ్చుకున్నారు. నేరడుచర్లలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 20 వార్డులు ఉన్నాయి.
స్టే తొలిగితేనే ప్రక్రియ ముగింపు..
వార్డుల విభజనపై పురపాలక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసినా విలీన గ్రామాలపై స్టే ఎత్తివేస్తేనే పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా విలీన గ్రామాలపై ఉన్న స్టేను కోర్టు ఎత్తివేస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. అయితే రెండు, మూడు రోజుల్లో ఈ స్టేను ఎత్తివేస్తారని, దీంతో వార్డుల విభజన ప్రక్రియ సులువవుతుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. తమ గ్రామాల విలీనంపై స్టే తెచ్చుకున్న నేతలు మాత్రం రాజకీయంగా తమ భవిష్యత్ ఎమవుతుందోనని ఆందోళనలో ఉన్నారు. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండడంతో స్టే ఎత్తివేస్తే తాము సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉండదని ఆందోళనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment