ఊపందుకుంటున్న నియామకాలు..ఉజ్వల కెరీర్‌కు వ్యూహాలు | In the recruitment process in the private sector | Sakshi
Sakshi News home page

ఊపందుకుంటున్న నియామకాలు..ఉజ్వల కెరీర్‌కు వ్యూహాలు

Published Sun, Nov 2 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

In the recruitment process in the private sector

దేశంలో ప్రైవేట్ రంగంలో నియామకాల ప్రక్రియ ఊపందుకుంటోంది. కార్పొరేట్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారీఎత్తున నియామకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దాంతో కొత్త  సంవత్సరంలో కోర్సులు పూర్తి చేసుకోబోయే విద్యార్థులు ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే, కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోణంలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఊరిస్తున్న  కొలువుల పరుగులో ముందుండేందుకు, ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు..
 
 ‘2015-16 ఆర్థిక సంవత్సరం.. అన్ని రంగాల్లో ఉద్యోగార్థులకు ఆశావహంగా నిలవనుంది. కారణం.. దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తుండటమే. ఇప్పటికే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు 2015-16 సంవత్సరానికి సంబంధించి తమ విస్తరణపై స్పష్టత ఇచ్చాయి. భారీ సంఖ్యలో నియామకాలు చేపడతామని పేర్కొన్నాయి. తాజా ప్రతిభావంతులను ఆకట్టుకునేందుకు క్యాంపస్‌లవైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఐఐఎంలు సహా ప్రముఖ బీస్కూల్స్‌లో 2015 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. మరెన్నో సంస్థలు పూర్తి స్థాయి నియామకాల దిశగా ప్రాంగణ నియామ కాలు చేపడుతున్నాయి. సంస్థలు భారీ సంఖ్యలో అవకాశాలు అందిస్తున్నా.. నైపుణ్యాలు, కంపెనీ అవసరాల విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. కాబట్టి ఔత్సాహికులు రెజ్యుమే నుంచి రియల్ టైమ్ నాలెడ్జ్ వరకు అన్ని విషయాల్లో ప్రతిభా పాటవాలు చూపితేనే ఆఫర్ లెటర్ చేతికందుతుంది. ఇందుకోసం అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలపై నిపుణుల సూచనలు..
 
స్వీయ విశ్లేషణ

ఇష్టమైన కెరీర్‌ను సొంతం చేసుకునే విషయంలో ముందుగా దృష్టి సారించాల్సిన అంశం.. స్వీయ విశ్లేషణ. భవిష్యత్ కెరీర్‌కు సంబంధించి అవగాహన పెంచుకోవాలి. తమ వాస్తవ నైపుణ్యాలు, సహజ ఆసక్తులు ఏంటో పరిశీలించాలి. అప్పుడే కోరుకుంటున్న ఉద్యోగంపై స్పష్టత వస్తుంది. ఫలితంగా ఎంపిక ప్రక్రియలో ముందుండేలా సంసిద్ధులయ్యేందుకు మార్గాలు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా సాఫ్ట్‌స్కిల్స్‌ను ముఖ్య నైపుణ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్థలు పరిగణిస్తున్నాయి. కాబట్టి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొంటున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ వైపు మొగ్గు చూపేలా అభ్యర్థులు ముందుగానే సిద్ధం కావాలి. ఎంచుకున్న రంగంలో భవిష్యత్తులో ఏ మేరకు నిలదొక్కుకోగలమనే విషయంలోనూ దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి.
 
ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా

ప్రస్తుతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో చిన్న తరహా కంపెనీలు మొదలు బహుళ జాతి సంస్థల వరకు అనేక రంగాలకు చెందిన చిన్నా,పెద్దా కంపెనీలు పాల్గొంటున్నాయి. దాంతో సహజంగానే విద్యార్థులు పేరున్న సంస్థలవైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. కానీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే.. ఆసక్తి, అభిరుచులకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా కంపెనీలను, ఉద్యోగాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అలా చేయాలంటే ఆయా కంపెనీలు నిర్వహించే ఎంపిక విధానాలపై అవగాహన పెంచుకొని సంసిద్ధులు కావాలి.
 
బలాలు, బలహీనతలు

అభ్యర్థులు తమకు సరితూగే రంగాన్ని ఎంచుకున్నాక  తక్షణమే దృష్టిపెట్టాల్సిన మరో ముఖ్యాంశం.. వ్యక్తిగత బలాలు, బలహీనతలు. తామెంచుకున్న రంగంలో రాణించేందుకు ఇప్పటికే తమకున్న నైపుణ్యాలు ఏవి, ఇంకా పొందాల్సిన నైపుణ్యాలు ఏంటి? అని ప్రశ్నించుకుంటూ.. తమ బలాలు, బలహీనతలపై విశ్లేషణ చేసుకోవాలి. ఫలితంగా భవిష్యత్తులో నిర్వహించే విధుల్లో మంచి పనితీరు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ డొమైన్ ఆధారంగా కెరీర్ కోరుకునే అభ్యర్థులు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. తరగతి గదుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం.. వాస్తవ పరిస్థితులు, కంపెనీల వాస్తవ అవసరాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాలను గుర్తించి ముందడుగు వేయాలి.
 
సెల్ఫ్ బ్రాండింగ్.. ఎంతో కీలకం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే.. అత్యంత ఆవశ్యకమైన అంశం సెల్ఫ్ బ్రాండింగ్ లేదా సెల్ఫ్ మార్కెటింగ్. అంటే.. ఒక అభ్యర్థి ఇతరులతో పోల్చితే తనకున్న నైపుణ్యాలను మరింత మెరుగైన రీతిలో ఎదుటి వారికి తెలియజేయడం. అదే విధంగా తనలోని నైపుణ్యాల గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేసేలా వ్యవహరించడం. దీనికి అనువైన సాధనాలు.. సోషల్ మీడియా వెబ్‌సైట్స్. వీటి ద్వారా అభ్యర్థులు తమ నైపుణ్యాలను వెల్లడించి తద్వారా అవకాశాలను అందుకోవచ్చు.
 
ఇంటర్న్‌షిప్స్.. జాబ్ ఆఫర్‌కు మార్గం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు చేపట్టే నియామకాల్లో విజయం సాధించేందుకు ప్రస్తుతం విద్యార్థులు చేయాల్సిన మరో ముఖ్యమైన పని.. ఇంటర్న్‌షిప్స్. ఇందుకోసం విద్యార్థులు తమ కోర్సుకు సరితూగే ఏదో ఒక సంస్థలో ఇంటర్న్‌షిప్స్ చేయడం ఉపయుక్తం. దీనివల్ల అకడమిక్స్‌తోపాటు సమాంతరంగా ఇండస్ట్రీ నాలెడ్జ్ కూడా లభిస్తుంది. కోర్సు పూర్తయ్యేనాటికి జాబ్ రెడీ స్కిల్స్ విషయంలో ఇతరుల కంటే ముందుండేందుకు ఎంతో ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్స్‌లో మంచి పనితీరు కనబరిస్తే అదే సంస్థలో శాశ్వత నియామకం సొంతం చేసుకునే వీలుంది. ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే ఇంటర్న్‌షిప్ చేసిన సంస్థల నుంచి ఫైనల్ ఆఫర్ పొందిన వారి సంఖ్య 50 నుంచి 60 శాతం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు వచ్చే వేసవిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉద్యుక్తులవడం ఎంతో ఉపకరిస్తుంది.
 
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇలా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ విద్యా సంస్థలలో ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. మిగతావాటిలో నవంబర్, డిసెంబర్‌లల్లో పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు ఎన్నో అంశాలపై కసరత్తు చేయాలి. సదరు ఇన్‌స్టిట్యూట్‌కు వస్తున్న కంపెనీలు, తమ నేపథ్యానికి సరితూగే సంస్థలు, అవి ఆఫర్ చేస్తున్న ఉద్యోగాలు-నిర్వర్తించాల్సిన విధులు, ఎంపిక ప్రక్రియలో అవి నిర్దేశించే నిబంధనలు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అభ్యర్థులు ఈ అంశాలన్నింటిపైనా స్పష్టత ఏర్పరచుకున్నాక.. సదరు కంపెనీల నేపథ్యం, ప్రస్తుత పనితీరు, కంపెనీ మార్కెట్ వ్యవహారాలు, భవిష్యత్తు ప్రణాళికలపైనా సమాచారం సేకరించుకుంటే ఒక అడుగు ముందున్నట్లే. ఇది ఇంటర్వ్యూలో విజయానికి ఎంతో ఉపకరిస్తుంది.
 
ఇంటర్వ్యూ.. ప్రశ్న- సమాధానం కాదు

ఇంటర్వ్యూ అనగానే విద్యార్థుల్లో ఒక రకమైన బిడియం, ఆందోళన సహజం. చాలామంది ఇంటర్వ్యూ అంటే.. ప్రశ్న - సమాధానం అనే అభిప్రాయంతో ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి ఇప్పుడు కంపెనీల దృక్పథం మారింది. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాయి. కొశ్చన్ అండ్ ఆన్సర్‌కు బదులు చిన్నపాటి డిబేట్ మాదిరిగా ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నాయి. తద్వారా అభ్యర్థుల్లో విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. ఇలా మరెన్నో నైపుణ్యాలను తెలుసుకుంటున్నాయి. ఇటు అభ్యర్థులు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు వీలు కలుగుతోంది. అయితే అభ్యర్థులు కొంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని అంశాల గురించి చర్చకు తెరదీస్తే చిక్కుల్లో పడినట్లే. కాబట్టి ఇంటర్వ్యూలో చర్చ జరుగుతున్న తీరును, తద్వారా కంపెనీ ప్రతినిధులు కోరుకుంటున్న అంశాలను సునిశితంగా గమనించాలి. రాత పరీక్ష, సాంకేతిక పరీక్ష ద్వారా అభ్యర్థిలోని సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై స్పష్టత పొందిన కంపెనీలు ఇంటర్వ్యూలో.. సామాజిక అంశాలపైనా చర్చించే అవకాశం ఉంటుంది. ఆయా అంశాలు తెలియకపోతే.. తెలియదని నిజాయతీగా ఒప్పుకోవాలి.
 
సూటిగా రెజ్యుమే


రెజ్యుమే.. ఉద్యోగ సాధన దిశగా తొలి ఆయుధం. ఎంపిక ప్రక్రియలో మలి దశకు పిలుపు అనేది రెజ్యుమేపైనే ఆధారపడి ఉంటోంది. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రెజ్యుమే అంటే.. రెండు, మూడు పేజీలు నింపాల్సిన రోజులు పోయాయి. తమ కెరీర్ ఆబ్జెక్టివ్, ఇప్పటివరకు సాధించిన విజయాలపై ఒక్క పేజిలో సూటిగా, స్పష్టంగా తెలియజేయాలి. సరళమైన భాషలో ఉండేలా రెజ్యుమేను రూపొందించాలి. ఇలా అన్ని దశల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. కోరుకున్న కొలువును దక్కించుకోవచ్చు.
 
అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు

 
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కొలువులను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న అభ్యర్థులు.. కొన్ని పొరపాట్లు చేసి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. సాధారణంగా అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు..
     
 పే ప్యాకేజ్‌కు ఆకర్షితులు కావడం: ప్రస్తుతం పలువురు అభ్యర్థులు లక్షల రూపాయాల్లో లభిస్తున్న పే ప్యాకేజ్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సహజ ఆసక్తులను పట్టించుకోవడం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది.
     
 లోపిస్తున్న స్పష్టత: అభ్యర్థుల కోణంలో కనిపిస్తున్న మరో ప్రధానమైన పొరపాటు స్పష్టత లేమి. తమ నేపథ్యం, దానికి అనుగుణంగా లభించే అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చాలామంది అభ్యర్థుల్లో అవగాహన లోపిస్తోంది. కానీ కంపెనీలు అభ్యర్థుల విషయంలో ఎంతో స్పష్టతతో వ్యవహరిస్తున్నాయి.
     
 విధుల గురించి అవగాహన లేమి: అభ్యర్థులకు తాము చేరదలచుకున్న సంస్థల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. ఉద్యోగ విధుల విషయంలో అవగాహన పొందలేకపోతున్నారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో నిర్వహించే బాధ్యతల విషయంలో ముందస్తు అవగాహన కూడా చాలా అవసరం.
     
 పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కావడం: ఇది కూడా నేటి ఉద్యోగార్థులు చేస్తున్న మరో పొరపాటు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితమై.. రియల్‌టైం నాలెడ్జ్ పెంచుకునే దిశగా కృషి చేస్తున్న వారి సంఖ్య చాలా స్వల్పం. కంపెనీలు థియరిటికల్ నాలెడ్జ్‌తోపాటు రియల్ టైం నాలెడ్జ్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
     
‘కమ్యూనికేషన్’ స్కిల్స్ లేమి: కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడంపైనా అభ్యర్థులు చూపిస్తున్న శ్రద్ధ తక్కువే. కానీ కార్పొరేట్ సంస్కృతిలో.. బృందాలతో కలిసి పనిచేయాల్సిన వాతావరణంలో వివిధ నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతో అవసరం.
 
మౌలిక రంగంలో మెరుగైన అవకాశాలు

ప్రస్తుతం ఐటీతోపాటు పురోగమిస్తున్న రంగం.. మౌలిక రంగం. ప్రభుత్వ, ప్రై వేటు.. రెండు రంగాల్లోనూ పలు నిర్మాణ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఈ రంగంలో నియామకాల సంఖ్య భారీగా పెరగనుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. కేవలం ఒక మేజర్‌కే పరిమితం కాకుండా.. అనుబంధ విభాగాల్లో నైపుణ్యం సాధిస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ రంగంలో ఆవిష్కృతమవుతున్న నూతన సాఫ్ట్‌వేర్స్‌పై అవగాహన పొందితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
 - జగదీశ్ రెడ్డి, హెడ్- హెచ్.ఆర్., జీఎంఆర్ ఇన్‌ఫ్రా
 
ప్యూర్ సైన్స్‌లో డీప్ నాలెడ్జ్

ఫార్మాస్యూటికల్, లైఫ్ సెన్సైస్ తదితర ప్యూర్ సైన్స్ సంస్థలలో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు నిరంతరం ఆయా అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఈ రంగాల్లో నిరంతరం పరిశోధనలు జరుగుతూ కొత్త అంశాలు ఆవిష్కృతమవుతున్నాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. అభ్యర్థులను నియమించుకునే క్రమంలో నాలెడ్జ్‌కు కంపెనీలు పెద్దపీట వేస్తాయి. అదే విధంగా విధుల్లో చేరిన అభ్యర్థులు కేవలం తమ విభాగానికే పరిమితం కాకుండా.. సంస్థలోని ఇతర విభాగాల పనితీరుపైనా అవగాహన పొందితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది.
 - అజ్దాన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్- హెచ్.ఆర్., సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
 
ఈ-కామర్స్.. టెక్నికల్ + జనరల్

ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాల వెబ్‌సైట్లు విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి యువత ఉపాధి అవకాశాలకు ప్రధాన వేదికగా ఈ-కామర్స్ రంగం నిలుస్తోంది. ఈ-కామర్స్ సంస్థల్లో టెక్నికల్, జనరల్ అన్ని విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిందల్లా సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్.
 - బి.ఎస్. సుమంత్,టెక్నికల్ రిక్రూటర్, లింక్డ్ ఇన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement