స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్‌లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ..
ఇంటర్న్‌షిప్స్
అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్‌షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్‌షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తున్నాయి. బీటెక్‌లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్‌గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్‌నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు.
ప్రాజెక్ట్ వర్క్స్
విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్‌లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్‌ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సెషన్స్‌ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్‌లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్‌ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు.
అప్రెంటీస్‌షిప్స్
అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్‌నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్‌షిప్‌లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్‌ఈఎల్, ఓఎన్‌జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్‌లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్‌షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది.
ఆన్ జాబ్ ట్రైనింగ్
స్కిల్ గ్యాప్‌నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్‌లో బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్‌డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి.
సర్టిఫికేషన్లు ఎన్నెన్నో
స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు..
ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్‌మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది.
ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్‌ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి.
డొమైన్‌తోపాటు మరెన్నో స్కిల్స్
ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు..
ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం
రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం
బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం
కోర్ డొమైన్: 14 శాతం
పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం
ఇంటర్న్‌షిప్స్.. వే టు ఎంప్లాయ్‌మెంట్
కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్‌షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్‌మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్‌మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్‌షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్‌ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది.
- బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సయంట్
అప్రెంటీస్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో
టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్, ఎన్‌ఎస్‌డీసీ, ఏటీఐ వెబ్‌సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి.
- కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్‌డీఏటీ, హైదరాబాద్.
స్కిల్స్‌తోపాటు పెరిగే అవకాశాలు
విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
- వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్
ఎడ్యు న్యూస్
ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ - 2014
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్‌హెచ్‌ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
మొత్తం స్కాలర్‌షిప్స్: 10,000
స్కాలర్‌షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్‌షిప్ ఇస్తారు.
అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా
జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి.
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్‌షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే.
ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్‌స్టిట్యూట్‌లో నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014
వెబ్‌సైట్:www.inspire-dst.gov.in/
ఏంజెలా మెర్కెల్ స్కాలర్‌షిప్
జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్‌ఎల్‌ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్‌లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్‌షిప్‌కు ప్రకటన వెలువడింది.
స్కాలర్‌షిప్‌తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్‌లు లభిస్తాయి.
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014
వెబ్‌సైట్: www.daaddelhi.org/en/
మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్
అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: క్యాట్-2014/ఎక్స్‌ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్‌సైట్: www.mica.ac.in