లక్షన్నర డిగ్రీ సీట్లు కుదింపు  | Higher Education Council Decided To Reduce The Courses Demand From Students | Sakshi
Sakshi News home page

లక్షన్నర డిగ్రీ సీట్లు కుదింపు 

Published Mon, Dec 12 2022 3:05 AM | Last Updated on Mon, Dec 12 2022 7:47 AM

Higher Education Council Decided To Reduce The Courses Demand From Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేని కోర్సులను భారీగా కుదించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కనీసం 15 శాతం విద్యార్థులు చేరని కాలేజీలకూ అనుమతి నిరాకరించాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని మండలి వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారులు సమావేశమై దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇంజనీరింగ్‌ విద్యలో ఈ స్థాయి మార్పును ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. విద్యార్థులు చేరని సివిల్, మెకానికల్‌ కోర్సుల్లో దాదాపు 10 వేల వరకూ సీట్లు తగ్గించారు. వాటి స్థానంలో కంప్యూటర్‌ కోర్సులకు అనుమతించారు. ఈ సీట్లు ఈ సంవత్సరం 9 వేలకుపైగా పెరిగాయి. ఇదే విధానాన్ని డిగ్రీ కోర్సుల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కోర్సులు తగ్గబోతున్నాయి. 

1.50లక్షల సీట్లు కుదింపు 
సీట్ల తగ్గింపు ప్రక్రియకు ఈ ఏడాది దోస్త్‌ ప్రవేశాలను కొలమానంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. వీటిలో ఈ ఏడాది దోస్త్‌లో 2,10,970 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. నాన్‌–దోస్త్‌ కాలేజీలు కలుపుకుంటే 2.20 లక్షల సీట్లు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ లెక్కన దాదాపు 2.40 లక్షల సీట్లు మిగిలిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 1.50లక్షల సీట్లు వచ్చే దోస్త్‌లో లేకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

గత కొన్నేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది బీకాంలో 87,480 మంది చేరితే బీఎస్సీ లైఫ్‌సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌లో కలిపి 75896 మంది చేరారు. సగానికిపైగా ఆక్రమించిన ఈ కోర్సులకు రాబోయే కాలంలోనూ మంచి డిమాండ్‌ ఉండొచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇక బీఏలో కేవలం 31838 మంది చేరారు. ఈ కోర్సులో 75 వేలకుపైగా సీట్లున్నాయి. ఇలాంటి కోర్సులను తగ్గించే యోచనలో ఉన్నారు. బీబీఎం, ఒకేషనల్, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు.  

కాలేజీల్లో అవగాహన 
గత నాలుగేళ్ల డేటాను సేకరించిన ఉన్నత విద్యా మండలి జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలను 50 వరకూ గుర్తించారు. 15 శాతం లోపు విద్యార్థులు చేరిన సెక్షన్లు వంద వరకూ ఉంటాయని అంచనా. ఇలాంటి కాలేజీల యాజమాన్యాల్లో ముందుగా అవగాహన కల్గించే యోచనలో ఉన్నారు. విద్యార్థులు ఎక్కువగా డిగ్రీ కోర్సులకు కూడా హైదరాబాద్‌ వరకూ వస్తున్నారు. డిగ్రీతో పాటు ఇతర కోర్సులు నేర్చుకునే అవకాశం ఉండటంతో ఈ తరహా ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే కాలేజీల్లో చేరికలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి కాలేజీల్లో కంప్యూటర్‌ అనుసంధానమైన కోర్సులు ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా ఇతర కోర్సుల్లోకి సీట్లు మార్చుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీనికి ముందుకు రాకపోతే కాలేజీల్లో సీట్లు తగ్గించడం, విద్యార్థులు లేని కాలేజీలకు అనుమతులు రద్దు చేసే వీలుంది. 

సీట్ల మార్పిడికి అవకాశం
విద్యార్థులు చేరని కో­ర్సులను ఇంకా కొనసాగించడం సరికాదు. డిమాండ్‌ ఉన్న కోర్సు­ల్లో, అదనపు సెక్షన్లు పెంచుకునే అవకాశం క­ల్పి­స్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. డి­మాండ్‌కు తగ్గట్టుగానే డిగ్రీ సీట్లకు అనుమతించాలనే ఆలోచనకు కార్యరూపం తీసుకొస్తాం.  
– ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement