- కాషాయ కూటమికి ఖరారైన ఏఎంసీ పీఠం
- 29న కార్పొరేటర్లతో సమావేశం
- నవీముంబై రేసులో ముందున్న ఎన్సీపీ
- సంఖ్యాబలం కోసం జోరుగా ప్రయత్నాల
సాక్షి, ముంబై: కార్పొరేషన్‌ల ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తి కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పై పార్టీలు దృష్టి సారించాయి. ఔరంగాబాద్‌లో అత్యధికంగా 52 స్థానాలు కైవసం చేసుకున్న శివసేన, బీజేపీ అధికారంలో కూర్చోవడం ఖాయమని తేలిపోయింది. 113 స్థానాల్లో శివసేనకు 29, బీజేపీకి 23 మొత్తం 52 స్థానాలు కైవసం చేసుకుని కాషాయ కూటమి పెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు కావాలి. దీంతో గెలిచిన కొందరు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి శనివారం ఉదయం బీజేపీ, శివసేన నాయకుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి మేయర్, తక్కువ వచ్చిన పార్టీకి డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. ఎవరు, ఎంత కాలం ఏ పదవుల్లో కొనసాగాలనే విషయంపై తుది సమావేశం త్వరలో జరగనుంది. అంతకు ముందుగానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక విషయంపై చర్చించేందుకు ఈ నెల 29న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు.
‘నవీముంబై’ ఎన్సీపీదే..?
నవీముంబై కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎస్సీలకు రిజర్వు కావడంతో వాటిని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మొత్తం 111 స్థానాల్లో 52 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మేజిక్ ఫిగర్ కావాలంటే 56 స్థానాలు తప్పనిసరి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. 44 స్థానాలు దక్కించుకున్న శివసేన, బీజేపీ కూటమి కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, 10 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోయినా అధికారం కోసం ఇండిపెండెంట్లను లాక్కునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం అధికారం ఎన్సీపీకే దక్కడం దాదాపు ఖాయమైనప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనే విషయం త్వరలో తేలనుంది. మేయర్ పదవులకు మే తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
మేయర్ పీఠం ఎవరిదో..
Published Sat, Apr 25 2015 10:37 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement
Advertisement