the parties
-
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్‌జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
పుట్టినరోజు దండగే.. అందరికీ..!
పుట్టిన రోజు పండుగే.. అందరికీ.. అని మనం పాడుకుంటాంగానీ.. కమ్యూనిస్టు చైనాలోని సిచువాన్ రాష్ట్రం, టాంగ్జియాంగ్ కౌంటీ అధికార యంత్రాంగం మాత్రం పుట్టినరోజు అందరికీ దండగే అని తీర్మానించేసింది. బర్త్‌డే పార్టీలకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సమాజానికి ఆర్థికభారం మోపుతున్నారని, అందువల్ల ఇకపై ఎవరూ పుట్టినరోజు పార్టీలు జరుపుకోరాదని హుకుం జారీ చేసింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రం చిన్న మినహాయింపునిచ్చింది. వారు పుట్టినరోజు నాడు విందులు ఇచ్చుకోవచ్చని, కాకపోతే దశాబ్దానికి ఒకసారి మాత్రమే అని షరతు విధించింది! విందుల్లో అతిథులకు రకరకాల వంటలు వడ్డించాల్సి వస్తుంది. అతిథులు కూడా బహుమతులు పట్టుకు రావల్సి వస్తుంది. దీనివల్ల అటు పుట్టినరోజు పండుగ జరుపుకొనే కుటుంబంపైనా, ఇటు ఆ పండుగకు విచ్చేసిన అతిథులపైనా ఆర్థికంగా భారం పడుతుందని, అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నట్లు సదరు అధికారులు పేర్కొన్నారు. దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందట. దేశ ప్రజలంతా సంపన్నులేమీ కాదని, విందులు, వినోదాల వల్ల వారిపై నిజంగానే భారం పెరిగిపోతోందంటూ కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారట. 70 ఏళ్లకు మించి జీవించేవారి పుట్టినరోజులు జరుపుకోవడం సముచితమేనని, దశాబ్దంలో ఒక్కసారే జరుపుకోవాలని పరిమితులు విధించడమే సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారట. అయితే, ఈ నిషేధంపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించిన తర్వాత నిబంధనలను సవరిస్తామని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఆ సవరణలు ఎలా ఉంటాయోనని ప్రజలు దిగులు పడుతున్నారట! -
మేయర్ పీఠం ఎవరిదో..
- కాషాయ కూటమికి ఖరారైన ఏఎంసీ పీఠం - 29న కార్పొరేటర్లతో సమావేశం - నవీముంబై రేసులో ముందున్న ఎన్సీపీ - సంఖ్యాబలం కోసం జోరుగా ప్రయత్నాల సాక్షి, ముంబై: కార్పొరేషన్ల ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తి కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పై పార్టీలు దృష్టి సారించాయి. ఔరంగాబాద్‌లో అత్యధికంగా 52 స్థానాలు కైవసం చేసుకున్న శివసేన, బీజేపీ అధికారంలో కూర్చోవడం ఖాయమని తేలిపోయింది. 113 స్థానాల్లో శివసేనకు 29, బీజేపీకి 23 మొత్తం 52 స్థానాలు కైవసం చేసుకుని కాషాయ కూటమి పెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు కావాలి. దీంతో గెలిచిన కొందరు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి శనివారం ఉదయం బీజేపీ, శివసేన నాయకుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి మేయర్, తక్కువ వచ్చిన పార్టీకి డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. ఎవరు, ఎంత కాలం ఏ పదవుల్లో కొనసాగాలనే విషయంపై తుది సమావేశం త్వరలో జరగనుంది. అంతకు ముందుగానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక విషయంపై చర్చించేందుకు ఈ నెల 29న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ‘నవీముంబై’ ఎన్సీపీదే..? నవీముంబై కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎస్సీలకు రిజర్వు కావడంతో వాటిని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మొత్తం 111 స్థానాల్లో 52 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మేజిక్ ఫిగర్ కావాలంటే 56 స్థానాలు తప్పనిసరి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. 44 స్థానాలు దక్కించుకున్న శివసేన, బీజేపీ కూటమి కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, 10 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోయినా అధికారం కోసం ఇండిపెండెంట్లను లాక్కునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం అధికారం ఎన్సీపీకే దక్కడం దాదాపు ఖాయమైనప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనే విషయం త్వరలో తేలనుంది. మేయర్ పదవులకు మే తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. -
ఎన్నికల హామీలు నెరవేర్చేలా చూడాలి
కావలి అర్బన్: ఎన్నికలకు ముందు పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తు.చ.తప్పకుండా నెరవేర్చేలా ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తే బాగుంటుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గౌరవరంలో సోమవారం జరిగిన జన్మభూమి-మాఊరు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు ఎలా నెరవేర్చాలో తెలిపే కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. 2004కి ముందు 17 లక్షలుగా ఉన్న సామాజిక పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను దివంగ త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75 లక్షలకు పెంచి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్నారన్నారు. రాష్ట్రాన్ని వైఎస్సార్ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రస్తుత పాలకులకు సూచించారు. తుపాన్ నేపథ్యంలో నాలుగు జిల్లాల ప్రజలు అతలాకుతలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వాసితులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు చేపట్టిన బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛభారత్, జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతోందన్నారు. మేధస్సు దైవప్రసాదమని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో టీ అమ్మిన నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ప్రజలందరూ వ్యక్తిగత, పరిసరలా పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. శుభ్రతతోనే జీవనప్రమాణాల మెరుగు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుమ్మలపెంట పీహెచ్సీ సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించగా, గర్భిణులకు ఐసీడీఎస్ సిబ్బంది సీమంతాలు చేశారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉపసర్పంచ్ చేజర్ల శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి. వసుంధర, సూపరింటెండెంట్ అన్నపూర్ణరావు, క్లస్టర్ అధికారిణి డాక్టర్ ఎ. సెలీనా కుమారి, హౌసింగ్ డీఈ వెంకట స్వామి, తుమ్మలపెంట పీహెచ్సీ వైద్యులు వై వెంకటేశ్వర్లు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ శ్యామల, ఐకేపీ ఏపీఎం షాలీమ్ రోజ్, పంచాయతీ సెక్రటరీ చెన్నకేశవులు, వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి, నాయకులు గోసల గోపాల్ రెడ్డి, మేదరమెట్ల ఈశ్వర్‌రెడ్డి, మెడబల్లి యానాది, ఇనగంటి రామయ్య, దాసరి వెంకయ్య, చింతం రామిరెడ్డి, మేదరమెట్ల మధుసూదన్ రెడ్డి, కున్నం శ్రీనివాసులు రెడ్డి, కొందూరు శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.