పుట్టినరోజు దండగే.. అందరికీ..!
పుట్టిన రోజు పండుగే.. అందరికీ.. అని మనం పాడుకుంటాంగానీ.. కమ్యూనిస్టు చైనాలోని సిచువాన్ రాష్ట్రం, టాంగ్‌జియాంగ్ కౌంటీ అధికార యంత్రాంగం మాత్రం పుట్టినరోజు అందరికీ దండగే అని తీర్మానించేసింది. బర్త్‌డే పార్టీలకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సమాజానికి ఆర్థికభారం మోపుతున్నారని, అందువల్ల ఇకపై ఎవరూ పుట్టినరోజు పార్టీలు జరుపుకోరాదని హుకుం జారీ చేసింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రం చిన్న మినహాయింపునిచ్చింది. వారు పుట్టినరోజు నాడు విందులు ఇచ్చుకోవచ్చని, కాకపోతే దశాబ్దానికి ఒకసారి మాత్రమే అని షరతు విధించింది! విందుల్లో అతిథులకు రకరకాల వంటలు వడ్డించాల్సి వస్తుంది. అతిథులు కూడా బహుమతులు పట్టుకు రావల్సి వస్తుంది.
దీనివల్ల అటు పుట్టినరోజు పండుగ జరుపుకొనే కుటుంబంపైనా, ఇటు ఆ పండుగకు విచ్చేసిన అతిథులపైనా ఆర్థికంగా భారం పడుతుందని, అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నట్లు సదరు అధికారులు పేర్కొన్నారు. దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందట. దేశ ప్రజలంతా సంపన్నులేమీ కాదని, విందులు, వినోదాల వల్ల వారిపై నిజంగానే భారం పెరిగిపోతోందంటూ కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారట. 70 ఏళ్లకు మించి జీవించేవారి పుట్టినరోజులు జరుపుకోవడం సముచితమేనని, దశాబ్దంలో ఒక్కసారే జరుపుకోవాలని పరిమితులు విధించడమే సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారట. అయితే, ఈ నిషేధంపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించిన తర్వాత నిబంధనలను సవరిస్తామని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఆ సవరణలు ఎలా ఉంటాయోనని ప్రజలు దిగులు పడుతున్నారట!