ఎన్నికల హామీలు నెరవేర్చేలా చూడాలి
కావలి అర్బన్: ఎన్నికలకు ముందు పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తు.చ.తప్పకుండా నెరవేర్చేలా ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తే బాగుంటుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గౌరవరంలో సోమవారం జరిగిన జన్మభూమి-మాఊరు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు ఎలా నెరవేర్చాలో తెలిపే కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు.
2004కి ముందు 17 లక్షలుగా ఉన్న సామాజిక పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను దివంగ త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75 లక్షలకు పెంచి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్నారన్నారు. రాష్ట్రాన్ని వైఎస్సార్ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రస్తుత పాలకులకు సూచించారు. తుపాన్ నేపథ్యంలో నాలుగు జిల్లాల ప్రజలు అతలాకుతలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వాసితులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వాలు చేపట్టిన బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛభారత్, జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతోందన్నారు. మేధస్సు దైవప్రసాదమని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లో టీ అమ్మిన నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ప్రజలందరూ వ్యక్తిగత, పరిసరలా పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
శుభ్రతతోనే జీవనప్రమాణాల మెరుగు
ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తుమ్మలపెంట పీహెచ్‌సీ సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించగా, గర్భిణులకు ఐసీడీఎస్ సిబ్బంది సీమంతాలు చేశారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉపసర్పంచ్ చేజర్ల శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి. వసుంధర, సూపరింటెండెంట్ అన్నపూర్ణరావు, క్లస్టర్ అధికారిణి డాక్టర్ ఎ. సెలీనా కుమారి, హౌసింగ్ డీఈ వెంకట స్వామి, తుమ్మలపెంట పీహెచ్‌సీ వైద్యులు వై వెంకటేశ్వర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓ శ్యామల, ఐకేపీ ఏపీఎం షాలీమ్ రోజ్, పంచాయతీ సెక్రటరీ చెన్నకేశవులు, వైఎస్సార్‌సీపీ రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి, నాయకులు గోసల గోపాల్ రెడ్డి, మేదరమెట్ల ఈశ్వర్‌రెడ్డి, మెడబల్లి యానాది, ఇనగంటి రామయ్య, దాసరి వెంకయ్య, చింతం రామిరెడ్డి, మేదరమెట్ల మధుసూదన్ రెడ్డి, కున్నం శ్రీనివాసులు రెడ్డి, కొందూరు శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.